Ibrahimpatnam police
-
యూట్యూబర్ నందు కేసులో కొత్త మలుపు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: యూట్యూబర్ రమా నందన(అలియాస్ నందు), ఆమె భర్త మధుకర్ జాగర్లమూడిలకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. యూకే వీసాల రెన్యువల్ పేరుతో నందన దంపతులు కోట్లలో మోసానికి పాల్పడ్డారంటూ ఫిర్యాదులు వచ్చాయి. బాధితుల ఫిర్యాదు మేరకు ఇప్పటికే కేసు నమోదు చేసిన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు.. ఆ దంపతులకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట యూకే వీసా రిన్యూవల్‌లో మోసం చేశారంటూ నందు దంపతులపై వెస్ట్ ఇబ్రహీంపట్నానికి చెందిన మామిళ్ళపల్లి శివక్రాంతి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూకేలో వీసా గడువు ముగియడంతో, భారత్‌లోని బ్రాంచ్ ద్వారా వీసా ప్రాసెస్ చేస్తామని నందు కుటుంబ సభ్యులు నమ్మించడంతో, యూట్యూబ్‌లో ఉన్న ఫేమ్ కారణంగా వారి మాటలను విశ్వసించి రూ.15 లక్షలు చెల్లించాడు. అయితే, నెలలు గడిచినా వీసా రాకపోవడంతో పాటు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో బాధితుడు మోసపోయినట్లు గ్రహించి ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించాడు.యూకేలో ఉద్యోగాలు, వర్క్ వీసాలు, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్(సీవోఎస్) ఇప్పిస్తామని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.25లక్షల వరకు తీసుకున్నారని బాధితులు చెబుతున్నారు. బాధితుల సంఖ్య 50 నుంచి 100 వరకు ఉండొచ్చని, మొత్తం లావాదేవీలు 10 నుంచి 20 కోట్ల వరకు ఉండొచ్చనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.యూకే వీసా రెన్యువల్ కోసం రూ.15లక్షలు చెల్లించానని, కానీ వీసా రాకపోవడంతో పాటు సరైన సమాధానాలు ఇవ్వలేదని క్రాంతి కుమార్ ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద మధుకర్, నందనతో పాటు మధుకర్ తండ్రి పేరు కూడా నిందితులు జాబితాలో చేర్చారు. బ్యాంక్ లావాదేవీలు, వాట్సాప్ చాట్, ఫోన్ కాల్స్ రికార్డింగ్స్ ఇలా డాక్యుమెంట్లను బాధితులు పోలీసులకు అందించినట్లు సమాచారం. ఈ కేసుపై పోలీసులు విచారణ చేపట్టారు. -
చిన్న పిల్లల కిడ్నాప్ రాకెట్ అరెస్టు!
సాక్షి, కృష్ణా: చిన్న పిల్లల కిడ్నాప్ రాకెట్‌ను ఇబ్రహీంపట్నం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చిన్నారుల బతుకులు ఛిద్రం చేసేందుకు వెట్టిచాకిరీకి తరలించే ముఠాగుట్టును పోలీసులు రట్టుచేశారు. ఆరుమంది మైనర్ బాలికలు,ఇద్దరు బాలురను అక్రమంగా తరలిస్తున్నారని సీఐడీ ఎస్ఐ ప్రసాద్ సమాచారం ఇవ్వడంతో... బృందాలుగా విడిపోయిన పోలీసులు వలపన్ని ముఠాను పట్టుకున్నారు. జగదల్ పూర్ నుంచి తిరుపతి, తమిళనాడు ప్రాంతాలకి చిన్నారులను తరలిస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. మైనర్లను విజయవాడలోని చైల్డ్ లైనుకు పోలీసులు తరలించారు. రాకెట్ వెనక ఎవరెవరున్నారు, ఎప్పటినుంచి పిల్లల తరలింపు కొనసాగిస్తున్నారు అన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
ఎర్ర చందనం దుంగలు పట్టివేత
ఇబ్రహీంపట్నానికి చెందిన ఇద్దరి అరెస్టు ఇబ్రహీంపట్నం: అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన 20 ఎర్ర చందనం దుంగలను ఇబ్రహీంపట్నం పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఈఘటనలో ఇబ్రహీంపట్నంకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. ఇబ్రహీంపట్నం సీఐ మహమ్మద్‌గౌస్ తెలిపిన వివరాల మేరకు.. ఇబ్రహీంపట్నం చెరువు వద్ద శనివారం ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుండటాన్ని ఐడీ పార్టీ పోలీసులు గుర్తించారు. వెంటనే వారు చెరువు పరిసరాలను పరిశీలించగా అక్కడ 20 ఎర్ర చందనం దుంగలు లభించాయి. వీటిని తరలించడానికి సయ్యద్‌సుల్తాన్(30), విజయ్‌కుమార్(29)లు చెరువు పరిసరాల్లో తచ్చాడుతున్నట్లు గుర్తించిన పోలీసులు వారిద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు రెండు నెలల క్రితమే వీటిని చెరువులోకి తరలించినట్లు సమాచారం. పట్టుబడిన ఎర్ర చందనం దుంగలను ఎక్కడి నుంచి తెచ్చారు, స్థానికంగా ఈ వ్యవహారం ఎన్నాళ్లుగా కొనసాగుతోంది, వీటి వెనుక ప్రధాన సూత్రధారులెవరైనా ఉన్నారా తదితర కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పట్టుబడిన ఎర్ర చందనం విలువ రూ.లక్ష వరకు, వీటిని అటవీశాఖ అధికారులకు అప్పగించామని చెప్పారు.


