ibrahimpatnam rural
-
‘పట్నం’లో నేడు హరిత పండుగ
సాక్షి, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నారు. గురువారం నియోజకవర్గంలోని మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాలతో పాటు పెద్దఅంబర్‌పేట్, ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్, ఆదిబట్ల మున్సిపాలిటీలలో మొక్కలు నాటనున్నారు. ఇందుకోసం అటవీశాఖ, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నర్సరీల్లో పెంచిన మొక్కలను ఆయా గ్రామాలకు సరఫరా చేశారు. గ్రామాలకు తరలించేందుకు మొక్కలను వాహనంలో ఎక్కిస్తున్న దృశ్యం హరితహారంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేందుకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఒకే రోజు ఆరు లక్షలు మొక్కలు నాటాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఇందుకోసం ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేసి కార్యక్రమం విజయవంతం చేయడానికి అడుగులు వేశారు. డ్వాక్రా మహిళలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువకులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు సైతం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇంటింటికీ ఆరు మొక్కలు నాటాలని, ప్రభుత్వ, ప్రైౖవేటు స్థలాల్లో, రోడ్ల వెంట, పార్కు స్థలాల్లో మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నర్సరీల నుంచి మొక్కలను ఆయా గ్రామాలకు తరలించారు. కొన్ని గ్రామాల్లో మొక్కలు ఇంటింటికీ తిరిగి పంపిణీ చేయడం కూడా పూర్తయ్యింది. ఈ కార్యక్రమానికి గ్రామస్థాయిలో నోడల్ అధికారులను నియమించారు. నాగన్‌పల్లి వద్ద గుంతలు తవ్వుతున్న కూలీలు హాజరుకానున్న ప్రియాంక వర్గీస్ స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మన్నెగూడ సెంట్రల్ రోడ్డు డివైడర్ మధ్యలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముందుగా ప్రారంభించి, అనంతరం రాయపోల్ అటవీశాఖ భూముల్లో మొక్కలు నాటుతారు. గున్గల్ ఫారెస్టులో మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ ప్రియాంక వర్గీ‹స్ పాల్గొంటారు. అదేవిధంగా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవాడిపల్లిలో పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంచాల మండలంలో జిల్లా పంచాయతీ అధికారిణిæ పద్మజారాణి, లోయపల్లిలో గీత కార్మికులు మొక్కలు నాటే కార్యక్రమానికి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రఘురాం, తుర్కగూడ రైతుల ఆధ్వర్యంలో నిర్వహించే హరితహారం కార్యక్రమానికి జిల్లా వ్యవసాయాధికారిణి గీతారెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో ట్రాన్స్‌కో డీఈ సురేందర్‌రెడ్డి, ఆర్డీఓ అమరేందర్, చర్లపటేల్‌గూడలో స్థానిక ఏసీపీ యాదగిరిరెడ్డి, మంగళ్‌పల్లి అటవీ భూముల్లో జిల్లా ఫారెస్టు అధికారి తదితరులు పాల్గొని మొక్కలు నాటనున్నారు. హరిత పండుగలో అందరూ పాల్గొనండి రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఇబ్రహీంపట్నంలో జరగబోయే హరితపండగను జయప్రదం చేయాలి. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తప్పకుండా హాజరుకావాలి. డ్వామా, ఈజీఎస్, అటవీశాఖల అధికారులు ఆరు లక్షల మొక్కలు నాటడానికి కావాల్సిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తిచేశారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా గోతులు తవ్వించి సిద్ధంగా పెట్టారు. హరితహారం విజయవంతం చేయడానికి వరణుడు కూడా సహకరిస్తున్నాడు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం రాష్ట్రంలో ఆదర్శంగా నిలవాలి. ముఖ్యమంత్రి మెచ్చుకునేలా మన హరితహారం పండగ జరగాలి. ఉదయం పది గంటలకే కార్యక్రమం ప్రారంభం కావాలి. – మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం -
ఎక్స్‌రే గదికి తాళం!
