శరవేగంగా పోలవరం పనులు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ (జలాశయం), జలవిద్యుత్ కేంద్రం పనులకు శుక్రవారం భూమి పూజ చేసిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ శనివారం పనులు ప్రారంభించింది. శరవేగంగా పనులు పూర్తి చేయడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, 24 గంటలూ పనులు చేయడం ద్వారా రెండేళ్లలోగా ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఆ సంస్థ ప్రణాళిక రచించింది. భారీగా యంత్ర సామగ్రిని ప్రాజెక్టు వద్దకు తరలించింది. పోలవరం సీఈ సుధాకర్‌బాబు పర్యవేక్షణలో మేఘా ఇంజనీర్లు, కార్మికులు పనులు ప్రారంభించారు.
గోదావరికి ఇటీవల వచ్చిన వరదల వల్ల ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పాడైన అప్రోచ్ రోడ్లను యుద్ధప్రాతిపదికన బాగు చేస్తున్నారు. భారీ యంత్రాలు 24 గంటలూ రాకపోకలు సాగించడానికి వీలుగా రహదారులను పటిష్టంగా నిర్మిస్తున్నారు. నదిలో వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో తొలుత స్పిల్ వే పనులను చేపట్టాలని కాంట్రాక్టు సంస్థకు అధికారులు దిశానిర్దేశం చేశారు. దాంతో స్పిల్ వే పనులకు శ్రీకారం చుట్టిన మేఘా.. స్పిల్ వే, స్పిల్ చానల్ సమీపంలో నిల్వ ఉన్న నీటిని తోడేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క గోదావరిలో వరద తగ్గే కొద్దీ పనుల వేగం పెంచేలా సర్కార్ చర్యలు తీసుకుంటోంది. స్పిల్ వే, స్పిల్ చానల్ పనులకు సమాంతరంగా వరద తగ్గగానే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, జలవిద్యుత్ కేంద్రం పనులను చేపట్టి.. నిర్దేశించిన గడువులోగా పూర్తి చేస్తామని మేఘా పేర్కొంది.