
న్యూజిలాండ్ ఓపెనర్ టిమ్ సీఫర్ట్ (Tim Seifert) సరికొత్త చరిత్ర సృష్టించాడు. పాకిస్తాన్‌తో ఐదో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగి ప్రపంచ రికార్డు సాధించాడు. లక్ష్య ఛేదనలో అత్యధిక స్ట్రైక్ రేటుతో.. తొంభై పరుగుల మార్కు చేరుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు.
ఇంగ్లండ్ పవర్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ (Liam Livingstone) పేరిట ఉన్న రికార్డును సీఫర్ట్ బద్దలు కొట్టి సీఫర్ట్ ఈ అరుదైన ఘనత సాధించాడు. కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు పాకిస్తాన్ న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది.
ఈ క్రమంలో తొలి, రెండు టీ20లలో కివీస్ గెలవగా.. మూడో మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలిచింది. ఆ తర్వాత మళ్లీ పైచేయి సాధించిన న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది.
ఈ క్రమంలో ఇరుజట్ల (New Zealand Vs Pakistan) మధ్య బుధవారం నామమాత్రపు ఐదో టీ20 జరిగింది. వెల్లింగ్‌టన్ వేదికగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది.
కెప్టెన్ సల్మాన్ ఆఘా (39 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించగా... షాదాబ్ ఖాన్ (28; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. హరీస్ (11), నవాజ్ (0), యూసుఫ్ (7), ఉస్మాన్ ఖాన్ (7), అబ్దుల్ సమద్ (4) విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో నీషమ్ 5 వికెట్లతో విజృంభించగా... జాకబ్ డఫీ 2 వికెట్లు తీశాడు.
బాదుడే బాదుడు...
స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ తొలి ఓవర్ నుంచే పాక్ బౌలర్లపై ప్రతాపం చూపింది. తొలి ఓవర్‌లో ఓపెనర్ టిమ్ సీఫర్ట్ 4, 6, 6 కొడితే... రెండో ఓవర్‌లో అలెన్ 4, 4, 6 బాదాడు. మూడో ఓవర్‌లో సీఫర్ట్ 4, 6... నాలుగో ఓవర్లో ఇద్దరు కలిసి 3 ఫోర్లు కొట్టడంతో స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది.
జహాందాద్ ఖాన్ వేసిన ఆరో ఓవర్‌లో సీఫెర్ట్ 6, 4, 6, 2, 6, 1 కొట్టడంతో 23 బంతుల్లోనే అతడి హాఫ్‌సెంచరీ పూర్తయింది. పాక్ యువ బౌలర్ ముఖీమ్ రెండు ఓవర్లలో 6 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసినప్పటికీ... సీఫెర్ట్ జోరును మాత్రం అడ్డుకోలేకపోయాడు. షాదాబ్ వేసిన పదో ఓవర్‌లో 6, 6, 6, 6 కొట్టిన సీఫర్ట్ మ్యాచ్‌ను ముగించాడు.
ఫలితంగా న్యూజిలాండ్ 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి గెలిచింది. తొలి బంతి నుంచే సీఫర్ట్ వీరవిహారం చేయగా... ఫిన్ అలెన్ (12 బంతుల్లో 27; 5 ఫోర్లు, 1 సిక్స్) ఉన్నంతసేపు ధాటిగా ఆడటం కలిసివచ్చింది. పాక్ బౌలర్లలో ముఖీమ్ 2 వికెట్లు తీశాడు. నీషమ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, సీఫర్ట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.
టిమ్ సీఫర్ట్ ప్రపంచ రికార్డు
ఇక ఈ మ్యాచ్‌లో టిమ్ సీఫర్ట్ మొత్తంగా 38 బంతుల్లో 97 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లతో పాటు ఏకంగా పది సిక్సర్లు ఉండగా.. స్ట్రైక్‌రేటు 255.26గా నమోదైంది.
ఈ నేపథ్యంలో.. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగి.. అత్యధిక స్ట్రైక్‌రేటుతో తొంభైకి పైగా పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా సీఫర్ట్ చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ స్టార్ లియామ్ లివింగ్‌స్టోన్ పేరిట ఉండేది.
లివింగ్‌స్టోన్ 2021లో పాకిస్తాన్‌పై నాటింగ్‌హామ్ వేదికగా 239.53 స్ట్రైక్‌రేటుతో 103 పరుగులు సాధించాడు. ఇక అంతర్జాతీయ టీ20లలో 250కి పైగా స్ట్రైక్‌రేటుతో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగానూ సీఫర్ట్ చరిత్రపుటల్లో తన పేరును లిఖించుకోవడం మరో విశేషం.
చదవండి: ‘అతడిని ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా? ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగదు’