పాకిస్తాన్‌ ఆల్‌రౌండర్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ | NZ vs Pak: ICC Punishes Pak Star Khushdil Shah With Massive Fine Why | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ ఆల్‌రౌండర్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ

Published Mon, Mar 17 2025 8:17 PM | Last Updated on Mon, Mar 17 2025 8:31 PM

NZ vs Pak: ICC Punishes Pak Star Khushdil Shah With Massive Fine Why

పాకిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ ఖుష్దిల్‌ షాకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) భారీ షాకిచ్చింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ అతడి మ్యాచ్‌ ఫీజులో 50 శాతం మేర కోత విధించింది. అంతేకాదు.. క్రమశిక్షణ అంశంలో అతడి ఖాతాలో మూడు డిమెరిట్‌ పాయింట్లు జత చేసింది.

ఇందుకు సంబంధించి ఐసీసీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. న్యూజిలాండ్‌తో తొలి టీ20 సందర్భంగా ఖుష్దిల్‌ షా వ్యవహరించిన తీరుకు ఈ మేర కఠిన చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. 

కాగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో గ్రూప్‌ దశలోనే నిష్క్రమించిన పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్‌ పర్యటనలో ఉంది. కివీస్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు అక్కడికి వెళ్లింది.

32 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా
ఈ క్రమంలో మార్చి 16న కివీస్‌- పాక్‌ మధ్య తొలి టీ20 జరిగింది. క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆతిథ్య జట్టు.. పాకిస్తాన్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. చాంపియన్స్‌ ట్రోఫీ తాలుకు వైఫల్యాన్ని కొనసాగిస్తూ పాక్‌ 91 పరుగులకే కుప్పకూలింది. పాక్‌ ఇన్నింగ్స్‌లో ఖుష్దిల్‌ షా 32 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఇక సల్మాన్‌ ఆఘా బృందం విధించిన 92 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ ఆడుతూపాడుతూ ఛేదించింది. 10.1 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టపోయి టార్గెట్‌ను ఊదేసింది. ఇదిలా ఉంటే.. ఖుష్దిల్‌ షా తాను బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో కాస్త అతిగా ప్రవర్తించాడు.

అతడిని బలంగా ఢీకొట్టాడు
పాక్‌ ఎనిమిదో ఇన్నింగ్స్‌లో కివీస్‌ యువ పేసర్‌ జకారీ ఫౌల్క్స్‌ బౌలింగ్‌లో వికెట్ల మధ్య పరుగులు తీసే క్రమంలో ఖుష్దిల్‌ షా.. ఫౌల్క్స్‌ను బలంగా ఢీకొట్టాడు. ఆ సమయంలో అతడు నిర్లక్ష్యపూరితంగా, దురుసుగా ప్రవర్తించినట్లు స్పష్టంగా కనిపించింది.

ఈ నేపథ్యంలో క్రమశిక్షణా చర్యలకు పూనుకున్న ఐసీసీ.. ఖుష్దిల్‌ షాకు గట్టి పనిష్మెంట్‌ ఇచ్చింది. ఈ మేరకు.. ‘‘ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్‌ 2.12 సూచిస్తున్న నిబంధనను ఖుష్దిల్‌ ఉల్లంఘించాడు.

అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆటగాళ్లను, సిబ్బంది, మ్యాచ్‌ రిఫరీ లేదా ప్రేక్షకులు.. ఎవరినైనా సరే అనుచిత రీతిలో వారికి ఇబ్బంది కలిగించేలా తాకితే కఠిన చర్యలు ఉంటాయి. అందుకు తగ్గట్లుగా ఖుష్దిల్‌పై చర్యలు తీసుకుంటున్నాం’’ అని ఐసీసీ ప్రకటనలో పేర్కొంది. అతడి మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించడంతో పాటు మూడు డీమెరిట్‌ పాయింట్లు చేర్చింది. 

తప్పును అంగీకరించిన ఆల్‌రౌండర్‌
గత 24 నెలల కాలంలో ఇదే ఖుష్దిల్‌ మొదటి తప్పు కాబట్టి.. ఇంతటితో సరిపెట్టింది. ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్లు వేన్‌ నైట్స్‌, సామ్‌ నొగస్కి, థర్డ్‌ అంపైర్‌ కిమ్‌ కాటన్‌, ఫోర్త్‌ అంపైర్‌ క్రిస్‌​ బ్రౌన్‌ ఫిర్యాదు ఆధారంగా ఈ మేర ఐసీసీ చర్యలు తీసుకుంది. ఖుష్దిల్‌ సైతం తన తప్పును అంగీకరించాడు. 

కాగా 30 ఏళ్ల ఖుష్దిల్‌ షా లెఫ్టార్మ్‌ ఆర్థోడాక్స్‌ బౌలర్‌. అదే విధంగా.. ఎడమచేతి వాటం గల బ్యాటర్‌. 2019లో పాకిస్తాన్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ఇప్పటి వరకు 15 వన్డేలు, 28 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 328, 376 పరుగులు చేయడంతో పాటు.. నాలుగు, మూడు వికెట్లు తీశాడు.

చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్‌ అతడే.. మూడు ఫార్మాట్లలోనూ బెస్ట్‌: కోహ్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement