ICC CEO Dave Richardson
-
భద్రతకే ప్రథమ ప్రాధాన్యం
కరాచీ: ప్రపంచకప్‌లో ఆటగాళ్లు, అభిమానుల భద్రతకే ప్రథమ ప్రాధాన్యం, ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యానికి తావివ్వబోమని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్సన్ స్పష్టం చేశాడు. గత శుక్రవారం న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ మసీదుల్లో జరిగిన ఉగ్ర నరమేధంలో 50 మంది మరణించగా, పదుల సంఖ్యలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో బంగ్లాదేశ్ క్రికెట్ క్రీడాకారులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకు న్నారు. అనంతరం కివీస్‌తో జరగాల్సిన మూడో టెస్ట్‌ను రద్దుచేసుకున్న బంగ్లాదేశ్ తక్షణమే స్వదేశానికి వెళ్లిపోయింది. ఈ మ్యాచ్ రద్దుకు ఐసీసీ సైతం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ఆదివారం పాకిస్థాన్‌లోని కరాచీలో జరిగిన పాక్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) తుదిపోరులో విజేతకు బహుమతులు అందించేందుకు హాజరైన ఐసీసీ సీఈవో మీడియాతో మాట్లాడారు. కివీస్‌లో జరిగిన దాడి గురించి ప్రస్తావిస్తూ రాబోయే వన్డే వరల్డ్‌కప్‌లో ఆటగాళ్లు, అభిమానుల భద్రతకే మొదటి ప్రాధాన్యమని పేర్కొన్నాడు. ‘ఇప్పటికే సెక్యూరిటీ విషయంలో ఐసీసీ అత్యంత జాగ్రత్త వహిస్తోంది. వరల్డ్‌కప్ జరగనున్న వేదికల్లో భద్రతపై ఇప్పటికే యుకే, వేల్స్ క్రికెట్ బోర్డులు ఆ దేశ అధికారులకు పటిష్ఠ చర్యలు తీసుకున్నారు. అయితే, క్రైస్ట్‌చర్చ్ ఘటన తర్వాత రక్షణ ఏర్పాట్లను మరింత పకడ్బందీగా మారుస్తున్నారు’ అని వెల్లడించాడు. -
ఇక నుంచి టెస్టు చాంపియన్‌షిప్
వెల్లింగ్టన్: దాదాపు ఏడాది కాలంగా టెస్టు ఫార్మాట్ కు కొత్త రూపు తేవాలని యోచిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆ మేరకు కార్యాచరణ రూపొందించేందుకు ముందడుగు వేసింది. టెస్టు చాంపియన్ షిప్‌కు ఐసీసీ ఆమోదం తెలుపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ టెస్టు చాంపియన్ ఫిప్‌తో పాటు అంతర్జాతీయ వన్డేలీగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు 4 రోజుల టెస్టు మ్యాచ్‌ల ప్రయోగాలను చేపట్టుకోవచ్చని టెస్టు హోదా ఉన్న దేశాలుకు అనుమతిచ్చింది. అక్లాండ్లో శుక్రవారం ఐసీసీ గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ మీడియాతో మాట్లాడారు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ టెస్టు చాంపియన్‌షిప్ ప్రారంభం అవుతుందని, ఫైనల్‌ను 2021లో నిర్వహిస్తామని ప్రకటించారు. టెస్టు హోదా కలిగిన 12 దేశాల్లో 9 దేశాలు ఈ చాంపియన్‌షిప్‌లో పాల్లొంటాయని పేర్కొన్నారు. రెండేళ్లపాటు జరిగే ఈ చాంపియన్‌షిప్‌లో 9 దేశాలు మొత్తం ఆరు సిరీస్‌లు ఆడుతాయన్నారు. మూడు సిరీస్‌లు స్వదేశంలో, మరో మూడింటిని విదేశాల్లో ఆడతాయని రిచర్డ్సన్ వివరించారు. సిరీస్‌లో కనిష్ఠంగా రెండు మ్యాచ్‌లు.. గరిష్ఠంగా ఐదు మ్యాచ్‌లు ఉంటాయని పేర్కొన్నారు. టాప్‌లో నిలిచిన రెండు దేశాలు ఏప్రిల్ 2021లో జరిగే టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో తలపడతాయన్నారు. ఈ చాంపియన్‌షిప్ గురించి మరింత కసరత్తు చేయాల్సి ఉందని తెలిపారు. టెస్టు హోదా కలిగిన 12 దేశాల్లో.. జింబాబ్వే, అఫ్గానిస్థాన్, ఐర్లాండ్లను మినహాయించినట్లు రిచర్డ్సన్ తెలిపారు. 2021 నుంచి 13 జట్ల వన్డే ఇంటర్నేషనల్ లీగ్‌ను కూడా ప్రవేశపెడతామని చెప్పారు. -
టి20 లీగ్‌ల వల్ల దెబ్బే!
