కరాచీ: ప్రపంచకప్‌లో ఆటగాళ్లు, అభిమానుల భద్రతకే ప్రథమ ప్రాధాన్యం, ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యానికి తావివ్వబోమని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్‌సన్ స్పష్టం చేశాడు. గత శుక్రవారం న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ మసీదుల్లో జరిగిన ఉగ్ర నరమేధంలో 50 మంది మరణించగా, పదుల సంఖ్యలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో బంగ్లాదేశ్ క్రికెట్ క్రీడాకారులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకు న్నారు. అనంతరం కివీస్‌తో జరగాల్సిన మూడో టెస్ట్‌ను రద్దుచేసుకున్న బంగ్లాదేశ్ తక్షణమే స్వదేశానికి వెళ్లిపోయింది.
ఈ మ్యాచ్ రద్దుకు ఐసీసీ సైతం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ఆదివారం పాకిస్థాన్‌లోని కరాచీలో జరిగిన పాక్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) తుదిపోరులో విజేతకు బహుమతులు అందించేందుకు హాజరైన ఐసీసీ సీఈవో మీడియాతో మాట్లాడారు. కివీస్‌లో జరిగిన దాడి గురించి ప్రస్తావిస్తూ రాబోయే వన్డే వరల్డ్‌కప్‌లో ఆటగాళ్లు, అభిమానుల భద్రతకే మొదటి ప్రాధాన్యమని పేర్కొన్నాడు. ‘ఇప్పటికే సెక్యూరిటీ విషయంలో ఐసీసీ అత్యంత జాగ్రత్త వహిస్తోంది. వరల్డ్‌కప్ జరగనున్న వేదికల్లో భద్రతపై ఇప్పటికే యుకే, వేల్స్ క్రికెట్ బోర్డులు ఆ దేశ అధికారులకు పటిష్ఠ చర్యలు తీసుకున్నారు. అయితే, క్రైస్ట్‌చర్చ్ ఘటన తర్వాత రక్షణ ఏర్పాట్లను మరింత పకడ్బందీగా మారుస్తున్నారు’ అని వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment