తెల్లరేగడిలో మొలకెత్తిన నల్ల పిడుగు
సంక్షిప్తంగా... నేడు మార్టిన్ లూథర్ కింగ్ వర్ధంతి
‘‘ఐ హావ్ ఎ డ్రీమ్’’ అన్నాడు మార్టిన్ లూథర్ కింగ్. వాషింగ్టన్‌లోని లింకన్ మెమోరియల్‌లో గుమికూడిన రెండు లక్షల మంది ఆ మాట విన్నారు. ప్రతిస్పందనగా పెద్ద హోరు! ఏమిటి ఆయన కల? ‘‘ఓ రోజు వస్తుంది. ఆ రోజు అమెరికాలో నల్లవారందరికీ స్వేచ్ఛ, తెల్లవారందరితో సమానత్వం అనే నా కల నిజమౌతుంది’’ అన్నాడు మార్టిన్.
1963 ఆగస్టు 28 నాటి ప్రసంగం అంది. నెల తిరక్కుండానే ఆ కల నిజమవడానికి తనింకా చాలా కష్టపడాలని అతడికి తెలిసివచ్చింది. బర్మింగ్‌హామ్ చర్చిలో జరిగిన వర్ణవివక్ష పేలుళ్లలో నలుగురు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. తర్వాతి ఏడాది మార్టిన్ లూథర్ కింగ్‌కి నోబెల్ శాంతి బహుమతి. అదే ఏడాది నల్లవారి పౌరహక్కుల చట్టం అమల్లోకి వచ్చింది. ఆ తర్వాతి ఏడాది ఓటు వేసే హక్కు కూడా! అలా అమెరికన్ ఆఫ్రికన్‌లందరికీ స్వేచ్ఛ, సమానత్వం - రెండూ సాధ్యమయ్యాయి. మార్టిన్ స్వప్నం ఫలించింది.
మార్టిన్ లూథర్ కింగ్ 1929 జనవరి 15న అట్లాంటాలో జన్మించారు. 1968 ఏప్రిల్ 4న మెంఫిస్‌లో హత్యకు గురయ్యారు. మధ్యలో ఆయన బతికి ఉన్న 39 ఏళ్ల కాలం నల్లజాతి అమెరికన్లకు ఇప్పటికీ ఒక కల లానే అనిపిస్తుంటుంది!
మార్టిన్ అసలు మేరు మైఖేల్. తర్వాత మార్టిన్ అయ్యాడు. తండ్రి (మార్టిన్ లూథర్ కింగ్ సీనియర్) బాప్టిస్టు మినిస్టర్. మినిస్టర్ అంటే మంత్రి కాదు. మతబోధకుడు. తల్లి ఆల్బెర్టా విలియమ్స్ కింగ్. పాఠశాల ఉపాధ్యాయిని. మార్టిన్ 1955లో డాక్టరేట్ సంపాదించడానికి ముందు, బోస్టన్‌లో పీహెచ్డీ చేస్తున్నప్పుడు పరిచయం అయిన కొరెట్టా స్కాట్‌ను 1953లో ఆయన వివాహం చేసుకున్నారు.
1954లో మాంట్‌గోమరీ (అలబామా) లోని డెక్స్టర్ అవెన్యూ బాప్టిస్టు చర్చికి పాస్టరుగా నియమితులయ్యారు. ఆ ఏడాదే అలబామాలో సంచలనాత్మకమైన అరెస్టు ఒకటి జరిగింది. మార్టిన్ సహచరురాలైన పౌరహక్కుల ఉద్యమ నాయకురాలు రోసా పార్క్స్ తను ప్రయాణిస్తున్న బస్సులో ఒక తెల్లవాడికి తను లేచి సీటు ఇవ్వడానికి నిరాకరించినందుకు అరెస్ట్ అయ్యారు! పార్క్స్ అరెస్టును నిరసిస్తూ మాంట్‌గోమరీలో బస్సులను ఆఫ్రికన్ అమెరికన్లు బహిష్కరించే ఉద్యమానికి మార్టిన్ నాయకత్వం వహించడంతో తొలిసారిగా అమెరికాలో ఆయన పేరు మారుమోగింది!
1963లో బర్మింగ్‌హామ్, అలబామాలలో జాతి వివక్షకు వ్యతిరేకంగా మార్టిన్ నాయకత్వంలో చెలరేగిన ఉద్యమాన్ని తెల్లవాళ్లు అత్యంత పాశవికంగా బాంబులతో అణచివేశారు. నల్లవారి ఇళ్ల మీద, కార్యకర్తల మీద తరచు బాంబు దాడులు జరుగుతుండడంతో బర్మింగ్‌హామ్ ‘బాంబింగ్హామ్’గా పేరుమోసింది! నిరసనలకు వ్యతిరేకంగా జారీ అయిన ఆదేశాలను ఖాతరు చేయకపోవడంతో మార్టిన్‌ను బర్మింగ్‌హామ్ జైల్లో వేశారు.
జైలు నుంచి మార్టిన్ విడుదల అయ్యాక ‘చిల్డ్రన్స్ క్రూసేడ్’ మొదలైంది. వేలాది మంది పాఠశాల విద్యార్థులు మార్టిన్ దన్నుతో బర్మింగ్‌హామ్ అంతటా కవాతు చేస్తూ నిరసన గళం విప్పారు.
వారిపై పోలీసులు విరుచుకు పడ్డారు. లాఠీలను ఝుళిపించడం, పోలీసు కుక్కల్ని ఉసిగొల్పడం, జ్వాలలను ఎగజిమ్మే పైపులను విద్యార్థులపైకి గురిపెట్టడం వంటి దృశ్యాలన్నిటినీ టీవీలలో చూసి అమెరికా ప్రజలు ఆగ్రహోదగ్రులయ్యారు. మార్టిన్‌కు మద్దతు ప్రకటించారు. ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితోనే మార్టిన్ ‘ఐ హావ్ ఎ డ్రీమ్’ ప్రసంగాన్ని ఇవ్వగలిగారు.
1967 డిసెంబరులో మార్టిన్ ‘పూర్ పీపుల్స్ కాంపెయిన్’ ప్రారంభించారు. సమ్మె చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మద్దతుగా మార్చింగ్‌కు ఏర్పాట్లు చేయడం కోసం 1968 ఏప్రిల్ 3 వ తేదీన టెన్నెస్సీ రాష్ట్రంలోని మెంఫిస్ చేరుకున్నారు మార్టిన్. మర్నాడు తను బస చేసిన హోటల్ బాల్కనీలో ఉన్నప్పుడు ఆయనపై దాడి జరిగింది. తుపాకీ గుళ్లకు మార్టిన్ నేలకు ఒరిగారు. అంత్యక్రియల సమయంలో మార్టిన్ స్నేహితుడు బెంజమిన్ మేస్ మాట్లాడుతూ, ‘‘మార్టిన్ లూథర్ కింగ్ సమైక్య అమెరికా అన్న భావనను నమ్మాడు. అన్ని రకాల వివక్ష గోడలు కూలిపోవాలని కలగన్నాడు’’ అని నివాళులు అర్పించారు.