Hyundai Verna
-
మార్కెట్లోకి కొత్త మోడల్ వెర్నా విడుదల
పాలమూరు: హ్యుందాయ్ కంపెనీ నుంచి మార్కెట్లోకి మరో కొత్త కారును విడుదల చేశారు. జిల్లా కేంద్రంలోని ట్రెండ్ హ్యుందాయ్ షోరూంలో శుక్రవారం కొత్త మోడల్ వెర్నా కారును సంస్థ సీఈఓ గట్టు సిరిచందనరెడ్డి, మార్కెటింగ్ సీఈవో గట్టు హర్షిత్‌రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహన తయారీలో హ్యుందాయ్ మోటార్ ఇండియా మధ్యస్థాయి సెడాన్ కొత్త వెర్నా ప్రవేశపెట్టిందన్నారు. సరికొత్త హంగులతో విడుదలైన ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, 30రకాల భద్రత అంశాలు, 17రకాల లెవెల్–2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంన్స్ సిస్టమ్ ఉన్నాయని తెలిపారు. ఎక్స్‌షోరూం ధర రూ.10.89లక్షలు నుంచి రూ.17.37లక్షల వరకు అందుబాటులో ఉందన్నారు. కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ హర్షవర్ధన్‌రెడ్డి, సర్వీస్ మేనేజర్ వశీం పాల్గొన్నారు. -
దూసుకెళ్తున్న కొత్త హ్యుందాయ్ వెర్నా బుకింగ్స్: ఇప్పటికే..
2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన కొత్త హ్యుందాయ్ వెర్నా ఇటీవలే దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదలైంది. కంపెనీ ఈ సెడాన్ కోసం గత నెలలోనే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే ఇప్పటికి ఈ కొత్త మోడల్ కోసం ఎనిమిది వేల కంటే ఎక్కువ బుకింగ్స్ వచ్చినట్లు సమాచారం. 2023 వెర్నా బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ. 25,000 చెల్లించి హ్యుందాయ్ డీలర్షిప్ ద్వారా లేదా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో లొకేషన్, బుక్ చేసుకునే వేరియంట్ ఆధారంగా వెయిటింగ్ పీరియడ్ సుమారు రెండు నెలల వరకు ఉంటుందని భావిస్తున్నారు. దేశీయ మార్కెట్లో విడుదలైన సరికొత్త హ్యుందాయ్ వెర్నా రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్లను కలిగి ఉంటుంది. ఇందులో ఒకటి 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ (IVT)తో వచ్చే 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, మరొకటి 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 7 స్పీడ్ డిసిటి కలిగిన 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్. ఇవి రెండూ ఉత్తమమైన పనితీరుని అందిస్తాయి. (ఇదీ చదవండి: ఇది కదా సక్సెస్ అంటే: ఒకప్పుడు ట్యూషన్ టీచర్.. ఇప్పుడు వంద కోట్లకు అధిపతి!) కొత్త హ్యుందాయ్ వెర్నా డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా అప్డేట్ పొందింది. ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. దేశీయ విఫణిలో హోండా సిటీ, మారుతి సుజుకి సియాజ్, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉన్న ఈ సెడాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి. -
ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన 2023 హ్యుందాయ్ వెర్నా: పూర్తి వివరాలు
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సౌత్ కొరియా బ్రాండ్ 'హ్యుందాయ్' ఎట్టకేలకు దేశీయ విఫణిలో తన '2023 వెర్నా' (2023 Verna) లాంచ్ చేసింది. ఈ కొత్త సెడాన్ డిజైన్ ఏంటి, ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ధరలు, వేరియంట్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూడవచ్చు ధరలు & బుకింగ్స్: దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త హ్యుందాయ్ వెర్నా నాలుగు వేరియంట్లలో విడుదలైంది. అవి EX, S, SX, SX(O). ప్రారంభ ధర రూ. 10.90 లక్షలు కాగా, టాప్ మోడల్ ధర రూ. 17.38 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ సెడాన్ కోసం ఇప్పటికే రూ. 