నేడు ఐసెట్-14
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
హన్మకొండ, న్యూస్‌లైన్: రాష్ట్రవ్యాప్తంగా ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు శుక్రవారం నిర్వహించనున్న ఐసెట్ -2014 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరగనున్నట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఓంప్రకాశ్ తెలిపారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదన్నారు.
1,42,464 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని, ఈ మేరకు 263 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పకడ్బందీగా పరీక్ష నిర్వహించేందుకు అబ్జర్వర్లను కూడా నియమించినట్లు వెల్లడించారు. బ్లూ లేదా బ్లాక్ పాయింట్‌పెన్‌నే వినియోగించుకోవాలని అభ్యర్థులకు సూచించారు. ఉదయం 6 గంటలకు కాకతీయ యూనివర్సిటీలో ఐసెట్‌కు సంబంధించిన రెండు సెట్ల బాక్స్‌లలో ఒక సెట్‌ను ఎంపిక చేయనున్నట్లు వివరించారు.