IG N. Sanjay
-
కాల్‌యముళ్లను ఉపేక్షించం
మహిళలు, ఆడపిల్లలను వేధింపులకు గురిచేస్తే సహించేది లేదని, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ హెచ్చరించారు. కాల్‌మనీ కేసులు గుంటూరులో బయటపడితే ఊరుకోబోమని పేర్కొన్నారు. బుధవారం గుంటూరులోని తన కార్యాలయంలో ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు.. - సాక్షి, గుంటూరు సాక్షి : పోలీస్ సిబ్బంది కొరత వల్ల అధికారులు, సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. కొరత ఏ మేరకు ఉంది? ఎప్పటిలోగా భర్తీ చేస్తారు? ఐజీ : రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలీస్ సిబ్బంది కొరత ఎక్కువగా ఉన్నమాట వాస్తవమే. గుంటూరు రేంజ్ పరిధిలో ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సుమారు 13 నుంచి 18 శాతం సిబ్బంది కొరత ఉంది. కొత్త సంవత్సరంలో సిబ్బంది కొరత తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సాక్షి : గుంటూరు రేంజ్ పరిధిలో కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటు ప్రతిపాదనలు ఏమయ్యాయి? ఐజీ : గుంటూరు రేంజ్ పరిధిలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎక్కడెక్కడ నూతన పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నాం. జనాభా, నేరాల సంఖ్య ఆధారంగా నూతన పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా జాగ్రత్త పడుతున్నాం. సాక్షి : తుళ్లూరు పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు ఎంతవరకు వచ్చింది? ఐజీ : తుళ్లూరు నూతన పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, 674 పోస్టులు కొత్తగా మంజూరు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఫైనాన్స్ డిపార్టుమెంట్ అనుమతులు రాలేదు. దాదాపు వచ్చే నెలలో దీనికి పూర్తిస్థాయిలో అనుమతులు వస్తాయని భావిస్తున్నాం. సాక్షి : రాజధాని పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు ఎంతవరకు వచ్చింది? ఐజీ : దీనిపై ఏడాది క్రితమే ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కమిషనరేట్‌ను ఎలా ఏర్పాటు చేయాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది. సాక్షి : గుంటూరు రూరల్ పోలీస్ కార్యాలయం ఏర్పాటు ఎంతవరకు వచ్చింది? ఐజీ : గుంటూరు రూరల్ పోలీస్ కార్యాలయం ఏర్పాటుకు నరసరావుపేట పట్టణంలోని 22 ఎకరాల ఎన్ఎస్పీ స్థలాన్ని ఇచ్చారు. అయితే, ఈ ఫైల్ వేగంగా కదిలినప్పటికీ క్యాబినెట్లో పెట్టి నిర్ణయం తీసుకోవాల్సి రావడంతో కొంత ఆలస్యమైంది. నరసరావుపేట మున్సిపాలిటీ శతవసంతాల వేడుకల సందర్భంగా శంకుస్థాపన వాయిదా పడింది. వచ్చేనెలలో డీజీపీ జేవీ రాముడు చేతులమీదుగా శంకుస్థాపన నిర్వహిస్తాం. రూ.20 కోట్లు వెచ్చించి నాలుగు నూతన భవనాలు నిర్మిస్తాం. సాక్షి : రేంజ్ పరిధిలో పలుచోట్ల అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు తట్టుకోలేక పోలీసులు సెలవుపై వెళ్తున్నారు, దీనిపై మీ స్పందన? ఐజీ : పోలీసులు మనోధైర్యాన్ని కలిగి ఉండాలి. మనవైపు తప్పు లేకుండా చూసుకుంటే.. ఎవరూ తప్పు చేయమని అడిగే సాహసం చేయలేరు. నిజాయితీగా పనిచేసే అధికారులకు మా అండదండలు ఎప్పుడూ ఉంటాయి. సాక్షి : సీఎం క్యాంపు కార్యాలయం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు ఇబ్బందులకు గురవుతున్నారు, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఐజీ : సౌకర్యాలు లేకపోవడంతో కొంత ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. త్వరలో సెక్యూరిటీ అధికారులు, సిబ్బందికి భవనాలు నిర్మించే ఏర్పాటు చేస్తున్నాం. సీఎం రెస్ట్‌హౌస్ వద్ద గుంటూరు రేంజ్ పరిధిలోని అన్ని జిల్లాల డీఎస్పీలకు రొటేషన్ పద్ధతిలో విధులు కేటాయిస్తున్నాం. -
ఐ క్లిక్ కేంద్రాలపై ఐజీ సమీక్ష
- ఎస్పీ, ఇతర అధికారులతో సమావేశం ఒంగోలు క్రైం : గుంటూరు పోలీస్ రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ ఆన్లైన్ ఫిర్యాదుల కేంద్రాలైన ఐ క్లిక్‌పై శుక్రవారం సమీక్షించారు. జిల్లా పోలీస్ కేంద్ర కార్యాలయంలో ఎస్పీ చిరువోలు శ్రీకాంత్‌తో కలిసి ఎస్పీ చాంబర్లో ఇతర పోలీస్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ ఏడాది మే నెల 28న డీజీపీ రాముడు ఒంగోలులో రెండు ఐ క్లిక్ కేంద్రాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఐజీ సంజయ్ ఐ క్లిక్ కేంద్రాల పనితీరుపై సమీక్ష చేశారు. ఇప్పటి వరకు రెండు కేంద్రాల ద్వారా ఎన్ని ఆన్లైన్ ఫిర్యాదులు వచ్చాయి, వాటిలో ఎన్ని పరిష్కరించారు, ఎన్ని దర్యాప్తులో ఉన్నాయి.. అన్న అంశాలను ఎస్పీ శ్రీకాంత్‌ను అడిగి తెలుసుకున్నారు. ఐ క్లిక్ కేంద్రాలు ఎలా పనిచేస్తున్నాయన్న దానిపై కూడా లోతుగా సమీక్షించారు. ఆర్టీసీ బస్టాండ్ కేంద్రంలో 169 ఫిర్యాదులు, నెల్లూరు బస్టాండ్ సెంటర్లోని ఆంధ్రాబ్యాంక్ ఏటీఎం కేంద్రంలోని ఐ క్లిక్‌లో 102 ఫిర్యాదులు వచ్చాయని ఐజీ దృష్టికి ఎస్పీ తీసుకెళ్లారు. వాటిలో కొన్ని పరిష్కారం అయ్యాయని, మరికొన్ని ఫిర్యాదులు దర్యాప్తులో ఉన్నట్లు వివరించారు. సమీక్షలో ఏఎస్పీ బి.రామానాయక్, ఏఆర్ ఏఎస్పీ జె.కృష్ణయ్య, ఎస్బీ డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, డీసీఆర్బీ డీఎస్పీ బి.మరియదాసు, ఎస్సీ,ఎస్టీ సెల్ డీఎస్పీలు కేవీ రత్నం, బాలసుందరం, ట్రాఫిక్ డీఎస్పీ జె.రాంబాబు, సీఐ వి.సూర్యనారాయణ ఉన్నారు.