25,000తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ కూడా 8,000 దాటినట్లు సమాచారం. డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. డిజైన్ & కలర్ ఆప్సన్స్: కొత్త హ్యుందాయ్ వెర్నా మొత్తం ఏడు కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. అవి టైఫూన్ సిల్వర్, ఫైరీ రెడ్, స్టార్రీ నైట్, టైటాన్ గ్రే, అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, టెల్లూరియన్ బ్రౌన్ కలర్స్. డిజైన్ విషయానికి వస్తే, 2023 హ్యుందాయ్ వెర్నా సెన్సుయస్ స్పోర్టినెస్ డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా రూపొందించబడింది. కావున ఇందులో విస్తృతంగా ఉన్న ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్లాంప్, వెడల్పు అంతటా వ్యాపించి ఉండే డిఆర్ఎల్, కలిగి డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్‌పై క్రోమ్ కలిగి చూడచక్కగా ఉంటుంది. వెనుక వైపు పారామెట్రిక్ కనెక్ట్ చేయబడిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. 2023 వెర్నా పరిమాణం పరంగా కూడా దాని ప్రత్యర్థుల కంటే పెద్దదిగా ఉంటుంది. దీని పొడవు 1,765, వెడల్పు 1765 మిమీ, వీల్‌బేస్ 2670 మిమీ ఉంటుంది. కావున ప్రయాణికులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. బూట్ స్పేస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. (ఇదీ చదవండి: వేల కోట్ల కంపెనీకి బాస్ 'జయంతి చౌహాన్' గురించి ఆసక్తికర విషయాలు) ఇంటీరియర్ ఫీచర్స్: హ్యుందాయ్ వెర్నా డ్యాష్‌బోర్డ్, డోర్ ట్రిమ్‌లపై డ్యూయల్ టోన్ బేజ్-బ్లాక్ కలర్ సాఫ్ట్-టచ్ మెటీరియల్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇది 64 కలర్ యాంబియంట్ లైటింగ్ కలిగి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సెంటర్ కన్సోల్‌లో క్లైమేట్ కంట్రోల్ నాబ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ల వంటి లేటెస్ట్ ఫీచర్లతో పాటు 2 స్పోక్ స్టీరింగ్ వీల్ పొందుతుంది. లేటెస్ట్ వెర్నా ఆడియో అండ్ నావిగేషన్ కోసం 10.25 ఇంచెస్ కలర్ TFT MID ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ కలిగి బ్లూటూత్ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వాలెట్ మోడ్ వంటి వాటికీ సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇది హిందీ, ఇంగ్లీష్ మిక్స్‌లో వాయిస్ కమాండ్లకు కూడా సపోర్ట్ చేస్తుంది. (ఇదీ చదవండి: EPFO: పీఎఫ్ విత్ డ్రా చేస్తున్నారా? ఈ సందర్భంలో 75 శాతం తీసుకోవచ్చు.. పెళ్లి కోసం కూడా!) ఇంజిన్ & మైలేజ్: భారతీయ విఫణిలో అడుగుపెట్టిన సరికొత్త హ్యుందాయ్ వెర్నా రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులో 1.5l MPi పెట్రోల్ ఇంజన్ 115 హెచ్‌పి పవర్, 143.8 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ & ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ IVTతో లభిస్తుంది. ఇది 18.6 కిమీ/లీ (MT), 19.6 కిమీ/లీ (IVT) అందిస్తుంది. ఇక రెండవ ఇంజిన్ 1.5 లీటర్ టర్బో జిడిఐ పెట్రోల్ విషయానికి వస్తే, ఇది 160హెచ్‌పి పవర్, 253 ఎన్ఎమ్ టార్క్ అందిస్తూ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా ప్యాడిల్ షిఫ్టర్లతో కూడిన 7 స్పీడ్ DCTతో జతచేయబడి ఉంటుంది. ఇది 20 కిమీ/లీ(MT), 20.6 కిమీ/లీ (DCT) మైలేజ్ అందిస్తుంది. (ఇదీ చదవండి: 2023 ఇన్నోవా క్రిస్టా లాంచ్ చేసిన టయోట - పూర్తి వివరాలు) సేఫ్టీ ఫీచర్స్: హ్యుందాయ్ వెర్నా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, నాలుగు డిస్క్ బ్రేక్‌లు వంటి భద్రతా ఫీచర్లతో పాటు ఆధునిక ADAS సిస్టం కూడా పొందుతుంది. కావున ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, స్మార్ట్ క్రూయిస్ కంట్రోల్, లేన్ కీప్ వార్నింగ్, అసిస్ట్ బ్లైండ్ స్పాట్ వార్నింగ్ వంటి ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. ప్రత్యర్థులు: ఆధునిక డిజైన్, అధునాతన ఫీచర్లతో విడుదలైన కొత్త హ్యుందాయ్ వెర్నా దేశీయ మార్కెట్లో హోండా సిటీ, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్, స్కోడా స్లావియా, మారుతి సుజుకి సియాజ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కంపెనీ ఈ సెడాన్ మీద 3 సంవత్సరాల అపరిమిత కిమీ వారంటీ అందిస్తుంది. -
