జోడేఘాట్‌లో కుమురం భీం స్మారకం
సాక్షి, మంచిర్యాల: ఆదివాసీల ఆరాధ్య దైవం కుమురం భీం 80వ వర్ధంతి వేడుకలు శనివారం జరగనున్నాయి. ఈ మేరకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లోని భీం స్మారకం వద్ద ఉత్సవ కమిటీ, స్థానిక అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ఆదివాసీలు తమ సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు భీం సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఏటా వర్ధంతికి స్థానిక గిరిజనులతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున గిరిజనులు తరలివస్తారు. ఆదివాసీల సమస్యలను అధికారులకు తెలియజేసే ‘గిరిజన దర్బార్‌ను ఈసారి కోవిడ్ నేపథ్యంలో రద్దు చేశారు. కేవలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రమే హాజరుకానున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కుమురం భీం వర్ధంతిని ప్రభుత్వం ఏటా అధికారికంగా నిర్వహిస్తోంది. ఇందుకు అవసరమైన నిధులు కేటాయిస్తోంది. ఈ ఏడాది ఉత్సవాల కోసం రూ.25 లక్షలు కేటాయించింది.
అప్పుడే ధిక్కార స్వరం ప్రతిధ్వనించింది
ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా ఆసిఫాబాద్ మండలం జోడేఘాడ్ సంకెనపల్లి గ్రామంలో కొమురం భీం జన్మించినాడు. భీంకి 15 ఏండ్లు ఉన్నప్పుడే అతని తండ్రిని అటవీ అధికారులు చంపివేశారు. భీం కుటుంబం సాగుచేస్తున్న భూమిని ‘‘సిద్దిభి’’ అనే జాగిర్దార్ తనకు వదిలి పెట్టాల్సిందిగా బెదిరించాడు. ఎక్కడికి పారిపోయి బ్రతకాలి ఎందుకు భయపడాలి. ప్రళయ ఘర్జనలో భీంలో ధిక్కారస్వరం ప్రతిధ్వనించింది. సిద్దిభి తలౖపై కట్టెతో గట్టిగా కొట్టాడు. సిద్దిభి అక్కడే చనిపోయాడు. పోలీసులు భీంనీ వేటాడారు.
దీంతో అస్సాంలో ఏళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపాడు. బాభి ఝారి చుట్టు పక్కల తన నాయకత్వంలో ఉన్న 12 గ్రామాల్లో మా గ్రామం మా స్వరాజ్యం అనే నినాదాన్ని అబ్దుల్ సత్తార్ అనే తాలుక్ దారుతో ఒప్పించడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. అక్కడ నుంచి సుర్దాపూర్‌కి తిరిగి వచ్చి పెత్తందారి వ్యవస్థ కింద నలుగుతున్న తన జాతి విముక్తి కోసం ‘జల్ జంగల్ జమీన్’ తమదే అంటూ గర్జించాడు. స్వయం పాలన 12 గ్రామాలతో స్వతంత్ర గోండు రాజ్యం కావాలని ఆసిఫాబాద్ కలెక్టర్‌తో చర్చలు జరి పాడు. పరిష్కారం దొరకలేదు. దీంతో నిజాం రాజును కలవడానికి హైదరాబాద్ వెళ్ళాడు కానీ నిజాం నుంచి అనుమతి దొరకలేదు ఇక గెరిల్లా పోరాటంతోనే నిజాం సైన్యాన్ని ఎదుర్కోవాలి అని నిర్ణయించుకున్నాడు.
దట్టమైన అడవుల్లో ఉన్న ‘జోడే ఘాట్’ గుట్టల్లో గెరిల్లా అర్మీని తయారు చేశాడు. భీంతో చర్చలు జరిపినప్పటికీ ఫలించకపోవడంతో భీంని అంతం చేస్తే తప్ప తిరుగుబాటు ఆగదని నిజాం సర్కార్ భావించింది. భీం దగ్గర హవల్దార్‌గా పనిచేసే కుర్దు పటేల్‌ని లోబరుచుకుని భీం స్థావరాన్ని బ్రిటిష్ ఆర్మీ సహాయంతో అర్ధరాత్రి సమయంలో చుట్టుముట్టింది. 3 రోజుల సుదీర్ఘ పోరాటంలో అలసిన భీం గెరిల్లాలపై నిజాం సైన్యం ఒకసారి గుంపుగా విరుచుకపడి కొమురం భీం గుండెల్లో బుల్లెట్ దింపారు. ఆదివాసీల ఆశయాల సాధనే భీంకి ఇచ్చే ఘన నివాళి.
(పెనుక ప్రభాకర్, ఆదివాసీ రచయితల సంఘం(తెలంగాణ) గతంలో సాక్షి కోసం రాసిన వ్యాసం)
Comments
Please login to add a commentAdd a comment