నేటి నుంచి ‘ఐద్వా’ ఆధ్వర్యంలో జీపుజాతా
అనంతపురం అర్బన్: జనావాసాల మధ్య మద్యం దుకాణాలు తొలగించాలని కోరుతూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) పోరుకు సిద్ధమైంది. బుధవారం నుంచి మూడు రోజులపాటు జిల్లాలో జీపు జాతా ద్వారా ప్రజలను చైతన్యపరచనుంది. మంగళవారం నగరంలోని కార్యాలయంలో ఐద్వా జిల్లా అధ్యక్షకార్యదర్శులు లక్ష్మీదేవి, సావిత్రి మాట్లాడారు. జనావాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మహిళలు వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికైనా జనావాసాల మధ్యనున్న దుకాణాలను తొలగించకపోతే ఐద్వా ఆధ్వర్యంలో ప్రత్యక్ష దాడులకు దిగుతామని హెచ్చరించారు. నేడు నగరంలోని శ్రీశ్రీ నగర్లో జీపుజాతా ప్రారంభమవుతుందన్నారు. 7, 8 తేదీల్లో మునిసిపాలిటీల్లో జీపు జాతా కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలనే డిమాండ్‌తో ఈ నెల 11న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని, 15న చలో విజయవాడ కార్యక్రమం తలపెట్టామన్నారు. సమావేశంలో ఐద్వా నగర అధ్యక్ష, కార్యదర్శులు యమున, చంద్రిక, నాయకురాలు రామాంజినమ్మ పాల్గొన్నారు.