40 ఏళ్ళ క్రితం ఏర్పడిన టీడీపీకి ఎంత కర్మ పట్టిందంటూ ఆ పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. అలాగే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే తమ నేతకు ఇదేం కర్మ అంటూ తలలు బాదుకుంటున్నారు. ఇదేం కర్మ అంటూ ప్రారంభించిన ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడానికి టీడీపీ శ్రేణులు ఎందుకు వెనకాడుతున్నాయి? ఆ టైటిల్‌తో పచ్చ పార్టీ నాయకులకు వచ్చిన ఇబ్బందేంటి?
టైటిల్‌తో చంపేస్తున్నారు
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాందోళన చేపట్టాలనుకుంటున్నా తెలుగుదేశానికి ప్రతిసారీ చుక్కెదురవుతోంది. గత నెలలో చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం రివర్సయింది. రాష్ట్రంలో ఎక్కడా ప్రజలు టీడీపీని పట్టించుకోలేదు. ఇప్పుడు ఇదేమి కర్మ అంటూ మరో కొత్త కార్యక్రమాన్ని తెర మీదకు తెచ్చింది. ఈ స్లోగన్‌తో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. డిసెంబర్ రెండో తేదీ నుంచి ప్రజల్లోకి వెళ్ళాలని పచ్చ పార్టీ శ్రేణుల్ని ప్రజల్లోకి వెళ్ళాలంటూ చంద్రబాబు ఆదేశించారు. అయితే ఇదేం కర్మ అనే టైటిల్తో ప్రజల్లోకి వెళ్ళడానికి తెలుగుదేశం నాయకులు వెనకాడుతున్నారు. మాకిదేం కర్మ అంటూ పెదవి విరుస్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళేందుకు ఇదేమి కర్మ స్లోగన్ అస్సలు బాగోలేదని..మరొక పేరు నిర్ణయించాలని టీడీపీ నేతలు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన అనేక కార్యక్రమాలకు, చంద్రబాబు నాయుడు పాదయాత్రకు మంచి పేర్లు ఎంపిక చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. పేరు మార్చకపోతే జనంలోకి వెళ్ళడానికి కష్టంగా ఉంటుందని నాయకులంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సంకుచిత నినాదాలు
చంద్రబాబు నాయుడి బ్రెయిన్ చైల్డ్ కార్యక్రమం ఇదేమి కర్మ కార్యక్రమం ప్రారంభం కాకుండానే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీపై సెటైర్లు మొదలయ్యాయి. చంద్రబాబు ఎంట్రీ ఇవ్వడంతోనే తెలుగుదేశం పార్టీ కర్మ కాలిందని.. నెటిజన్లు టీడీపీని ఆట ఆడుకుంటున్నారు. సీఎం జగన్ బహిరంగ సభల్లో చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ పాలనే ఒక కర్మని ప్రజలు అనుకుంటున్నారని.. చంద్రబాబు ఇదే టైటిల్ పెట్టడం తమ కర్మ అని సొంత పార్టీ వారే తలపట్టుకునేలా చేస్తున్నారన్నారని వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. చంద్రబాబును.. కుటుంబంలోనూ, తర్వాత పార్టీలోనూ చేర్చుకున్నందుకు.. మంత్రి పదవి ఇచ్చినందుకు ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఇదేం కర్మ అని అనుకుని ఉంటారని.. కుప్పంతో సహా రాష్ట్రం అంతటా స్థానిక ఎన్నికల్లో ఓడిపోయినందుకుగాను చంద్రబాబు ఇదేం కర్మ అని తలపట్టుకుని కూర్చున్నాడని సీఎం జగన్ సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబును చూసి సొంత పుత్రుడు, దత్తపుత్రుడు ఇదేం కర్మ అని అనుకుంటున్నారని.. టీడీపీ నేతల ధోరణి చూసి రాష్ట్ర ప్రజలంతా వీళ్ళకి ఏం కర్మ పట్టిందని చర్చించుకుంటున్నారంటూ ఒక రేంజ్‌లో సీఎం జగన్.. టీడీపీని ఆడేసుకుంటున్నారు.
పచ్చ కామెర్ల వాళ్లకు లోకమంతా..
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలంతా ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్న తరుణంలో.. టీడీపీ ప్రారంభించబోతున్న ఇదేం కర్మ కార్యక్రమం.. ఆ పార్టీ కర్మకొచ్చిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అటు ముఖ్యమంత్రి, ఇటు మంత్రులు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు గాలి తీసేస్తున్నారు. ఒక వైపు నెటిజన్లు.. మరోవైపు అధికార పార్టీ వేస్తున్న సెటైర్లతో టీడీపీ నేతలు ఈ టైటిల్తో ప్రజల్లోకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం.. డిసెంబర్ రెండో తేదీ నుంచి ఇదేం కర్మ టైటిల్ తోనే ప్రజల్లోకి వెళ్లేందుకు నేతలు అంతా సిద్ధంగా ఉండాలని ఆదేశిస్తున్నారు. చంద్రబాబు ఆదేశాలు టీడీపీలో అమలవుతాయా? బాదుడే బాదుడు కార్యక్రమం మాదిరిగా మధ్యలో ఆగిపోతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com.
Comments
Please login to add a commentAdd a comment