ఆయన లాగే... అప్పటి దాకా..!
‘‘అభిమానులు, ఇతర ప్రేక్షకులు, మీడియావాళ్లు నా మీద చూపిన అభిమానానికి ఏం మాట్లాడాలో తెలియడం లేదు. నా ఆరోగ్యం గురించి వాళ్లు పడిన ఆందోళన చూసి, ఉద్వేగానికి గురయ్యా’’ అని అలనాటి హిందీ హీరో ధర్మేంద్ర అన్నారు. ఏంటీ? ధర్మేంద్ర అనగానే ‘షోలో’ గుర్తొస్తోందా? ఆ జ్ఞాపకాలను కాసేపు పక్కనపెట్టి, ఇటీవల ధర్మేంద్ర తాజా ఆరోగ్య పరిస్థితి గురించి చాలామంది కలవరపడ్డారు. కానీ, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదనీ, ‘ఐయామ్ ఫైన్’ అని ధర్మేంద్ర ప్రకటించారు.
‘‘మూడు నెలల క్రితం ఓ చిత్రం షూటింగ్లో షాట్ గ్యాప్లో వ్యానిటీ వ్యాన్లో రిలాక్స్ కావాలనుకుని, ఎక్కబోయా. స్లిప్ అయ్యి, కిందపడ్డాను. అప్పుడు కుడి భుజం దగ్గర నొప్పిగా అనిపించింది. అది సామాన్యమైన నొప్పి కాదనీ, శస్త్ర చికిత్స అవసరం అనీ తెలుసుకున్నా. కానీ, అప్పుడు కుదరలేదు. ఇక, ఇటీవల బ్లడ్లో హెమోగ్లోబిన్ తగ్గడంతో ఆస్పత్రిలో చేరాను. రెండు రోజులు చెకప్స్ జరిగాయి. అనంతరం డిశ్చార్జ్ అయ్యాను. ఇప్పుడు బాగానే ఉన్నాను.
పస్తుతం ‘సెకండ్ హ్యాండ్ హజ్బండ్’ అనే చిత్రంలో నటిస్తున్నా. త్వరలో నా పాత్రకు డబ్బింగ్ చెప్పనున్నా. ఆ తర్వాత వీలు చేసుకుని, కుడి చేతికి ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నా’’ అన్నారు. సినిమాల్లోకి రావాలనుకోవడానికి నటుడు దిలీప్ కుమార్ ఆదర్శమనే ధర్మేంద్ర హాలీవుడ్ నటుడు, దర్శక, నిర్మాత క్లింట్ ఈస్ట్వుడ్ 105 ఏళ్ల వయసు వరకూ పని చేస్తానని ఓ సందర్భంలో అన్నారనీ, తానూ ఆయనను అనుసరించాలనుకుంటున్నాననీ చెప్పారు.