అమెరికా వంచనకు బలయ్యాం!
సైనిక బలగాలతో ఏ నిర్ణయాత్మకమైన పోరాటంలోనూ గెలుపు సాధించని తాలిబన్లు... చివరిదశలో రాజధాని కాబూల్‌తో సహా యావత్ అఫ్గానిస్తాన్‌ను సునాయాసంగా కైవసం చేసుకున్నారు. అందుకు అమెరికన్ రాజకీయ, అఫ్గాన్ సైనిక నాయకత్వ అసమర్థత, అవినీతి, విద్రోహం ప్రధాన కారణాలని ‘అఫ్గాన్ నేషనల్ ఆర్మీ’ కమాండర్ సమీ సాదత్ తేల్చి చెప్పారు. గత ఏడాది అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. తాలిబన్లతో ఒప్పందం కుదుర్చుకోవడం నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, సైనిక బలగాల ఉపసంహరణకు కట్టుబడతానని చెప్పి చివరి తేదీ కూడా ప్రకటించడం వరకు అమెరికన్ రాజకీయ నాయకత్వం సాగించిన విద్రోహం వల్లే క్షేత్రస్థాయిలో అఫ్గాన్ సైన్యం ఓటమిపాలయిందని ఆ కమాండర్ సంచలన ప్రకటన చేశారు. అఫ్గాన్ సైన్యం తలవంచడం నిజమే కానీ అమెరికా రాజకీయ నాయకత్వ వైఫల్యమే తమ ఓటమికి అసలు కారణమని ఆ కమాండర్ చెప్పడం గమనార్హం. ఆయన మాటల్లోనే ఆ కథనం...
గత మూడున్నర నెలలుగా దక్షిణ అఫ్గానిస్తాన్‌లోని హెల్మండ్ రాష్ట్రంలో తాలిబన్ దాడులకు వ్యతిరేకంగా రాత్రింబవళ్లు నిరవధి కంగా పోరాడుతూ వచ్చాను. వరుస దాడులను ఎదుర్కొంటూనే మేము తాలిబన్లను వెనక్కి నెట్టి వారికి తీవ్ర నష్టం కలిగించాం. తర్వాత అఫ్గాన్ ప్రత్యేక బలగాలకు నాయకత్వం వహించడానికి నన్ను కాబూల్‌కి పిలిపించారు. కాని తాలిబన్లు అప్పటికే కాబూల్ నగరం లోకి ప్రవేశించారు. నేను తీవ్ర నిరాశకు గురయ్యాను. ఆగ్రహంతో రగిలిపోయాను కూడా!
అమెరికా అధ్యక్షుడు బైడెన్ గత వారం అఫ్గాన్ వ్యవహారాలపై తన వైఖరిని స్పష్టం చేశారు. ‘‘అఫ్గాన్ సైనిక బలగాలు తమకు తాము తాలిబన్లతో పారాడటానికి సంసిద్ధత తెలపని చోట అమెరికా బల గాలు తమది కాని యుద్ధంలో పోరాడలేరు, ఆ యుద్ధంలో చనిపోవ డానికి సిద్ధంగా లేరు’’ అని బైడెన్ చెప్పారు. పైగా అఫ్గాన్ సైన్యం పోరాడే సంకల్పాన్ని కోల్పోయిందన్నది వాస్తవం. మా అమెరికన్ భాగస్వాములు తమను గాలికి వదిలేసి వెళుతున్నారనే అభిప్రాయం బలపడటం, గత కొన్ని నెలలుగా అఫ్గాన్ దళాల పట్ల బైడెన్ స్వరంలో ధ్వనించిన అగౌరవం, అవిశ్వాసం దీనికి కారణం. పైగా అఫ్గాన్‌లో మా భాగస్వాములు ఇప్పటికే పోరాటం నిలిపివేయడంతో మేం కూడా అంతిమంగా పోరాటం ఆపివేయవలసి వచ్చింది. జరుగుతున్న పరి ణామాలను అర్థం చేసుకోకుండా అఫ్గాన్ సైన్యం కుప్పకూలిపోయిం దంటూ బైడెన్, పాశ్చాత్య ప్రభుత్వాధికారులు అవమానించడం నన్ను మరీ బాధిస్తోంది. కాబూల్‌లో, వాషింగ్టన్లో రాజకీయ విభజనలు సైన్యం చేతులు కట్టేశాయి. సంవత్సరాలుగా అమెరికన్ ప్రభుత్వం అందించిన సైనికపరమైన మద్దతును గత కొన్ని నెలలుగా కోల్పోతూ వచ్చాం.