ఇబ్రహీంపట్నంరూరల్ : యాచారం మండల కేంద్రానికి చెందిన మేరాజ్‌అంజూ అనే మహిళా సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. ఎక్స్‌రే ఎక్కడ తీస్తారని సాధారణ రోగులను అడగడంతో మాకు తెలియదని చెప్పారు. ఆమెకు ఎదురుగా ఓ నర్సు వచ్చి ఇక్కడ ఎక్స్‌రే మిషన్ ఉంది కానీ ఎక్స్‌రే తీసే వారు లేరని వ్యంగంగా సమాధానం ఇచ్చింది. ప్రజా వైద్యంపై నిర్లక్ష్యం చేస్తున్నారనే విషయానికి ఇది నిలువెత్తు నిదర్శనం. బాధ్యతాయుతంగా నడుచుకోవాల్సిన సిబ్బంది రోగులను, ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసేలా వ్యవహరిస్తున్నారు. ఆరునెలలుగా వేసిన తాళం తీయ్యలే... ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాలతో పాటు ఇతర ప్రజలకు పెద్ద దిక్కైన పెద్దాస్పత్రి ఇబ్రహీంపట్నం ప్రభుత్వ దవాఖాన. ప్రజలకు నిరంతరం సేవలందిండచానికి గతంలో జిల్లా కలెక్టర్‌గా పని చేసిన వాణిప్రసాద్ చొరవతో పాత పెద్దాస్పత్రి బాగుపడింది. సకల సౌకర్యాలతో ఆదర్శ ఆస్పత్రిగా తీర్చిదిద్దితే మళ్లీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంలాగా తయారైంది. అప్పట్లో అన్ని విభాగాలు పని చేసే విధంగా ఎక్స్‌రే మిషన్ తీసుకొచ్చి పెట్టారు. గతంలో డిజిటల్ ఎక్స్‌రే లేకపోవడంతో సంవత్సర కాలంగా రూ.లక్షల్లో వెచ్చించి డిజిటల్ ఎక్స్‌రే ఏర్పాటు చేశారు. పట్టుమని పది కాలాలు గడవక ముందే ఎక్స్‌రే గదికి తాళం వేశారు. శామీర్‌పేట్ నుంచి డిప్యూటేషన్ విధానంతో ఇబ్రహీంపట్నంలో విధులు నిర్వర్తించేవారు. జిల్లాల విభజన తర్వాత మేడ్చెల్‌కు కేటాయించడంతో వారు తిరిగి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆరు నెలల కాలంగా ఇబ్రహీంపట్నం ఎక్స్‌రే యంత్రానికి అతిగతి లేకుండా పోయింది. పేద ప్రజలకు ఎక్స్‌రేలు తీసేవారు కరువయ్యారు. ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తే రూ.200–600 వరకు తీసుకుంటారు. పేదలకు ప్రభుత్వ ఆస్పత్రి దిక్కవుతుందని అనుకుంటే టెక్నిషియన్ కొరత తీరడం లేదని వాపోతున్నారు. నిత్యం 600నుంచి 1000 రోగుల వచ్చే ప్రభుత్వఆస్పత్రికి వెంటనే ఎక్స్‌రే టెక్నిషియన్ మంజూరు చేయాలని కోరుతున్నారు. ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తాం స్థానిక ఆస్పత్రిలో ఇన్నాళ్లుగా ఎక్స్‌రే తీయడానికి ఆపరేటర్ లేకపోవడం చాలా బాధకరం. రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రుల నిర్వహణకు అధిక నిధులు కేటాయిస్తుంది. ఆస్పత్రి యాజమాన్య కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వెంటనే సమస్య పరిష్కరం అయ్యేలా చూస్తాం. పేద ప్రజలకు ఇలాంటి సమస్యలు మళ్లి పునరావృత్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆరోగ్యశాఖదే.– జెర్కొని రాజు, ఇబ్రహీంపట్నం -
రైస్ పుల్లింగ్ ముఠా గుట్టు రట్టు
ఇబ్రహీంపట్నంరూరల్: రైస్‌పుల్లింగ్ పేరుతో ఓ వ్యక్తి నుంచి లక్షలు దండుకున్న వ్యక్తులను ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రైస్‌పుల్లర్‌ను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఆదిభట్ల సీఐ గోవింద్‌రెడ్డి, ఎల్బీనగర్ ఎస్వోటీ ఎస్ఐ కాశీనాథం కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిభట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని కమ్మగూడ గ్రామానికి చెందిన మదాని జాన్‌పాల్ అనే వ్యక్తికి అదే గ్రామానికి చెందిన జయరాజ్ దివ్యశక్తులు ఉన్న పాత్ర గురించి చెప్పాడు. తనకు తెలిసిన వ్యక్తుల వద్ద అలాంటి పాత్ర ఉందని నమ్మించాడు. కర్నూలు జిల్లాకు మహ్మద్ షేక్ రఫీ మహ్మద్ షేక్ షఫీ, చిత్తూరు జిల్లా కు చెందిన రంగనాథం ప్రకాష్ అనే వ్యక్తులతో కలిసి జాన్ పాల్‌ను మోసం చేసేందుకు పథకం పన్నారు. చెన్నై నుంచి ఆ పాత్ర తెచ్చేందుకు డబ్బులు కావాలని చెప్పడంతో జాన్‌పాల్ పలు దఫాలుగా రూ.11.45 లక్షలు ఇచ్చాడు. కొద్ది రోజుల క్రితం రఫీ, షఫీ, జయరాజ్, ప్రకాష్ అతనికి థర్మకోల్‌లో ప్యాకింగ్ చేసిన బిందెను ఇచ్చి ఇంట్లో ఉంచుకుని పూజలు చేయాలని చెప్పారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు.