ప్రతి నాలుగైదు రోజులకు కొత్త పొరలు!
మెడి క్షనరీ
సాంకేతికంగా అన్నవాహిక (ఈసోఫేగస్), చిన్న పేగు తొలి భాగం (డియోడినమ్) భాగాల మధ్య ఉన్న సంచి వంటి భాగాన్ని ‘కడుపు’ (స్టమక్) అంటారు. మనం తిన్న ఆహారం కడుపు నుంచి జీర్ణం కావడం ప్రారంభమవుతుంది. ఈ భాగంలోని హైడ్రోక్లోరిక్ యాసిడ్‌తో పాటు పెప్సిన్ అనే రసాయనం విడుదల అవుతుంది. పెప్సిన్ ప్రోటీన్లను జీర్ణం చేస్తుంది. కడుపులో స్రవించే యాసిడ్ ఆహారంతో పాటు కడుపు కండరాలపై కూడా పనిచేస్తుంది. అందుకే స్టమక్ లోపలి భాగం ఈ యాసిడ్‌ను తట్టుకునేందుకు మ్యూకస్ అనే తడిని స్రవిస్తుంటుంది.
అయినప్పటికీ యాసిడ్ కడుపులోని లోపలి గోడలనూ జీర్ణం చేస్తుండటంతో ప్రతి నాలుగైదు రోజులకు ఒకసారి లోపలి లైనింగ్ పొర కొత్తగా పుడుతూ యాసిడ్ వల్ల ధ్వంసమైన భాగాన్ని ఆక్రమిస్తుంటుంది. ఇలా కడుపు లోపలి కండరాలు ఆకలి లేనప్పుడు ముడుచుకుంటూ, తిన్న తర్వాత సాగుతూ ఉండేలా ‘ముడుతల’తో ఉంటాయి. ఈ ముడుతలనే ‘గ్యాస్ట్రిక్ రుగీ’ (Gastric Rugae) అంటారు.