ఫ్రీ బేసిక్స్ వద్దు: ఐఏఎంఏఐ
న్యూఢిల్లీ: ఫ్రీ బేసిక్స్, డిఫరెన్షియల్ డేటా తదితర ప్రయోగాలకు వ్యతిరేకంగా ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) గళమెత్తింది. ఇవి నెట్ న్యూట్రాలిటీ స్ఫూర్తికి విరుద్ధమని తెలిపింది. వివిధ డేటా సేవలకు వివిధ రకాల చార్జీల (డిఫరెన్షియల్ డేటా) ప్రతిపాదనకు సంబంధించి ట్రాయ్ రూపొందించిన చర్చాపత్రంపై ఈ మేరకు ఐఏఎంఏఐ తమ అభిప్రాయాలు తెలియజేసింది. చర్చాపత్రంలో మొత్తం మూడు విధానాలు ఉండగా.. అందులో మొదటిది టెలికం సంస్థ నిర్దిష్ట డెవలపర్ల నుంచి ఫీజులు తీసుకుని వారి వెబ్సైట్లను యూజర్లకు ఉచితంగా అందించడం. రెండోది.. ఫేస్బుక్ వంటి సంస్థలు నిర్దిష్ట వెబ్సైట్లను ఎంపిక చేసి, టెలికం సంస్థల భాగస్వామ్యంతో వాటిని ఉచితంగా అందించడం.
ఇక మూడోది.. యాప్స్‌ను బట్టి టెలికం సంస్థలు డేటా చార్జీలు వసూలు చేయడం. ఈ మూడు విధానాలు కూడా నెట్ విషయంలో కస్టమరుకు అందుబాటులో ఉండే ఐచ్ఛికాలను తగ్గించేసేవేనని ఐఏఎంఏఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉచిత ఇంటర్నెట్ అనేది డేటారూపంలో ఉండాలే తప్ప నిర్దిష్ట కంటెంట్‌పరంగా ఉండకూడదని తెలిపింది. డేటా చార్జీల ప్రమేయం లేకుండా నిర్దిష్ట యాప్‌లను ఉచితంగా అందించే వేదికగా సోషల్ నెట్వర్కింగ్ సైటు ఫేస్బుక్ ప్రవేశపెట్టిన ఫ్రీ బేసిక్స్ సర్వీసు వివాదాస్పదమైన దరిమిలా ట్రాయ్ ఈ విధానాలపై చర్చాపత్రం రూపొందించిన సంగతి తెలిసిందే.