2023 హ్యుందాయ్ వెర్నా ఇలాగే ఉంటుంది - ఫోటోలు
హ్యుందాయ్ కంపెనీ భారతదేశంలో 2023 వెర్నా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ మిడ్-సైజ్ సెడాన్ కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఈ సెడాన్ ఇటీవల టెస్టింగ్ సమయంలో కనిపించింది. హ్యుందాయ్ వెర్నా దాని మునుపటి మోడల్స్ కంటే చాలా ఆధునిక డిజైన్ పొందుతుంది. ఈ సెడాన్ ముందు భాగంలో స్పోర్టినెస్ డిజైన్ లాంగ్వేజ్ కలిగి, పారామెట్రిక్ గ్రిల్ పొందుతుంది. ఫ్రంట్ బంపర్ కొత్తగా కనిపిస్తుంది. బోనెట్ మీద బ్రాండ్ లోగో చూడవచ్చు. స్ప్లిట్ హెడ్‌లైట్ సెటప్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ గ్రిల్ పక్కన అమర్చబడి ఉంటుంది. సైడ్ ప్రొఫైల్‌లో డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక వైపు వెడల్పు అంతటా విస్తరించి ఉండే ఎల్ఈడీ టెయిల్ లైట్ చూడవచ్చు. దాని పైన హ్యుందాయ్ బ్రాండ్ లోగో ఉంటుంది. ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ వంటివి ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు, అయినప్పటికీ ఇందులో బెస్ట్ ఫీచర్స్, ఏడిఏఎస్ టెక్నాలజీ వంటివి వుండే అవకాశం ఉంది. 2023 హ్యుందాయ్ వెర్నా రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందనుంది. ఇందులో మొదటి 1.5 లీటర్ ఇంజిన్, ఇది 115 పిఎస్ పవర్ & 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండవ ఇంజిన్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్, ఇది 160 పిఎస్ పవర్ & 265 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్, పర్ఫామెన్స్ వివరాలు కూడా అధికారికంగా వెల్లడి కాలేదు. -
హ్యుందాయ్ లేటెస్ట్ కారు, రేపే లాంచ్: డిజైన్‌కి మాత్రం ఫిదా అవ్వాల్సిందే!
దక్షిణ కొరియా కార్ బ్రాండ్ హ్యుందాయ్ కొత్త ‘వెర్నా’ సెడాన్ విడుదలకు సర్వం సిద్ధం చేసింది. రేపు మార్కెట్లో అధికారికంగా విడుదల చేయడానికి సన్నద్ధమైంది. ఇప్పటికే కంపెనీ ఈ సెడాన్ కోసం రూ. 25 వేలతో బుకింగ్స్ ప్రారభించింది. ఈ కొత్త మోడల్ దాని మునుపటి మోడల్స్ కంటే భిన్నంగా ఉంది. (ఇది కూడా చదవండి: మెగా డీల్ జోష్: ఎయిరిండియాలో ఉద్యోగాలు, పైలట్‌కు జీతం ఎంతంటే?) హ్యుందాయ్ వెర్నా సెడాన్ కొత్త డిజైన్ పొందుతుంది. ఇందులో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, ఫుల్ ఎల్ఈడీ లైట్ బార్, ఫ్లాట్‌గా ఉండే బోనెట్, డోర్స్ మీద క్యారెక్టర్ లైన్స్, స్టైలిష్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటివి చూడవచ్చు. వెనుక భాగంలో వెడల్పు అంతటా విస్తరించి ఉండే లైట్ బార్ ఉంటుంది. హ్యుందాయ్ వెర్నా 1.5 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇందులో డీజిల్ ఇంజిన్ ఆప్సన్ లేదు. కావున ఇది EX, S, SX, SX (O) ట్రిమ్‌లలో విక్రయించబడుతుంది. ధరలు మునుపటి మోడల్ కంటే కూడా ఎక్కువగా ఉంటాయని అంచనా. ఈ సెడాన్ ధరలు అధికారికంగా రేపు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డిజిటల్ డ్రైవర్స్ డిస్ప్లే, బ్రాండెడ్ సౌండ్ సిస్టమ్, సన్‌రూఫ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, వెంటిలేటెడ్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్స్‌తో పాటు ADAS టెక్నాలజీ ఉంటాయి. మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, రివర్స్ పార్కింగ్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ ఇందులో పొందవచ్చు. కొత్త హ్యుందాయ్ వెర్నా బ్రాండ్ యొక్క సెన్సుయస్ స్పోర్టినెస్ డిజైన్ లాంగ్వేజ్ కలిగి ఉండటం వల్ల కొత్తగా దర్శన మిస్తుంది. ఇది చూడటానికి లేటెస్ట్ హ్యుందాయ్ ఎలంట్రా, గ్రాండియర్ సెడాన్ మాదిరిగా ఉంటుంది. ఇది మార్కెట్లో విడుదలైన తరువాత స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
