Idem Karma Ra Babu
-
టీడీపీ నేతల్లో కొత్త టెన్షన్.. ఇదేం కర్మరా బాబు?
40 ఏళ్ళ క్రితం ఏర్పడిన టీడీపీకి ఎంత కర్మ పట్టిందంటూ ఆ పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. అలాగే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే తమ నేతకు ఇదేం కర్మ అంటూ తలలు బాదుకుంటున్నారు. ఇదేం కర్మ అంటూ ప్రారంభించిన ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడానికి టీడీపీ శ్రేణులు ఎందుకు వెనకాడుతున్నాయి? ఆ టైటిల్‌తో పచ్చ పార్టీ నాయకులకు వచ్చిన ఇబ్బందేంటి? టైటిల్‌తో చంపేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాందోళన చేపట్టాలనుకుంటున్నా తెలుగుదేశానికి ప్రతిసారీ చుక్కెదురవుతోంది. గత నెలలో చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం రివర్సయింది. రాష్ట్రంలో ఎక్కడా ప్రజలు టీడీపీని పట్టించుకోలేదు. ఇప్పుడు ఇదేమి కర్మ అంటూ మరో కొత్త కార్యక్రమాన్ని తెర మీదకు తెచ్చింది. ఈ స్లోగన్‌తో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. డిసెంబర్ రెండో తేదీ నుంచి ప్రజల్లోకి వెళ్ళాలని పచ్చ పార్టీ శ్రేణుల్ని ప్రజల్లోకి వెళ్ళాలంటూ చంద్రబాబు ఆదేశించారు. అయితే ఇదేం కర్మ అనే టైటిల్‌తో ప్రజల్లోకి వెళ్ళడానికి తెలుగుదేశం నాయకులు వెనకాడుతున్నారు. మాకిదేం కర్మ అంటూ పెదవి విరుస్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళేందుకు ఇదేమి కర్మ స్లోగన్ అస్సలు బాగోలేదని..మరొక పేరు నిర్ణయించాలని టీడీపీ నేతలు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన అనేక కార్యక్రమాలకు, చంద్రబాబు నాయుడు పాదయాత్రకు మంచి పేర్లు ఎంపిక చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. పేరు మార్చకపోతే జనంలోకి వెళ్ళడానికి కష్టంగా ఉంటుందని నాయకులంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సంకుచిత నినాదాలు చంద్రబాబు నాయుడి బ్రెయిన్ చైల్డ్ కార్యక్రమం ఇదేమి కర్మ కార్యక్రమం ప్రారంభం కాకుండానే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీపై సెటైర్లు మొదలయ్యాయి. చంద్రబాబు ఎంట్రీ ఇవ్వడంతోనే తెలుగుదేశం పార్టీ కర్మ కాలిందని.. నెటిజన్లు టీడీపీని ఆట ఆడుకుంటున్నారు. సీఎం జగన్ బహిరంగ సభల్లో చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ పాలనే ఒక కర్మని ప్రజలు అనుకుంటున్నారని.. చంద్రబాబు ఇదే టైటిల్ పెట్టడం తమ కర్మ అని సొంత పార్టీ వారే తలపట్టుకునేలా చేస్తున్నారన్నారని వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. చంద్రబాబును.. కుటుంబంలోనూ, తర్వాత పార్టీలోనూ చేర్చుకున్నందుకు.. మంత్రి పదవి ఇచ్చినందుకు ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఇదేం కర్మ అని అనుకుని ఉంటారని.. కుప్పంతో సహా రాష్ట్రం అంతటా స్థానిక ఎన్నికల్లో ఓడిపోయినందుకుగాను చంద్రబాబు ఇదేం కర్మ అని తలపట్టుకుని కూర్చున్నాడని సీఎం జగన్ సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబును చూసి సొంత పుత్రుడు, దత్తపుత్రుడు ఇదేం కర్మ అని అనుకుంటున్నారని.. టీడీపీ నేతల ధోరణి చూసి రాష్ట్ర ప్రజలంతా వీళ్ళకి ఏం కర్మ పట్టిందని చర్చించుకుంటున్నారంటూ ఒక రేంజ్లో సీఎం జగన్.. టీడీపీని ఆడేసుకుంటున్నారు. పచ్చ కామెర్ల వాళ్లకు లోకమంతా.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలంతా ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్న తరుణంలో.. టీడీపీ ప్రారంభించబోతున్న ఇదేం కర్మ కార్యక్రమం.. ఆ పార్టీ కర్మకొచ్చిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అటు ముఖ్యమంత్రి, ఇటు మంత్రులు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు గాలి తీసేస్తున్నారు. ఒక వైపు నెటిజన్లు.. మరోవైపు అధికార పార్టీ వేస్తున్న సెటైర్లతో టీడీపీ నేతలు ఈ టైటిల్‌తో ప్రజల్లోకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం.. డిసెంబర్ రెండో తేదీ నుంచి ఇదేం కర్మ టైటిల్ తోనే ప్రజల్లోకి వెళ్లేందుకు నేతలు అంతా సిద్ధంగా ఉండాలని ఆదేశిస్తున్నారు. చంద్రబాబు ఆదేశాలు టీడీపీలో అమలవుతాయా? బాదుడే బాదుడు కార్యక్రమం మాదిరిగా మధ్యలో ఆగిపోతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com. -
పెళ్లిలో కూడానా.. ఇదేమి ఖర్మరా బాబు..!
