గిరిజనులతో హైమన్ డార్ఫ్
సాక్షి, ఆసిఫాబాద్ : అడవి బిడ్డల ఆచార సంప్రదాయాలు, వారి జీవన విధానంతో పాటు మారుతున్న కాలంలో ఉనికి కోసం వారు చేస్తున్న పోరాటాలను ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయులు లండన్ ఆంత్రోపాలజీ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ వోన్ ఫ్యూరర్ హైమన్ డార్ఫ్, ఆయన భార్య బెట్టి ఎలిజబెత్. ఈ దంపతులు భౌతికంగా దూరమైనా గిరిజనులకు వారు చేసిన సేవలకు గుర్తుగా ఏటా జనవరి 11న వారివురి వర్ధంతిని ఏజెన్సీలో ఉత్సవంలా నిర్వహిస్తున్నారు. ఈసారి వేడుకల కోసం కుమురం భీం జిల్లా జైనూర్ మండలం మార్లవాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు.
ఆదివాసీలపై అధ్యయనం
ఆస్ట్రియా రాజధాని వియన్నాలో 1909లో జన్మించిన హైమన్ డార్ఫ్, లండన్‌లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌లో విద్య నభ్యసించారు. తనకు ఇష్టమైన ఆంత్రోపాలజీలో (మానవ వనరుల శాస్త్రం) డాక్టరేట్ చేశారు. భారత్‌లోని నాగా, గోండు, కోయ, కొండ రెడ్లు, చెంచు తదితర తెగల జీవన విధానంపై అధ్యయనం చేసేందుకు భారతదేశంలో పర్యటించారు. 1942 నుంచి 1945 మధ్య హైదరాబాద్ సంస్థానంలోని ఆదిలాబాద్‌లోని గిరిజన తెగలపై అధ్యయనం చేయడం కోసం జైనూర్ మండలం మార్లవాయిలో తన భార్యతో కలిసి నివాసం ఏర్పరుచుకున్నారు.
గిరిజనులతో మమేకం
డార్ఫ్ దంపతులు గిరిజనులతో మమేకమై వారి ఆచార వ్యవహారాలు, వారి సమస్యలను ప్రపంచానికి తెలియజేశాడు. గిరిజనులపై పరిశోధనకు ఆయన భార్య ఎలిజబెత్ కూడా ఎంతగానో సాయపడేవారని స్థానిక గిరిజనులు చెబుతుంటారు. గిరిజనుల ఆహార అలవాట్లు, ఆరోగ్యం, పండగలు, నృత్యాలు, కర్మ కాండలు, పెళ్లిళ్లు, విడాకులు, వ్యవసాయం, భాష, యాస, నడవడి, సాగుచేసే విధానాలపై హైమన్‌డార్ఫ్ రాసిన పుస్తకాలు ప్రపంచ ఖ్యాతి గడించాయి. 1979లో రెండోసారి భారత్‌కు వచ్చినప్పుడు లండన్‌కు చెందిన మైఖేల్ యార్క్‌తో ఆదివాసీల జీవినం గురించి పలు డాక్యుమెంటరీలు తెరకెక్కించారు. డార్ఫ్ అప్పట్లో తీసిన ఫొటోలు ఇప్పటికీ గిరిజనులపై పరిశోధన చేసే వారికి ఉపయోగపడుతున్నాయి.
నిజాంను ఒప్పించి భూ పట్టాలు పంపిణీ
ఆదివాసీలు భూమిపై హక్కులేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన హైమన్ డార్ఫ్ వారికి భూములపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు నిజాంతో చర్చలు జరిపారు. అప్పటికే అటవీ భూములను సాగు చేసుకుంటున్న స్థానికులకు ఒక్కొక్కరికి దాదాపు 15 ఎకరాలు ఇప్పించేందుకు కృషి చేశారు. ఆయన కృషి ఫలితంగానే సుమారు 12వేల గిరిజన కుటుంబాలకు భూ పట్టాలు వచ్చాయి. ఈ క్రమంలో నిజాం ప్రభుత్వం ఆయనను కొంత కాలం గిరిజన అభివృద్ధి సలహాదారుగా నియమించింది. ఆదివాసీల హక్కుల రక్షణ కోసం హైమన్ అనేక సూచనలు చేశారు. ఆయన నివాసం ఉన్న మార్లవాయిలో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పి అనేక మంది గిరిజనులను చదువు వైపు నడిచేలా ప్రొత్సహించారు.
కొడుకు పేరు లచ్చుపటేల్
హైమన్ డార్ఫ్ దంపతులు మార్లవాయిలో ఉన్నప్పుడు ఆ గ్రామ పెద్ద లచ్చుపటేల్ మరణించాడు. ఆ మరుసటి రోజే డార్ఫ్ భార్య ఎలిజబెత్ ఓ బాబుకు జన్మనిచ్చింది. ఆదివాసీల సంప్రదాయం ప్రకారం ఊరిలో ఎవరైనా చనిపోయిన మరుసటి రోజులోనే ఎవరైనా పుడితే, వారే మళ్లీ పుట్టారని నమ్ముతారు. ఇందుకు గుర్తుగా చనిపోయిన వారి పేరు పెడతారు. ఆ సాంప్రదాయం ప్రకారం డార్ఫ్ దంపతులు తమ కొడుకు పేరు లచ్చుపటేల్ అని నామకరణం చేశారు.
ఇక్కడే సమాధి కట్టండి
మరణానంతరం దంపతులిద్దరి సమాధులు ఇక్కడే ఏర్పాటు చేయాలని డార్ఫ్ స్థానికులను కోరారు. డార్ఫ్ భార్య ఎలిజబెత్ 1987లో మరణించారు. ఆమె చనిపోయిన తర్వాత డార్ఫ్, ఆయన కొడుకు లచ్చుపటేల్ (నికోలస్) ఎలిజబెత్ చితాభస్మాన్ని లండన్ నుంచి మార్లవాయికి తీసుకొచ్చి సమాధి కట్టించారు. 1995లో హైమన్‌డార్ఫ్ కూడా చనిపోగా.. 2012లో లండన్ నుంచి ఆయన చితాభస్మాన్ని కూడా మార్లవాయికి తీసుకువచ్చి ఎలిజబెత్ సమాధి పక్కనే మరో సమాధి కట్టించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా జనవరి 11న డార్ఫ్ దంపతుల వర్ధంతిని ఆదివాసీలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
డార్ఫ్ రచనలు
–ద చెంచుస్ (1943)
– ద రెడ్డీస్ ఆఫ్ బైసన్ హిల్స్ (1945)
– ద రాజ్ గోండ్స్ ఆఫ్ ఆదిలాబాద్ (1945)
– ద షెర్పాస్ ఆఫ్ నేపాల్ (1964)
– ద కొన్యాక్ నాగస్ (1969)
– ద ట్రైబ్స్ ఆఫ్ ఇండియా: స్ట్రగుల్ ఫర్ సర్వైవర్ (1982)
Comments
Please login to add a commentAdd a comment