ప్రేమ పేరుతో వంచన
► మాయ మాటలతో యువతిని లోబర్చుకున్న వైనం
► ఏపీకి చెందిన యువకుడిపై తెలంగాణా యువతి ఫిర్యాదు
కృష్ణరాజపుర: ప్రేమ పేరుతో తనను లోబర్చుకొని వివాహం చేసుకోకుండా వంచనకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ తెలంగాణకు చెందిన ఓ యువతి ఏపీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈఘటన బెంగళూరులోని మహదేవపుర పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన మేరకు వివరాలు..ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వినయ్ నగరంలోని సాఫ్ట్‌వేర్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు.
ఈ క్రమంలో 2015వ సంవత్సరంలో వినయ్‌కి తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు చెందిన ఓ యువతితో ఆన్‌లైన్‌లో పరిచయమైంది. అప్పటి నుంచి వారి మధ్య చాటింగ్‌లు ఫోన్లలో ముచ్చట్లు సాగాయి. ఒకసారి బెంగళూరుకు రావాలంటూ వినయ్ యువతిని కోరాడు. 2016 డిసెంబర్24న బెంగళూరుకు చేరుకున్న యువతిని వినయ్ కోరమంగళలోని తన గది తీసుకెళ్లి కామవాంఛ తీర్చుకున్నాడు. అయితే బాధితురాలు తిరిగి సొంత గ్రామానికి వెళ్లగా ఈ ఏడాది సంక్రాతి అనంతరం వివాహం చేసుకుంటానని చెప్పి బెంగళూరుకు పిలిపించి అగ్రహారలోని అక్కబావల వద్ద ఉంచాడు.
అక్కడ ఉన్నన్ని రోజులూ లైంగిక చర్యలో పాల్గొనేవాడు. కొద్ది రోజుల తర్వాత యువతి సొంత గ్రామానికి వెళ్లగా వినయ్ మరో యువతితో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 12న విషయం తెలుసుకున్న ఆ యువతి వినయ్ తల్లితండ్రులను కలిసి న్యాయం చేయాలని వేడుకుంది. తమ కుమారుడికి రూ.16లక్షల కట్నం ఇచ్చే సంబంధం కుదిరిందని, అంత సొమ్ము ఇస్తే నీతోనే పెళ్లి జరిపిస్తామని ఆ యువతికి సూచించారు. దీంతో యువతి మరోమారు వినయ్‌తో పెళ్లి ప్రస్తావన తెచ్చింది.
బెంగళూరుకు వస్తే మాట్లాడుకుందామని చెప్పడంతో యువతి ఈ ఏడాది ఫిబ్రవరి 18న అర్ధరాత్రి 2.30గంటలకు బెంగళూరులో మెజెస్టిక్‌కు చేరుకుంది. అయితే అక్కడ వినయ్ లేకపోవడంతో అగ్రహారలోని అతని బావ ఇంటికి వెళ్లగా ఇంటికి తాళం కనిపించింది. తాను మోసపోయినట్లు భావించి అదే రోజు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టనని తనలాగా మరొకరు మోసపోకుండా వినయ్‌కి కఠిన శిక్ష పడే వరకు పోరాడుతానని బాధితురాలు శుక్రవారం బెంగళూరులో మీడియాతో పేర్కొంది.