న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ నగర శివార్లలో నివపించే గిన్నీ, డేవిడ్ దంపతులు పెంచుకుంటున్న ఐదేళ్ల నల్లపిల్లి ఇది. పేరు.. కీత్. దీని ‘దొంగ’బుద్ధితో ఇరుగుపొరుగు వారికి భలే చిక్కొచ్చిపడింది. అర్ధరాత్రులు నిశ్శబ్దంగా చుట్టుపక్కల వాళ్ల ఇళ్లలోకి జొరబడటం... కంటపడ్డ వస్తువులను పట్టుకొచ్చేయడం దీనికి అలవాటు. బూట్లు, స్విమ్ సూట్లు, గ్లౌజ్‌లు, మహిళల లోదుస్తులు, ఓ పోలీసు అధికారి షర్టు, ఈల్ చేపలు... ఇలా చాలానే యజమానుల ఇంటికి తెచ్చేస్తోంది. మూడేళ్లుగా దీనికి ఈ అలవాటున్నా... ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. రోజుకు ఐదారు వస్తువులను కొట్టుకొస్తోంది.
ఇటీవల గంజాయి పీల్చే హుక్కా లాంటి ఓ గాజు పరికరం, తెల్లటి పొడితో నిండిన చిన్న బ్యాగును పట్టుకొచ్చేసింది. దాంతో దీని ఘనకార్యాలు పోలీసులకూ తెలిశాయి. అవి ఎక్కుడునుంచి తెచ్చిందో తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసోళ్లు. ఎంతైనా ఐదేళ్ల నుంచి పెంచుకుంటున్న పెంపుడు పిల్లి కాబట్టి గిన్నీ, డేవిడ్‌లు దీన్ని కట్టడి చేయలేక... ఇరుగుపొరుగుతో ఇబ్బందులు రాకూడదని ఓ ఆలోచన చేశారు. తమ ఇంటి ఆవరణలో ఓ ప్లాస్టిక్ బుట్ట పెట్టి... కీత్ ఎత్తుకొచ్చేస్తున్న వస్తువులను అందులో ఉంచుతున్నారు. ఇరుగుపొరుగు తమ ఇంట్లో బూట్లు, ఇతర ఏదైనా వస్తువులు కనపడకపోతే ఇక్కడికొచ్చి... బుట్టలో వెతికి పట్టుకుపోతున్నారు. ఇదీ ఈ దొంగపిల్లి కథ.
Comments
Please login to add a commentAdd a comment