కొలంబో: శ్రీలంకలోని చర్చ్‌లు, విలాసవంతమైన హోటళ్లు లక్ష్యంగా గత ఈస్టర్ ఆదివారం నాడు భీకరమైన బాంబు దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఎల్టీటీఈ తిరుగుబాటు అణచివేత అనంతరం ప్రశాంతంగా ఉన్న శ్రీలంకలో ఒక్కసారిగా ఈ ఉగ్రవాద బాంబుదాడులు ఎందుకు జరిగాయి? స్థానిక ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఎందుకు ఇంత తీవ్రమైన ఆత్మాహుతి, బాంబు దాడులకు తెగబడింది? అన్నది ప్రస్తుతం అందరినీ కలిచి వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాథమిక దర్యాప్తును ఉటంకిస్తూ.. శ్రీలంక సీనియర్ మంత్రి ఒకరు మంగళవారం దేశ పార్లమెంటులో కీలక విషయాలు వెల్లడించారు.
న్యూజిలాండ్‌లోని మసీదుల్లో జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఇస్లామిక్ ఉగ్రవాదులు శ్రీలంకలో బాంబు దాడులు జరిపారని శ్రీలంక రక్షణశాఖ సహాయ మంత్రి రువాన్ విజేవర్దనే తెలిపారు. బాంబు దాడుల నేపథ్యంలో పార్లమెంటులో మాట్లాడిన ఆయన.. న్యూజిలాండ్ క్రైస్ట్‌చర్చ్‌లోని రెండు మసీదుల్లో జరిగిన కాల్పులకు ప్రతీకారంగా శ్రీలంకలో ఆత్మాహుతి బాంబు దాడులు జరిగాయని ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తులో ప్రాథమికంగా తేలిందని పేర్కొన్నారు. క్రైస్ట్‌చర్చ్‌లోని రెండు మసీదుల్లో జరిగిన ఉన్మాది కాల్పుల్లో 50మంది మరణించిన సంగతి తెలిసిందే.
శ్రీలంకలో గత ఆదివారం జరిగిన భీకరమైన ఉగ్రవాద దాడుల్లో 321మంది మరణించగా.. 500 మందికిపైగా గాయపడ్డారు. గాయపడినవారిలో 375మంది ఇంకా ఆస్పత్రుల్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment