టి20 లీగ్‌ల వల్ల దెబ్బే!
ద్వైపాక్షిక సిరీస్‌లపై రిచర్డ్‌సన్ ఆందోళన
లండన్: ఐపీఎల్, బిగ్‌బాష్, సీపీఎల్‌లాంటి టి20 లీగ్ వల్ల భవిష్యత్‌లో ద్వైపాక్షిక సిరీస్‌లకు ముప్పు తప్పదని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్‌సన్ హెచ్చరించారు. అయితే యాషెస్, భారత్ ఆడే సిరీస్‌లకు మినహాయింపు ఉంటుందన్నారు. వాస్తవంగా ద్వైపాక్షిక సిరీస్‌లు ఎన్ని ఉండాలన్న అంశంపై జూన్‌లో బార్బడోస్‌లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో చర్చించామని చెప్పిన ఆయన అక్టోబర్‌లో జరిగే సమావేశంలో దీనిపై మరోసారి మాట్లాడతామన్నారు.
‘యాషెస్, భారత్‌తో ఇతర పెద్ద దేశాలు ఆడే కొన్ని ద్వైపాక్షిక సిరీస్‌లకు మంచి డిమాండ్ ఉంది. అయితే మిగతా సిరీస్‌ల్లో టెస్టు మ్యాచ్‌లకు ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది. దీనివల్ల ఆయా సిరీస్‌ల నుంచి అనుకున్నంత డబ్బులు, ప్రజాదరణ లభించడం లేదు. దేశవాళీ టి20లు విజయవంతంకావడంతో గత ఎనిమిదేళ్లలో అంతర్జాతీయ క్రికెట్‌లో చాలా మార్పులు వచ్చాయి. వీటికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల మద్దతు లభిస్తుంది. ప్రపంచకప్‌లాంటి కొన్ని ఐసీసీ ఈవెంట్లపై కూడా మంచి ఆసక్తినే చూపిస్తున్నారు. కానీ ఎఫ్‌టీపీలో భాగంగా ఆడే ద్వైపాక్షిక సిరీస్‌లకే డిమాండ్ లేకుండా పోతోంది’ అని రిచర్డ్‌సన్ వివరించారు. ఈ సిరీస్‌లకు ఆదరణ పెరగాలంటే మంచి షెడ్యూల్‌తో పాటు మార్కెట్‌ను విస్తృతంగా పెంచుకోవడం ఒక్కటే పరిష్కారమన్నారు.