ఆధారాల్లేని నగదు స్వాధీనం
సాక్షి, కాశీబుగ్గ : పలాస మండలం టెక్కలిపట్నం పంచాయతీ కేంద్రంలో బస్టాండ్ వద్ద మంగళవారం నిర్వహించిన తనిఖీలలో రూ.లక్షా 83 వేలు పట్టుబడ్డాయి. మంగళవారం మధ్యాహ్నం వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానం గోపినాథపురం గ్రామానికి చెందిన కర్ని ఆరుద్ర ఈ సొమ్ముతో వెళ్తుండగా అధికారులు గుర్తించారు. వివరాలు అడిగితే సమాధానం చెప్పకపోవడంతో నగదుతో పాటు 12 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని పలాస నియోజకవర్గ ఎన్నికల అధికారి డి.అనితాదేవికి అప్పగించారు. తనిఖీల్లో ఏడీ పి.బి.శ్రీనివాసులు, పలాస ఉప తహసీల్దారు బడే పాపారావు, కాశీబుగ్గ ఏఎస్ఐ బి.వి.కె.ప్రసాదరావు పాల్గొన్నారు.
మెళియాపుట్టి చెక్‌పోస్టు వద్ద రూ.83 వేలు
టెక్కలి రూరల్: ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదును టెక్కలిలోని మెళియాపుట్టి చెక్‌పోస్టు వద్ద అధికారులు పట్టుకున్నారు. యేదురు జానకమ్మ అనే మహిళ బస్సు దిగి వస్తుండగా బ్యాగు తనిఖీ చేయగా రూ.83వేలు గుర్తించారు. డబ్బులు ఎక్కడవని ప్రశ్నించగా చాకిపల్లి గ్రామానికి చెందిన తాను గారబందలో తన బంగారం అమ్మి డబ్బులు తీసుకొస్తున్నానని చెప్పింది. నగలు అమ్మిన రసీదు లేకపోవడంతో నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సురేష్‌బాబు తెలిపారు.
కొర్లాం చెక్‌పోస్టు వద్ద రూ.2.60 లక్షలు..
సోంపేట: మండలంలోని కొర్లాం జాతీయ రహదారి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద అనధికారికంగా తరలిస్తున్న రూ.2.60 లక్షలను మంగళవారం పట్టుకున్నట్లు ఉప తహసీల్దార్ ఆర్.శ్రీనివాసరావు తెలిపారు.
సోంపేట పట్టణానికి చెందిన డోకి తిరుమలరావు (సేల్స్ ఏజెంట్) బైకుపై బ్రాహ్మణతర్లాకు వెళ్తుండగా బ్యాగు తనిఖీ చేశామని, ఎటువంటి ఆధారాలు చూపించక పోవడంతో నగదు సీజ్ చేశామని చెప్పారు. తనిఖీల్లో ఏఎస్ఐ కృష్ణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
అమృత లింగానగరం జంక్షన్లో..
సరుబుజ్జిలి: ఎటువంటి ఆధారాలు లేకుండా కొత్తూరు తరలిస్తున్న రూ.98,500 నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి పైడి కూర్మారావు, హెడ్ కానిస్టేబుల్ ఎన్.వి.రమణలు మంగళవారం పట్టుకున్నారు. అమృత లింగానగరం జంక్షన్ వద్ద తనిఖీలు చేపడుతుండగా ఈ మొత్తాన్ని గుర్తించామని, నగదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేసి నియోజకవర్గం ఎన్నికల అధికారికి అప్పగించామని చెప్పారు.
ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలో..
ఇచ్ఛాపురం: ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన స్టాటస్టిక్ సర్వేలయన్స్ బృందం, పోలీసులు చెక్‌పోస్టులు, బస్టాండ్ కూడలి వద్ద మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో రూ.14,01,00 నగదును పట్టుకున్నారు. పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్ద ఎక్సైజ్ సీఐ లక్ష్మి, పట్టణ ఎస్ఐ సింహాచలం, ప్లయింగ్ స్క్వాడ్ గణపతిలు జరిపిన తనిఖీల్లో బరంపురం నుంచి ఆంధ్రాకు కారులో వస్తున్న శశాంక్ సారంగ్ అనే వ్యక్తి వద్ద రూ..5,50,000 నగదు, ముచ్చింద్ర చెక్‌పోస్టు వద్ద రూరల్ ఎస్ఐ కోటేశ్వరరావు వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఒడిశాలోని కటక్‌కు కారులో వెళ్తున్న బిపిన్ సాహు వద్ద నుంరి రూ.3,29,000 పట్టుకొన్నారు. బస్టాండ్ కూడలిలో ఎస్ఎస్టి బృందం మురళీకృష్ణ, ఏఎస్ఐ నాగార్జున, అప్పన్న, ప్రకాష్ బృందం వాహనాలను తనిఖీ చేస్తుండగా బరంపురం నుంచి విశాఖపట్నంకు కారులో వెళ్తున్న శశిదేవ్సువార్ అనే వ్యక్తి నుంచి రూ.4,30,000, కంచిలి నుంచి బరంపురం వెళ్తున్న జానకిరావు దాస్ నుంచి రూ.92,000 నగదు పట్టుకున్నారు. వీటికి సరైన ఆధారాలు చూపిస్తేనే తిరిగి అందజేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున్న రూ.50,000 పైబడిన నగదుతో ప్రయాణం చేసిన వాటికి సరైన ఆధారాలను కలిగి ఉండాలని సూచించారు. తనిఖీల్లో పట్టుబడ్డ నగదును రెవెన్యు అధికారులకు అప్పగించారు.