పసిడి బాండ్లు... డబ్బు ఆర్బీఐకి
చేరేవరకూ 4% వడ్డీ!
న్యూఢిల్లీ: నాలుగవ విడత పసిడి బాండ్లను కొన్నవారికిది శుభవార్తే. ఎందుకంటే బాండ్లకోసం ఇన్వెస్టర్లు చెల్లించిన డబ్బు ఎక్స్ఛేంజ్ లేదా ఇండియన్ క్లియరింగ్ కార్పొరేషన్ (ఐసీసీఎల్) నుంచి రిజర్వ్ బ్యాంక్‌కు బదిలీ అవ్వాల్సి ఉంటుంది. అప్పటి నుంచే బాండ్లు జారీ అయి... వాటిపై వడ్డీ కూడా అందుతుంది. అయితే ఈ లోగా ... అంటే ఆర్బీఐకి చేరేలోగా ఎన్నిరోజులైతే అన్ని రోజులకు 4 శాతం వడ్డీ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ప్రస్తుత సేవింగ్స్ బ్యాంక్ రేటుకు సమానం కావడం గమనార్హం.
ఈ రేటు ప్రత్యక్షంగా ఇన్వెస్టర్ బ్యాంక్ ఖాతాలో జమవుతుందని బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. బీఎస్ఈ ప్లాట్‌ఫామ్‌పై సావరిన్ గోల్డ్ బాండ్ అలాట్ అయ్యేంతవరకూ బిడ్స్‌కు సంబంధించి వచ్చిన డబ్బుపై ఈ వడ్డీని ఐసీసీఎల్ ద్వారా చెల్లిస్తుందని తెలియజేసింది. అయితే డబ్బు విత్‌డ్రాయెల్స్ విషయంలో ఈ వడ్డీ చెల్లింపులు ఉండబోవని స్పష్టం చేసింది. నాల్గవ విడత గోల్డ్ బాండ్ పథకం 18న ప్రారంభమైంది. జూలై 22న ముగుస్తుంది. తరువాత బాండ్లు జారీ అవుతాయి. ఎక్స్ఛేంజ్ల్లో ట్రేడింగ్ కూడా జరిగే ఈ బాండ్ కూపన్ వార్షిక రేటు 2.75 శాతం.