హ్యుందాయ్ ‘వెర్నా’లో కొత్త వెర్షన్
ప్రారంభ ధర రూ.7.99 లక్షలు న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన వాహన తయారీ కంపెనీ ‘హ్యుందాయ్’ తాజాగా ‘వెర్నా’లో కొత్త వెర్షన్‌ను (ఐదో జనరేషన్) మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.7.99 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. మిడ్సైజ్డ్ సెడాన్ విభాగంలో తిరిగి అధిక మార్కెట్ వాటాను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కంపెనీ ఈ కారును ఆవిష్కరించింది. ఈ ఐదో జనరేషన్ వెర్నా ప్రధానంగా హోండా సిటీ, మారుతీ సుజుకీ సియాజ్ మోడళ్లకు గట్టి పోటీనిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీని పెట్రోల్ వేరియంట్స్ ధర రూ.7.99 లక్షలు–రూ.12.23 లక్షల శ్రేణిలో, డీజిల్ వేరియంట్స్ ధర రూ.9.19 లక్షలు–రూ.12.61 లక్షల శ్రేణిలో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇక ఈ వాహనాలకు సంబంధించి నెలకు 4,000 నుంచి 5,000 యూనిట్ల విక్రయాలను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) ఎండీ, సీఈవో వై.కె.కో తెలిపారు. కాగా పైన పేర్కొన్న కార్ల ధరలు తొలి 20,000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయని, తర్వాత వాహన ధరలను పెంచుతామని హెచ్ఎంఐఎల్ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. కొత్త వెర్షన్ వెర్నాలో 1.6 లీటర్ పెట్రోల్/డీజిల్ ఇంజిన్స్, మాన్యువల్/ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్, సన్‌రూఫ్, స్టాండర్డ్ డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని వివరించారు. -
రూ.7.88 లక్షలకు కొత్త వెర్నా, కానీ...
సాక్షి, న్యూఢిల్లీ : కొరియన్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్, ఎన్నో రోజుల నుంచి వేచిచూస్తున్న తన సీ-సెగ్మెంట్ సెడాన్ కొత్త వెర్నాను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ కారు బేస్ వేరియంట్ ధర రూ.7.99 లక్షలు. దీని టాప్ వేరియంట్ ధర రూ.12.1 లక్షల వరకు ఉంది. ఆశ్చర్యకరంగా ఈ ధరల్లో తొలి 20వేల కస్టమర్లకు మాత్రమే కొత్త వెర్నా అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత సమీక్షించిన ధరల ప్రకారం, ఈ కొత్త వెర్నా ధర పెరుగనుంది. 1.6 లీటరు పెట్రోల్, డీజిల్ మోటార్స్‌ను ఈ కొత్త వెర్నా కలిగి ఉంది. పెట్రోల్ ఇంజిన్ 123 బీహెచ్పీ, 151 ఎన్ఎం టర్క్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజిన్ 128బీహెచ్పీ, 260ఎన్ఎం టర్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రెండు ఇంజిన్లు 6 స్పీడు మాన్యువల్ ట్రాన్సమిషన్ను లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సమిషన్ను కలిగి ఉన్నాయి. తర్వాత 1.4 లీటరు డీజిల్ ఇంజిన్‌ను కూడా తన లైనప్‌లో యాడ్ చేయనుంది. ఈ 5వ తరం వెర్నాకు ముందు వైపు ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉన్నాయి. వెనుకవైపు ఎల్ఈడీ టైల్ ల్యాంప్స్‌తో ఇది రూపొందింది. 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, బ్లూటూత్, యూఎస్బీ, ఆపిల్ కారుప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్టులతో పాటు... భద్రతాపరంగా 6 ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో ఏబీసీ, ఈఎస్సీలు ఉన్నాయి.