అడుక్కుంటే ‘చిప్పకూడే’
సాక్షి, హైదరాబాద్ :
రాజధానిలోని ఓ కూడలి..
ట్రాఫిక్ సిగ్నల్ పడింది..
ఇంతలో బిచ్చగాళ్లు వచ్చారు.. బాబ్బాబ్బాబు.. అంటూ వాహనదారుల చుట్టుముట్టారు..
నగరంలోని ఏ జంక్షన్లో చూసినా ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణం!
ఇకపై ఇలా బిచ్చమెత్తితే తీసుకెళ్లి జైల్లో పెడతారు!
ఈ మేరకు బహిరంగ ప్రదేశాల్లో బిచ్చమెత్తు కోవడాన్ని నిషేధిస్తూ పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
వాహనచోదకులు, పాద చారులకు బిచ్చగాళ్లతో తలెత్తుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బుధవారం నుంచి 2 నెలలపాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని, వీటిని ఉల్లం ఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుం టామని హెచ్చరిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. బుధవారం నుంచి 2018 జనవరి 7 వరకు నోటిఫికేషన్ ఉపసంహరించేంత వరకు ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. వీటిని ఉల్లంఘించిన వారిపై ఐపీసీలోని 188 సెక్షన్‌తో పాటు హైదరాబాద్ పోలీసు చట్టం, తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్, జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద చర్యలు తీసుకుం టామన్నారు.
ఈ ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తే గరిష్టంగా నెలరోజుల జైలు లేదా రూ.200 జరిమానా లేదా రెండూ విధించే ఆస్కా రముంది. రహదారుల్లోని ప్రధాన జంక్షన్లలో బిచ్చమెత్తుకోవడానికి కొందరు చిన్న పిల్లలు, వికలాంగులను నియమించుకుంటున్నట్లు కమిషనర్ తెలిపారు. కొన్నిసార్లు బిచ్చగాళ్ల ప్రవర్తన పాదచారులు, వాహనచోదకులకు ప్రమాదహేతువులుగా మారుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే బహిరంగ ప్రదేశాలు, ప్రధాన రహదారులు, జంక్షన్లలో బిచ్చమెత్తుకోవడాన్ని నిషేధిస్తున్నట్లు వివరించారు. ఈ నెల 28 నుంచి మూడ్రోజులపాటు అంతర్జాతీయ వాణిజ్య సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం నగరాన్ని సుందరంగా తీర్చిది ద్దుతూ.. బిచ్చగాళ్లపైనా దృష్టి సారించింది.