ద్వైపాక్షిక సిరీస్‌లపై రిచర్డ్సన్ ఆందోళన లండన్: ఐపీఎల్, బిగ్‌బాష్, సీపీఎల్‌లాంటి టి20 లీగ్ వల్ల భవిష్యత్‌లో ద్వైపాక్షిక సిరీస్‌లకు ముప్పు తప్పదని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ హెచ్చరించారు. అయితే యాషెస్, భారత్ ఆడే సిరీస్‌లకు మినహాయింపు ఉంటుందన్నారు. వాస్తవంగా ద్వైపాక్షిక సిరీస్‌లు ఎన్ని ఉండాలన్న అంశంపై జూన్‌లో బార్బడోస్‌లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో చర్చించామని చెప్పిన ఆయన అక్టోబర్‌లో జరిగే సమావేశంలో దీనిపై మరోసారి మాట్లాడతామన్నారు. ‘యాషెస్, భారత్‌తో ఇతర పెద్ద దేశాలు ఆడే కొన్ని ద్వైపాక్షిక సిరీస్‌లకు మంచి డిమాండ్ ఉంది. అయితే మిగతా సిరీస్‌ల్లో టెస్టు మ్యాచ్‌లకు ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది. దీనివల్ల ఆయా సిరీస్‌ల నుంచి అనుకున్నంత డబ్బులు, ప్రజాదరణ లభించడం లేదు. దేశవాళీ టి20లు విజయవంతంకావడంతో గత ఎనిమిదేళ్లలో అంతర్జాతీయ క్రికెట్లో చాలా మార్పులు వచ్చాయి. వీటికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల మద్దతు లభిస్తుంది. ప్రపంచకప్‌లాంటి కొన్ని ఐసీసీ ఈవెంట్లపై కూడా మంచి ఆసక్తినే చూపిస్తున్నారు. కానీ ఎఫ్టీపీలో భాగంగా ఆడే ద్వైపాక్షిక సిరీస్‌లకే డిమాండ్ లేకుండా పోతోంది’ అని రిచర్డ్సన్ వివరించారు. ఈ సిరీస్‌లకు ఆదరణ పెరగాలంటే మంచి షెడ్యూల్‌తో పాటు మార్కెట్‌ను విస్తృతంగా పెంచుకోవడం ఒక్కటే పరిష్కారమన్నారు. -
'మోదీ అప్పట్లోనే లేఖ రాశారు'
దుబాయ్ : ఐపీఎల్ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మాజీ చైర్మన్ లలిత్ మోదీ తమకు 2013లో ఓ మెయిల్ (లేఖ) పంపాడని ఐసీసీ ఆదివారం వెల్లడించింది. ముగ్గురు ఆటగాళ్లు ఫిక్సింగ్ కు పాల్పడ్డారని ఆ మెయిల్ లో లలిత్ ఆరోపించినట్లు ఐసీసీ వివరించింది. ప్రస్తుతం లండన్ లో ఉంటున్న మోదీ ఐసీసీ చీఫ్ రిచర్డ్సన్ కు తను పంపిన లేఖను ట్విట్టర్ ఖాతాలో శనివారం పోస్ట్ చేసిన నేపథ్యంలో ఐసీసీ ఈ విషయాన్ని వెల్లడించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీమిండియాకు చెందిన ఇద్దరు క్రికెటర్లు, వెస్టిండీస్ కు చెందిన ఆటగాడు ఓ వ్యాపారవేత్తతో డబ్బులు తీసుకున్నట్లు తెలపడం ఈ లేఖ సారాంశం. అయితే ఆటగాళ్ల ఫిక్సింగ్ విషయాలను బీసీసీఐ అవినీతి నిరోధక శాఖకు అప్పట్లోనే అందించినట్లు ఐసీసీ తన అధికారిక వెబ్ సైట్ పోస్ట్ లో పేర్కొంది.