సాక్షి, శ్రీకాకుళం: ‘ఎన్నిసార్లు పార్టీ పరువు తీస్తారు కళా వెంకట్రావు? మీరు ఇంకా ఇన్చార్జిగా ఉండడం మా ఖర్మ! పెళ్లికి వెళ్లి పార్టీ ప్రోగ్రాం చేసే ఖర్మ తెలుగుదేశం ఇన్చార్జికి పట్టిందా? ఎచ్చెర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్నే వైఎస్సార్సీపీ కార్యకర్తలుగా చిత్రీకరించి పార్టీలో చేర్చుకునే ఖర్మ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జికి పట్టిందా? 10 మందితో పేరుకి ప్రోగ్రామ్ చేస్తారా? కారులో నుంచి దిగి 5 నిమిషాలు స్టేజీ మీద ఉండి నాలుగు మాటలు మాట్లాడితే అదే ప్రోగ్రామా? కేశవరాయునిపాలెం గ్రామంలో మీరు ఇవాళ ఏం పని మీద వచ్చారు? ఏమి చేశారు? పెళ్లికి వచ్చిన బంధువులు, కార్యకర్తలతో కలిసి ఇదేమి ఖర్మ బ్యానర్ పెట్టి నాలుగు ఫోటోలు దిగితే ప్రోగ్రామ్ ఐపోయినట్టేనా? పార్టీ పరువు ఎన్ని విధాలుగా.. ఎన్ని సార్లు తీస్తారు?’ అంటూ సాక్షాత్తు టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ నాయకులు చేస్తే ఆరోపణలు, విమర్శలవుతాయి. అదే సొంత పార్టీ కార్యకర్తలు.. అదీ పార్టీ కార్యక్రమంపైన ధ్వజమెత్తితే ఏమనుకోవాలో టీడీపీ మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకటరావే చెప్పాలి. టీడీపీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకటరావును సొంత పార్టీ కార్యకర్తలే ఏకిపారేస్తున్నారు. ఆయన చేస్తున్న కార్యక్రమాలతో ఏకంగా పార్టీ అప్రతిష్ట పాలవుతుందని తెలుగు తమ్ముళ్లు మండి పడుతున్నారు. ఎంతో సీనియరై ఉండి జూనియర్ కంటే దారుణమైన రీతిలో పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారని ధ్వజమెత్తుతున్నారు. అక్కడా ఇక్కడా అని కాకుండా సోషల్ మీడియాలో, పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో కడిగి పారేస్తున్నారు. పెళ్లి వేడుకకు వచ్చిన నాయకులతో ‘ఇదేమి ఖర్మ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ.. లావేరు మండలం కేశవరాయునిపాలెంలో పార్టీ నాయకుడు నాయన శంకర్‌రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు కళా వెంకటరావు శుక్రవారం హాజరయ్యారు. మండల పార్టీ నాయకులతో కలిసి వధూవరులను ఆశీర్వదించారు. అయితే, అధినేత చంద్రబాబు పిలుపు మేరకు ‘ఇదేమి ఖర్మ’ కార్యక్రమాన్ని అక్కడికక్కడే నిర్వహించారు. మరోసారి పిలుపిస్తే వచ్చే కొద్ది పాటి కార్యకర్తలు, నాయకులు హాజరవరనో.. పార్టీ కార్యక్రమాన్ని ప్రజలు విశ్వసించరనో గానీ అప్పటికప్పుడే బ్యానర్ పెట్టి కార్యక్రమాన్ని కానిచ్చేశారు. ఇప్పుడిదే టీడీపీలో చర్చనీయాంశమైంది. ప్రత్యర్థి పార్టీ విమర్శలు చేస్తే వేరు.. సాక్షాత్తు తోటి టీడీపీ కార్యకర్తలు, నాయకులు కళా వెంకటరావుపై భగ్గుమంటున్నారు. పాలఖండ్యాంలో పార్టీలో చేరికల పేరుతో టీడీపీ కార్యకర్తల్నే చేర్పించి సాధించిందేంటి? ఎచ్చెర్ల పార్టీ కార్యాలయంలో చేరికలు పేరుతో మీరు చేసిందేంటి? ఎన్నిసార్లు మీ తప్పులు మీకు ఎత్తి చూపించినా మారకపోతే ఏమనాలి? అని గట్టిగా నిలదీస్తున్నారు. మీ లాంటి వారిని మోయాల్సి రావడం నిజంగా మా ఖర్మ.. అంటూ సోషల్ మీడియా, పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో కళా తీరును కడిగిపారేస్తున్నారు. వాస్తవంగా టీడీపీకి, ఆయనకు జనాదరణ లేకపోవడంతో పెళ్లికొచ్చిన జనాలతో కార్యక్రమాన్ని చేసేద్దామనుకోవడం బూమ్రాంగైంది. -
ఇదేం కర్మ రా బాబూ..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ప్రసంగం ధాటిని, ఘాటును ప్రతిపక్షాలకు చవిచూపించారు. నర్సాపురంలో జరిగిన సభలో జగన్ చేసిన ప్రసంగానికి సోషల్ మీడియాలోను, విశ్లేషకుల పరంగానూ వస్తున్న ప్రశంసలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన కర్మకు తననే నిందించుకునేలా జగన్ స్పీచ్ సాగిందంటే అతిశయోక్తి కాదు. అధికార వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలన్న యోచనతో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన ఇదేం కర్మ కార్యక్రమం ఆరంభం కాకముందే అభాసుపాలైంది. తామేదో అట్టహాసంగా ఇదేం కర్మ అని ప్రచారం చేయాలనుకుంటే ముఖ్యమంత్రి జగన్ ముందస్తుగానే తమను క్లీన్ బౌల్డ్ చేశారని ప్రతిపక్షం వాపోయే పరిస్థితి ఏర్పడింది. జగన్ తన ప్రసంగంలో చంద్రబాబు నాయుడే ఒక కర్మ అని, అప్పటి తెలుగుదేశం పార్టీ పాలనే ఒక కర్మ అని ప్రజలే అనుకుంటున్నారని చెప్పి ఈ టైటిల్ పెట్టడం తమ కర్మ అని ఆ పార్టీ వారే తలపట్టుకునేలా చేశారు. ఆత్మవిశ్వాసం వర్సెస్ ఏడుపుగొట్టు ప్రసంగం జగన్ ప్రసంగంలో వాడి, వేడితో పాటు ఒక ఆత్మ విశ్వాసం స్పష్టంగా కనిపించింది. చంద్రబాబు కాని, పవన్ కళ్యాణ్ ( సీఎం జగన్ పరిభాషలో దత్తపుత్రుడు) కానీ తాము ఏమి చేస్తామో చెప్పకుండా, తమను గెలిపించాలని ప్రజలను బెదిరిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తాను ఎన్నికల మానిఫెస్టోలో 98 శాతం అమలు చేశానని, దానిని నమ్మితే తనను ఆశీర్వదించండని ఆయన ధైర్యంగా చెబుతున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇలా అనలేదు. ఇలా అనాలంటే సాహసం కావాలి. అయితే 2009 ఎన్నికల సమయంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒకటి, రెండు తప్ప కొత్త హామీలు ఏమీ ఇవ్వకుండా ప్రజలలోకి వెళ్లి గెలిచారు. అదే ధోరణిలో ఇప్పుడు జగన్ మరింత దూకుడుగా ఉన్నారని చెప్పాలి. అందుకే ప్రతిపక్ష వ్యూహాన్ని తుత్తినియలు చేయగలిగారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గడపగడపకు కార్యక్రమం నిర్వహించడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్ గా మారిందని అంతా భావిస్తున్నారు. మొదట ఈ ప్రోగ్రాంను ఎలాగైనా ఫెయిల్ అయిందని ప్రొజెక్టు చేయాలని తెలుగుదేశం, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా తీవ్రంగా ప్రయత్నించాయి. కక్కలేక.. మింగలేక.. పచ్చప్రకోపం ప్రజలు గడపగడపకు వస్తున్న ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని, నిరసన చెబుతున్నారని విమర్శలు చేశారు. టీడీపీ పత్రికలైన ఈనాడు, ఆంద్రజ్యోతిలు మరో అడుగు ముందుకేసి అబద్దాలు, సబద్దాలు పోగుచేసి ఆ కార్యక్రమానికి వ్యతిరేకంగా ప్రచారం చేశాయి. కాని టీడీపీ వ్యూహకర్తలు ఆ ప్రోగ్రాం సక్సెస్ అయిందని గమనించారు. దాంతో గడపగడపకు పోటీగా ఏదో ఒకటి నడపాలని భావించారు. అందులో భాగంగా టీడీపీ కార్యకర్తలు, నేతలు ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వంపై ఇదేం కర్మ అని ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇక్కడే టీడీపీ బలహీనత బహిర్గతమైపోయింది. ఏ కార్యక్రమం అయితే వైసీపీ చేపట్టిందో, దానినే టీడీపీ కూడా మరో రూపంలో చేపట్టవలసి వచ్చింది. టీడీపీ థింక్ టాంక్ వైసీపీని కాపీ కొట్టవలసి వచ్చింది. ఈ నేపధ్యంలో టీడీపీవారు ఒక్క ఇంటికి వెళ్లక ముందే ఇదేం కర్మ బాబూ అంటూ చంద్రబాబు పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజలంతా ఈ కర్మ తమకు వద్దని భావించే టీడీపీని ఓడించారని, అలాగే సొంతపుత్రుడు, దత్తపుత్రుడిని ఓడించారని జగన్ పేర్కొన్నారు. టీడీపీ ఓడిపోయిందని ఊరుకుంటే ఎలాగో సరిపెట్టుకోవచ్చు. కాని లోకేష్, పవన్ కళ్యాణ్ ల ఓటమిని గురించి కూడా ప్రస్తావించి చంద్రబాబును జగన్ ముల్లు పెట్టి పొడిచినట్లుగా ఉంది. దీనికి చంద్రబాబు మరీ ఎక్కువ బాధపడతారేమో తెలియదు. నిజంగానే ఇది బాబు కర్మ సాధారణంగా ఇదేం కర్మ బాబూ అన్న పదాన్ని ఎవరికి వారు వాడుకుంటారు. భాషలో ఉన్న మర్మం తెలియకో, తెలివితక్కువగానో ఇదేం కర్మ అని అనేసరికి వైసీపీకాని, ప్రజలు కాని ఆ పదాల చివర బాబూ అని తగిలిస్తున్నారు. దాంతో ఇదంతా చంద్రబాబుకు ఎదురుదెబ్బగా మారుతోంది. దీనికి తోడు జగన్ ఒకటికి నాలుగు ఉపమానాలు చెప్పి టీడీపీవారిని మరింతగా ఉడికించారు. చంద్రబాబును ఇంటిలో, పార్టీలో చేర్చుకున్నందుకు, మంత్రి పదవి ఇచ్చినందుకుగాను ఎన్.టి.ఆర్. ఇదేం కర్మ అని అనుకుని ఉంటారని జగన్ డైలాగు విసిరితే అంతా గొల్లున నవ్వారు. ఇక చంద్రబాబు కూడా కుప్పంతో సహా రాష్ట్రం అంతటా స్థానిక ఎన్నికలలో ఓడిపోయినందుకుగాను ఇదేం కర్మ అని తలపట్టుకుని కూర్చున్నారట. ఆయనను చూసి సొంత పుత్రుడు, దత్తపుత్రుడు ఇదేం కర్మ అని అనుకుంటున్నారట. వీళ్ల ధోరణి చూసి రాష్ట్ర ప్రజలంతా ఇదేం కర్మ అని అనుకుంటున్నారట. చమత్కారపూరకంగా జగన్ చేసిన ఈ ప్రసంగంతో టీడీపీ వారి ఇదేం కర్మ కార్యక్రమానికి గాలి తీసేసినట్లయింది. అంతా కర్మ సిద్ధాంతం అదే సమయంలో సెల్ టవర్ ఎక్కుతామని, పురుగు మందు తాగుతామని, రైలు కింద పడతామని బెదిరించేవారిలాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించి ప్రజలలో వారిని చులకన చేయడంలో జగన్ సఫలం అయ్యారనిపిస్తుంది. కర్నూలులో చంద్రబాబు, మంగళగిరిలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలకు జగన్ ప్రసంగానికి ఎంత తేడా ఉందో గమనించండి. చంద్రబాబు, పవన్‌లు బూతులు మాట్లాడే స్థాయికి దిగజారితే, జగన్ మాత్రం ఎక్కడా అభ్యంతరకర పదాలు వాడకుండా, అదే సమయంలో ప్రతిపక్షానికి ఎలా వాతలు పెట్టాలో చేసి చూపించి తన స్థాయిని మరింతగా పెంచుకున్నారని చెప్పాలి. విశేషం ఏమిటంటే కొందరు తెలుగుదేశం నేతలు కూడా ఇదేం కర్మ అన్న టైటిల్‌ను వ్యతిరేకించారట. అయినా చంద్రబాబు వినలేదని చెబుతున్నారు. ఇప్పుడు జగన్ ప్రసంగం తర్వాత నిజంగానేచంద్రబాబు ఇదేం కర్మ బాబూ అని ఆయనకు ఆయనే అనుకోవల్సిందేనేమో! హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com