
జయపుర అడివి గురించి చెబుతున్న మహిళ(క్రెడిట్: బీబీసీ)
ఇండోనేషియాలోని పపువా ప్రావిన్స్‌లో గల జయపురలో ఉన్న అడవికి ఓ ప్రత్యేకత ఉంది. అక్కడ కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం. కాదని పురుషులు ఎవరైనా ఆ అడవిలో అడుగుపెడితే అస్సలు సహించరు. ఇంతకీ స్త్రీలు అక్కడికి ఎందుకు వెళ్తారు? మగవాళ్లు గనుక అక్కడ ప్రవేశిస్తే ఎలాంటి శిక్ష పడుతుంది? ఆ కథాకమామీషు ఏంటో స్థానికుల మాటల్లోనే..
బీబీసీ ఇండోనేషియాతో మాట్లాడిన ఆడ్రియానా మరౌడ్.. ‘‘చాలా కాలం నుంచి ఇది మహిళలకు మాత్రమే చెందిన అడవిగా ఉంది. నా పుట్టుక మొదలు నేటి దాకా దీని మనుగడ ఇలాగే కొనసాగుతోంది. ఒకే రకమైన నిబంధనలు అమలు అవుతున్నాయి. ఈ అడవిలోకి రావాలంటే నగ్నంగా మారాల్సి ఉంటుంది. దుస్తులు ధరించాల్సిన అవసరం లేదు. మహిళలు ఇక్కడ స్వేచ్ఛగా విహరిస్తారు. ఈ అడవి లేకుండా మాకు జీవితమే లేదు.
ప్రతిరోజూ ఇక్కడికి వస్తాం. మాకు కావాల్సినవి తీసుకువెళ్తాం. ఒకవేళ ఎవరైనా పురుషుడు గనుక ఇక్కడ ప్రవేశిస్తే.. అతడు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. సుమారు 69 అమెరికా డాలర్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పాలిష్ చేసిన రాళ్ల రూపంలో ఈ మొత్తాన్ని సదరు వ్యక్తి చెల్లించాలి. నిజానికి ఏదైనా అలికిడి వినిపిస్తే మేం వెంటనే అప్రమత్తమవుతాం. మా గొంతు వినగానే ఎవరైనా ఇతర వ్యక్తులు ఇక్కడ ఉంటే వెంటనే వెళ్లిపోతారు’’ అని చెప్పుకొచ్చారు.
ఆల్చిప్పల సేకరణై వెళ్తున్న మహిళ(ఫొటో క్రెడిట్: బీబీసీ)
ఇక మరో గ్రామస్తురాలు ఆరి రుంబోరుసి తన అనుభవాలు పంచుకుంటూ... ఆల్చిప్పల సేకరణకై తామంతా ఇక్కడికి వస్తామని అసలు విషయం తెలిపారు. ‘‘వెలితిగా అనిపించినపుడు జట్టుగా మారతాం. మా స్నేహితులను కూడా ఇక్కడికి ఆహ్వానిస్తాం. బోటులో వారు ఇక్కడకు వస్తారు. అడవిలో ఉన్నపుడు మాకు నచ్చినట్లుగానే ఉంటాం. ఒక్క పురుషుడు కూడా ఇక్కడ ఉండడు. కాబట్టి మాకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంటుంది. పెద్దలతో, ఇతరులతో మా అభిప్రాయాలు పంచుకునే వెసలుబాటు ఉంటుంది. నీటిలో సేదదీరుతూ.. బురదలో ఉన్న ఆల్చిప్పలు సేకరిస్తాం’’ అని ఆమె చెప్పుకొచ్చారు.
ప్లాస్టిక్ కారణంగా ఇబ్బందులు
సముద్ర ఒడిలో సేకరించిన ఆల్చిప్పలను సమీప మార్కెట్లలో అమ్మడం ద్వారా ఇక్కడి మహిళలు ఆదాయం సమకూర్చుకుంటారు. అయితే, పచ్చని ప్రకృతితో నిండి ఉన్న ఈ అపురూప సంపదను సైతం ప్లాస్టిక్ భూతం వెంటాడుతోంది. స్థానిక పట్టణాల నుంచి కొట్టుకువస్తున్న ప్లాస్టిక్ వస్తువులతో సముద్రం నిండిపోతోంది. దీంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అక్కడి మహిళలు చెబుతున్నారు.
‘‘ఇది చాలా విచారకరం. అంతకుముందు ఆల్చిప్పలతో మా పడవలు సగం నిండేవి. కానీ ఇప్పుడు, చెత్తాచెదారం పోగు చేసి బయటపారేయడమే పనిగా మారింది. ఏదేమైనా ఈ అడవిని శుభ్రంగా ఉంచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం’’ అని తమకు జీవనాధారం కల్పిస్తున్న అడవితల్లిపై వారు ప్రేమను చాటుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment