సురక్షితంగా విడిచిపెట్టిన ఇండోనేసియాలోని పపువా రెబల్స్
జకార్తా: న్యూజిలాండ్ పైలట్‌ను ఏడాదిన్నర క్రితం నిర్బంధంలోకి తీసుకున్న ఇండోనేసియాలోని పపువా ప్రాంత వేర్పాటువాద గ్రూపు శనివారం విడిచిపెట్టింది. క్రైస్ట్‌చర్చ్ వాసి ఫిలిప్ మార్క్ మెహర్టెన్స్(38) ఇండోనేసియాకు చెందిన సుశి ఎయిర్ విమానయాన సంస్థలో పైలట్‌గా ఉన్నారు. మారుమూల పపువా ప్రాంతంలోని విమానాశ్రయంలో ఉన్న ఫిలిప్‌ను రెబల్స్ 2023 ఫిబ్రవరి 7వ తేదీన నిర్బంధంలోకి తీసుకున్నారు.
2023 ఏప్రిల్‌లో మెహర్టెన్స్‌ను విడిపించేందుకు ప్రయతి్నంచిన ఇండోనేసియా సైనికులు ఆరుగురిని రెబల్స్ చంపేశారు. దీంతో, అప్పటి నుంచి చర్చి మధ్యవర్తిత్వంతో ఇండోనేసియా ప్రభుత్వం, ఇతర విభాగాలు రెబల్స్‌తో చర్చలు జరుపుతూ వచ్చాయి. ఎట్టకేలకు చర్చలు సఫలమై మెహర్టెన్స్ బయటకు రాగలిగారు. ఇది చాలా క్లిష్టమైన వ్యవహారమంటూ ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో సైతం వ్యాఖ్యానించడం గమనార్హం.
మెహర్టెన్స్ విడుదలకు సంబంధించిన వివరాలను ఎవరూ బహిర్గతం చేయలేదు. రెబల్స్ చెర నుంచి విముక్తి లభించిన అనంతరం మెహర్టెన్స్ పపువాలోని తిమికా నుంచి జకార్తాకు చేరుకున్నారు. అతడి కుటుంబం బాలిలో ఉంటోంది. ఇండోనేసియా సంస్కృతి, జాతిపరంగా పపువా ప్రజలు విభిన్నంగా ఉంటారు. న్యూ గినియాలోని పశ్చిమ భాగమైన పపువా గతంలో డచ్ పాలకుల చేతుల్లో ఉండేది. 1969లో ఐరాస సారథ్యంలో పపువాలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి ఇండోనేసియా కలిపేసుకుంది. ఇదంతా బూటకమంటున్న వేర్పాటువాదులు స్వతంత్రం కోసం సాయుధ పోరాటం సాగిస్తున్నారు. గతేడాది నుంచి ఈ పోరాటం తీవ్రరూపం దాలి్చంది.
Comments
Please login to add a commentAdd a comment