అఫ్గాన్ సైన్యంలో నేను మూడు నక్షత్రాల బ్యాడ్జ్ ఉన్న జనరల్‌ని. 11 నెలలపాటు 215 మైవాండ్ కోర్ కమాండర్‌గా వాయవ్య అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లతో పోరాడుతున్న 15 వేలమంది సాయుధ బలగాలకు నాయకత్వం వహించాను. ఈ క్రమంలో వందలాది మంది అధికారులను, సైనికులను కోల్పోయాను. అందుకే ప్రస్తుత పరిణామాల పట్ల తీవ్ర నిరాశకు, నిస్పృహకు గురవుతున్నాను. మాలో చాలామందిమి సాహసోపేతంగా, గౌరవప్రదంగా పోరాడాం. కాని మా రెండు దేశాల నాయకత్వపు చేతకానితనం వల్లే ఓడిపోయాం.
రెండువారాల క్రితం, తాలిబన్లనుంచి దక్షిణ లష్కర్గావ్ నగ రాన్ని నిలబెట్టుకునేందుకు మేం పోరాడుతుండగా, అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ నన్ను అఫ్గాన్ ప్రత్యేక బలగాల కమాండర్‌గా ప్రతిపాదిం చారు. ఈ ప్రత్యేక బలగాలు అఫ్గాన్ సైన్యంలో కెల్లా అత్యుత్తమ బల గాలు. కానీ ఆగస్టు 15న నేను నా బలగాలను వదిలి కాబూల్ వచ్చే శాను. అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది అప్పటికి నాకు తెలీదు. తర్వాత కాబూల్ భద్రత బాధ్యతలను దేశాధ్యక్షుడు ఘనీ అదనంగా నా చేతిలో పెట్టారు. కానీ అప్పటికే తాలిబన్లు నగరాన్ని సమీపించడంతో ఘనీ దేశం వదిలి పారిపోయారు. పరివర్తనా దశలో తాలిబన్లతో తాత్కాలిక ఒప్పందం కోసం సంప్రదింపులు జరపడాన్ని వదిలివేసి ఘనీ హడావుడిగా దేశం వదిలి వెళ్లిపోయారు. దాంతో కల్లోల పరిస్థితులు చెలరేగాయి.
బైడెన్ ఆగస్టు 16న అఫ్గాన్ బలగాలు కుప్పకూలిపోయాయని పేర్కొన్నారు. కనీస పోరాటం చేయకుండానే వారు చేతులెత్తేశారని బైడెన్ ఆరోపించారు. కానీ మేం పోరాడాం, తుదివరకు సాహసంతో పోరాడాం. గత 20 ఏళ్ల కాలంలో 66 వేలమంది సైనికులను కోల్పోయాం. అంటే అఫ్గాన్‌లో ఉన్న పోరాట బలగాల్లో అయిదింట ఒక వంతు సైన్యాన్ని మేం కోల్పోయాం. మరి సైనికబలగాలు ఎందుకు వెనుకంజ వేశాయి? దీనికి మూడు కారణాలు చూపించ వచ్చు. ఒకటి– 2020 ఫిబ్రవరిలో నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోహాలో తాలిబన్లతో కుదుర్చుకున్న శాంతి ఒప్పందం మమ్మల్ని దెబ్బతీసింది. అఫ్గాన్‌లో అమెరికన్ సైనిక ఉపసంహరణకు అది తుది గడువు ప్రకటించింది. రెండు– మా బలగాలకు అత్యవసర మైన సైనిక సామగ్రిని, నిర్వహణా పరమైన మద్దతును మేం కోల్పోయాం. మూడు– ఘనీ ప్రభుత్వంలో పెచ్చరిల్లిన అవినీతి మహ మ్మారి సీనియర్ సైనిక నాయకత్వంలో లుకలుకలు çసృష్టించింది. మా బలగాలను మొత్తంగా నిర్వీర్యం చేసి క్షేత్రస్థాయిలో మమ్మల్ని కోలుకో లేని విధంగా దెబ్బతీసింది.
గతేడాది ట్రంప్–తాలిబన్ల మధ్య కుదిరిన ఒప్పందం అమెరికా, దాని మిత్రపక్షాల పోరాట సామర్థ్యాన్ని, సైనిక చర్యలను దెబ్బ తీసింది. అఫ్గాన్ బలగాల కోసం అమెరికన్ గగనతల మద్దతు ప్రక్రి యలు రాత్రికి రాత్రే మారిపోయాయి. దీంతో తాలిబన్లకు ఎక్కడ లేని ధైర్యమొచ్చేసింది. ఆ క్షణంలోనే వారు తమదే గెలుపనే అభిప్రాయా నికి వచ్చేశారు. ఆ ఒప్పందానికి ముందు అఫ్గాన్ సైన్యానికి వ్యతి రేకంగా తాలిబన్లు ఒక ముఖ్యమైన పోరాటంలో కూడా గెలుపు సాధించలేదని గ్రహించాలి. మేం అప్పటికీ పోరాడుతూనే వచ్చాం. అయితే ట్రంప్ సైనిక ఉపసంహరణ యోచనకు తాను కట్టుబడి ఉన్నానని ఈ ఏప్రిల్‌లో బైడెన్ నిర్ధారించారు. అప్పటినుంచే ప్రతిదీ మాకు వ్యతిరేకంగా పరిణమించడం ప్రారంభమైంది.
అమెరికన్ అత్యాధునిక సాంకేతిక ప్రత్యేక నిఘా విభాగాలను, హెలికాప్టర్లను, గగనతల దాడులను ఉపయోగించుకుని అఫ్గాన్ సైన్యం శిక్షణ పొందింది. కానీ మాకు వైమానిక మద్దతు తగ్గిపోయి, మందుగుండు సామగ్రికి కొరత ఏర్పడిన కారణంగానే మేం తాలిబన్ల ఆధిపత్యం ముందు తలవంచాల్సి వచ్చింది. మా వైమానిక బాంబ ర్లను, దాడి, రవాణాకు ఉపయోగించే యుద్ధ విమానాలను కాంట్రా క్టర్లు నిర్వహిస్తూ వచ్చారు. కానీ జూలై నాటికల్లా 17వేల మంది కాంట్రాక్టర్లలో దాదాపు అందరూ అఫ్గా్గన్ వదిలి వెళ్లిపోయారు. దీంతో బ్లాక్ హాక్ హెలికాప్టర్, సి–130 ట్రాన్స్పోర్ట్ విమానం, నిఘా డ్రోన్ వంటివన్నీ సాంకేతిక సమస్యలతో దింపేయాల్సివచ్చింది. కాంట్రా క్టర్లు యుద్ధ సామగ్రికి చెందిన సాఫ్ట్వేర్, ఆయుధ వ్యవస్థలను కూడా తమతోపాటు తీసుకుపోయారు. మేం లేజర్ నిర్దేశిత ఆయుధ సామర్థ్యాన్ని కోల్పోతున్న క్రమంలోనే తాలిబన్లు స్నైపర్లతో, మెరుగు పర్చిన పేలుడు పదార్ధాలతో పోరాటం సాగించారు. హెలికాప్టర్ల మద్దతు లేక మాకు సరఫరా స్థావరాలు కరువయ్యాయి. దీంతో సైని కులకు పోరాటానికి అవసరమైన సాధనాలు కూడా కొరవడ్డాయి. క్రమంగా తాలిబన్లు చాలా స్థావరాలను స్వాధీనపర్చుకున్నారు. ఇతర ప్రాంతాల్లో మొత్తం సైనిక విభాగాలు లొంగిపోయాయి. అమెరికా సైనిక బలగాల సంపూర్ణ ఉపసంహరణను వేగవంతం చేసే క్రమంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పాలకులు పూర్తిగా విస్మరించారు.
ఇక మూడో కారణాన్ని కూడా నేను విస్మరించలేను. మా ప్రభు త్వంలో, సైన్యంలో అవినీతి కంపు కొట్టడం సాక్ష్యాధారాలతో సహా నిరూపితమైంది. ఇది మా జాతీయ విషాదం. అధికారులపై నమ్మకం కోల్పోవడంతో తమ జీవితాలను çపణంగా ఎందుకు పెట్టాలని సైని కుల్లో ప్రశ్నలు మొదలయ్యాయి. చివరి రోజుల్లో మా పోరాటం నామ మాత్రమై పోయింది. కాబూల్ పతనమయ్యాకే అంతవరకు పోరాడిన వచ్చిన మా ప్రత్యేక బలగాలు కూడా ఆయుధాలు కింద పెట్టేశాయి.
మొత్తం మీద చెప్పాలంటే అమెరికా రాజకీయాలు, దేశాధ్యక్షులు మాకు ద్రోహం తెలపెట్టారు. మేం చేసింది అఫ్గాన్ యుద్ధం మాత్రమే కాదు. అది పలు దేశాల సైనిక బలగాలు పాలు పంచుకున్న అంతర్జా తీయ యుద్ధం. కేవలం ఒక సైన్యం మాత్రమే అక్కడ పోరాడటం అసంభవమయ్యేది. నిజంగానే ఇది సైనిక పరాజయమే. కానీ రాజ కీయ వైఫల్యం వల్లే మేం ఓడిపోయాం.
సమీ సాదత్, లెఫ్టినెంట్ జనరల్
అఫ్గాన్ నేషనల్ ఆర్మీ కమాండర్
(న్యూయార్క్ టైమ్స్ సౌజన్యంతో)