
పామును నిందితుడి నోట్లో, లోదుస్తుల్లోకి పంపాలని...
జకర్తా : ఇండోనేషియా పోలీసులు తమ కండ కావరాన్ని ప్రదర్శించారు. చోరీ కేసులో అరెస్టైన ఓ వ్యక్తిని చిత్రహింసలు పెట్టారు. అప్పటికీ అతడు నేరాన్ని అంగీకరించకపోవడంతో చేతులు కట్టేసి ఓ బతికున్న భారీ సైజు పామును నిందితుడిపై వదిలారు. ఈ సంఘటన పపువాలో చోటుచేసుకుంది. తనను వదిలేయమని అతను ప్రాధేయపడినా కనికరించలేదు. అంతటితో ఆగకుండా మరో పోలీసుల అధికారి పామును నిందితుడి నోట్లో, లోదుస్తుల్లోకి పంపాలని అనడం వీడియోలో రికార్డయింది. అక్కడే ఉన్న పోలీసు పాము తోకను నిందితుడి నోట్లో పెట్టడానికి ప్రయత్నించాడు. ఇప్పటి వరకు ఎన్ని చోరీలు చేశావని అడగ్గా, అతను రెండు చోరీలు మాత్రమే చేశానని నేరాన్ని అంగీకరించాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో మలేషియా పోలీసులు క్షమాపణ చెప్పారు. ఈ సంఘటనకు కారణమైన వారిపై ఉన్నతాధికారులు చర్యలకు ఆదేశించారు. విచారణ అధికారి ప్రొఫెషనల్‌గా వ్యవహరించలేదని పేర్కొన్నారు.