hyman darf and betty elizabeth
-
డార్ఫ్ కొడుకు లచ్చుపటేల్.. తండ్రి చెప్పినట్టే చేశారు!
సాక్షి, ఆసిఫాబాద్ : అడవి బిడ్డల ఆచార సంప్రదాయాలు, వారి జీవన విధానంతో పాటు మారుతున్న కాలంలో ఉనికి కోసం వారు చేస్తున్న పోరాటాలను ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయులు లండన్ ఆంత్రోపాలజీ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ వోన్ ఫ్యూరర్ హైమన్ డార్ఫ్, ఆయన భార్య బెట్టి ఎలిజబెత్. ఈ దంపతులు భౌతికంగా దూరమైనా గిరిజనులకు వారు చేసిన సేవలకు గుర్తుగా ఏటా జనవరి 11న వారివురి వర్ధంతిని ఏజెన్సీలో ఉత్సవంలా నిర్వహిస్తున్నారు. ఈసారి వేడుకల కోసం కుమురం భీం జిల్లా జైనూర్ మండలం మార్లవాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివాసీలపై అధ్యయనం ఆస్ట్రియా రాజధాని వియన్నాలో 1909లో జన్మించిన హైమన్ డార్ఫ్, లండన్‌లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌లో విద్య నభ్యసించారు. తనకు ఇష్టమైన ఆంత్రోపాలజీలో (మానవ వనరుల శాస్త్రం) డాక్టరేట్ చేశారు. భారత్‌లోని నాగా, గోండు, కోయ, కొండ రెడ్లు, చెంచు తదితర తెగల జీవన విధానంపై అధ్యయనం చేసేందుకు భారతదేశంలో పర్యటించారు. 1942 నుంచి 1945 మధ్య హైదరాబాద్ సంస్థానంలోని ఆదిలాబాద్‌లోని గిరిజన తెగలపై అధ్యయనం చేయడం కోసం జైనూర్ మండలం మార్లవాయిలో తన భార్యతో కలిసి నివాసం ఏర్పరుచుకున్నారు. గిరిజనులతో మమేకం డార్ఫ్ దంపతులు గిరిజనులతో మమేకమై వారి ఆచార వ్యవహారాలు, వారి సమస్యలను ప్రపంచానికి తెలియజేశాడు. గిరిజనులపై పరిశోధనకు ఆయన భార్య ఎలిజబెత్ కూడా ఎంతగానో సాయపడేవారని స్థానిక గిరిజనులు చెబుతుంటారు. గిరిజనుల ఆహార అలవాట్లు, ఆరోగ్యం, పండగలు, నృత్యాలు, కర్మ కాండలు, పెళ్లిళ్లు, విడాకులు, వ్యవసాయం, భాష, యాస, నడవడి, సాగుచేసే విధానాలపై హైమన్‌డార్ఫ్ రాసిన పుస్తకాలు ప్రపంచ ఖ్యాతి గడించాయి. 1979లో రెండోసారి భారత్‌కు వచ్చినప్పుడు లండన్‌కు చెందిన మైఖేల్ యార్క్‌తో ఆదివాసీల జీవినం గురించి పలు డాక్యుమెంటరీలు తెరకెక్కించారు. డార్ఫ్ అప్పట్లో తీసిన ఫొటోలు ఇప్పటికీ గిరిజనులపై పరిశోధన చేసే వారికి ఉపయోగపడుతున్నాయి. నిజాంను ఒప్పించి భూ పట్టాలు పంపిణీ ఆదివాసీలు భూమిపై హక్కులేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన హైమన్ డార్ఫ్ వారికి భూములపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు నిజాంతో చర్చలు జరిపారు. అప్పటికే అటవీ భూములను సాగు చేసుకుంటున్న స్థానికులకు ఒక్కొక్కరికి దాదాపు 15 ఎకరాలు ఇప్పించేందుకు కృషి చేశారు. ఆయన కృషి ఫలితంగానే సుమారు 12వేల గిరిజన కుటుంబాలకు భూ పట్టాలు వచ్చాయి. ఈ క్రమంలో నిజాం ప్రభుత్వం ఆయనను కొంత కాలం గిరిజన అభివృద్ధి సలహాదారుగా నియమించింది. ఆదివాసీల హక్కుల రక్షణ కోసం హైమన్ అనేక సూచనలు చేశారు. ఆయన నివాసం ఉన్న మార్లవాయిలో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పి అనేక మంది గిరిజనులను చదువు వైపు నడిచేలా ప్రొత్సహించారు. కొడుకు పేరు లచ్చుపటేల్ హైమన్ డార్ఫ్ దంపతులు మార్లవాయిలో ఉన్నప్పుడు ఆ గ్రామ పెద్ద లచ్చుపటేల్ మరణించాడు. ఆ మరుసటి రోజే డార్ఫ్ భార్య ఎలిజబెత్ ఓ బాబుకు జన్మనిచ్చింది. ఆదివాసీల సంప్రదాయం ప్రకారం ఊరిలో ఎవరైనా చనిపోయిన మరుసటి రోజులోనే ఎవరైనా పుడితే, వారే మళ్లీ పుట్టారని నమ్ముతారు. ఇందుకు గుర్తుగా చనిపోయిన వారి పేరు పెడతారు. ఆ సాంప్రదాయం ప్రకారం డార్ఫ్ దంపతులు తమ కొడుకు పేరు లచ్చుపటేల్ అని నామకరణం చేశారు. ఇక్కడే సమాధి కట్టండి మరణానంతరం దంపతులిద్దరి సమాధులు ఇక్కడే ఏర్పాటు చేయాలని డార్ఫ్ స్థానికులను కోరారు. డార్ఫ్ భార్య ఎలిజబెత్ 1987లో మరణించారు. ఆమె చనిపోయిన తర్వాత డార్ఫ్, ఆయన కొడుకు లచ్చుపటేల్ (నికోలస్) ఎలిజబెత్ చితాభస్మాన్ని లండన్ నుంచి మార్లవాయికి తీసుకొచ్చి సమాధి కట్టించారు. 1995లో హైమన్‌డార్ఫ్ కూడా చనిపోగా.. 2012లో లండన్ నుంచి ఆయన చితాభస్మాన్ని కూడా మార్లవాయికి తీసుకువచ్చి ఎలిజబెత్ సమాధి పక్కనే మరో సమాధి కట్టించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా జనవరి 11న డార్ఫ్ దంపతుల వర్ధంతిని ఆదివాసీలు ఘనంగా నిర్వహిస్తున్నారు. డార్ఫ్ రచనలు –ద చెంచుస్ (1943) – ద రెడ్డీస్ ఆఫ్ బైసన్ హిల్స్ (1945) – ద రాజ్ గోండ్స్ ఆఫ్ ఆదిలాబాద్ (1945) – ద షెర్పాస్ ఆఫ్ నేపాల్ (1964) – ద కొన్యాక్ నాగస్ (1969) – ద ట్రైబ్స్ ఆఫ్ ఇండియా: స్ట్రగుల్ ఫర్ సర్వైవర్ (1982) -
నేడు హైమన్ డార్ఫ్ 31వ వర్ధంతి
సాక్షి, ఆసిఫాబాద్: ఆదివాసీ ఆరాధ్యుడు ప్రొఫెసర్ క్రిస్టోఫర్ వోన్ ఫ్యూరర్ హైమన్‌డార్ఫ్ 31వ వర్ధంతిని గురువారం కుము రం భీం జిల్లా జైనూర్ మండలం మార్ల వాయిలో ఆదివాసీలు ఘనంగా జరపనున్నారు. 1940వ దశకంలో ఆస్ట్రియా దేశపు ఆంత్రోపాలజిస్టు ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలపై అధ్యయనం చేసి వారి స్థితిగతులను ప్రపంచానికి తెలియజేశారు. మార్లవాయిలో నివసించిన ఆయన చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు ఆదివాసీల సమస్యలు వివరించి వారికోసం కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించేలా కృషి చేశారు. 1987లో హైమన్ డార్ఫ్ బార్య ఎలిజబెత్, 1995లో డార్ఫ్ లండన్‌లో చనిపోగా వారి కోరిక మేరకు వారి చితాభస్మం తెచ్చి సమాధులు నిర్మించా రు. అప్పటి నుంచి ఆదివాసీలు డార్ఫ్ వర్ధంతిని ఏటా నిర్వహిస్తున్నారు. -
గిరిజనుల ఆరాధ్య దైవం హైమన్‌డార్ఫ్
జైనూర్, న్యూస్‌లైన్ : మన ఊరు కాదు.. దేశం కాదు. భాష కూడా తెలియదు. వారికి తెలిసిందల్లా ఒక్క టే.. ఆదివాసీ గిరిజనులను బాహ్య ప్రపంచానికి పరిచయం చేయడం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారి దరిచేర్చడం. అందుకు అనుగుణం గా ప్రణాళిక రూపొందించారు. అలా ఆదివాసీ గిరిజనుల గుండెల్లో గూడు కట్టుకున్నారు లండన్ దేశానికి చెందిన ప్రొఫెసర్ హైమన్‌డార్ఫ్, బెట్టి ఎలిజబెత్ దంపతులు. వారికి ఆరాధ్య దైవాలుగా మారారు. శనివారం వారి వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం.. లండన్‌కు చెందిన హైమన్‌డార్ఫ్ 1930 లో మానవ పరిణామక్రమంపై పరిశోధన చే స్తూ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు. గిరిజనుల స్థితిగతులపైనా అధ్యయనం చేశా రు. 1940లో కొమురం భీమ్ భూ పోరాటం ని జాం ప్రభుత్వంతో సాగుతోంది. ఇది గిరిజనులకు, ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. భీమ్ మరణానంతరం నిజాం ప్రభుత్వం గిరిజనులకు మేలు చేయడానికి సంకల్పించింది. దీంతో ఇక్కడి గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చే యడానికి హైమన్‌డార్ఫ్‌ను పంపించింది. గిరి జనుల సమస్యలు పరిష్కరించడమే కాకుండా వారి డిమాండ్లనే తీర్చాలని నిజాం ప్రభుత్వం తో ఒప్పందం కుదుర్చుకుని జిల్లాలో గిరిజను లు ఉన్న ప్రాంతాలకు వచ్చారు. భూమిపై హ క్కు కోసం భీమ్ పోరాటం సాగిందని తెలుసుకున్న ఆయన ఆ కాలంలోనే గిరిజనులు సాగు చేసుకున్న భూములకు పట్టాలు ఇప్పించారు. అన్ని రంగాల్లో గిరిజనులు వెనుకబడి ఉన్నార ని, విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి చెందాల్సి ఉందని ప్రభుత్వానికి నివేదించారు. గిరిజన గ్రామాల్లో పెద్దలతో చర్చించి ఆసిఫాబాద్, జై నూర్, సిర్పూర్(యు), గిన్నేదరి ప్రాంతాల్లో స్వచ్ఛంద పాఠశాలలను ఏర్పాటు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ పాఠశాలలను ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలలుగా గు ర్తించింది. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయా లు గొప్పవని తెలుసుకుని వాటిని ఆచరించా రు. 1940 నుంచి మార్లవాయి గిరిజన గ్రామం లో నివాసం ఏర్పర్చుకుని వస్తూ పోతుండేవా రు. ఈ అధ్యయనంలో హైమన్‌డార్ఫ్‌కు ఆయ న భార్య బెట్టి ఎలిజబెత్ చేదోడు వాదోడుగా నిలిచింది. ఆమె కూడా ఇక్కడే ఉంటూ గిరిజ నుల అభివృద్ధి కోసం కృషి చేశారు. 1986లో హైదరాబాద్‌లో జాతీయ గిరిజన సదస్సులో గిరిజనుల స్థితిగతులపై వివరించేందుకు నివేదిక సిద్ధం చేస్తుండగా బెట్టి ఎలిజబెత్ అక్కడే హఠాన్మరణం పొందారు. ఆమె కోరిక మేరకు మార్లవాయి గ్రామంలో గిరిజన సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. భార్య సమాధి పక్కనే తన సమాధి కట్టించి అంత్యక్రియలు ఇక్కడే నిర్వహించాలని హైమన్‌డార్ఫ్ పేర్కొన్నారు. ప్రతిసారి ఎలిజబెత్ వర్ధంతికి హాజరై గిరిజనులతో కలిసి ఉండేవారు. గిరిజనులతో మమేకం అయిన ఆయన తన కుమారుడికి లచ్చుపటేల్(నికోలస్) అని నామకరణం చేశారు. ఐటీడీఏ ఏర్పడిన తర్వాత అప్పటి అధికారులతో సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేయించారు. 11 ఏళ్ల తర్వాత.. తండ్రి కోరిక తీర్చిన తనయుడు స్వదేశం లండన్‌కు వెళ్లిన హైమన్‌డార్ఫ్ వృద్ధాప్యంతో 1995లో మృతిచెందారు. హైమన్‌డార్ఫ్ కోరిక మేరకు మార్లవాయిలో నిర్మించిన సమాధిలో అస్థికలను నిమజ్జనం చేయడానికి ఆయన కుమారుడికి 11ఏళ్లు పట్టింది. 2012 ఫిబ్రవరి 27న కుమారుడు నికోలస్(లచ్చుపటేల్) తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి అస్థికలను గిరిజన సంప్రదాయ పద్ధతిలో నిమజ్జనం చేశారు. కాగా, మార్లవాయిలో హైమన్‌డార్ఫ్ దంపతుల వర్ధంతికి అన్ని ఏర్పాట్లు చేశారు.