IG nagireddy
-
భైంసా అల్లర్లు: కీలక విషయాలు వెల్లడించిన ఐజీ
సాక్షి, హైదరాబాద్: భైంసాలో జరిగిన అల్లర్లలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి స్పష్టం చేశారు. అల్లరకు ప్రధాన కారణం హిందూవాహిని కార్యకర్తలే అని వెల్లడించారు. మంగళవారం సాయంత్రం డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. ‘ఈనెల 7వ తేదీన రాత్రి 8.20 గంటలకు గొడవ మొదలైంది.. అందులో ప్రధానంగా హిందూవాహినికి చెందిన తోట మహేశ్, దత్తు పటేల్ అనే ఇద్దరు బైకుపై వెళ్తూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న రిజ్వాన్ అతని మిత్రులు సమీర్, మిరాజ్‌లను వెనక నుంచి తలపై కొట్టారు. కోపంతో ఈ ముగ్గురు మహేశ్‌ను వెంబడిస్తూ బట్టీ గల్లీలోకి వెళ్లి వెదకడం ప్రారంభించారు’’ అన్నారు. ‘‘ఈ క్రమంలోనే ఆ ముగ్గురిపై దత్తు, మహేశ్.. రాకేశ్, గోకుల్‌తో కలసి దాడి చేశారు. అనంతరం ఆ ముగ్గురు యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొంతసేపటి తర్వాత మద్యం కొనేందుకు దత్తు బైక్‌పై జుల్ఫికర్ మసీద్ ప్రాంతం నుంచి వెళ్లే క్రమంలో మరో వర్గం ఎదురుపడటంతో మళ్లీ ఘర్షణ మొదలైంది. ఆ సందర్భంగా రమణా యాదవ్ అనే వ్యక్తి కానిస్టేబుల్‌పై ఇటుకతో దాడి చేసి తల పగులగొట్టాడు. అక్కడ ఓ నిర్మాణం కోసం వచ్చిన ట్రక్కులో తెచ్చిన ఇటుకలున్నాయి. వీటిని ఆయుధాలుగా చేసుకుని రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ, సీఐ కేవలం గంటన్నర నుంచి రెండు గంటల్లోగా అల్లర్లను అదుపుచేశారు’’ అని తెలిపారు. ‘‘వీరితో పాటు ఎస్పీ విష్ణు వారియర్ అతని బలగాలు, ఇతర జిల్లాల నుంచి రామగుండం సీపీ సత్యనారాయణ, మంచిర్యాల డీసీపీ, అడిషనల్ ఎస్పీలు తమ బలగాలతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ అల్లర్లలో 15వ వార్డు కౌన్సిలర్ ఎంఐఎం పార్టీకి చెందిన అబ్దుల్ కరీం అతని అనుచరులు, హిందూవాహినికి చెందిన 8వ వార్డు కౌన్సిలర్ తోట విజయ్ వర్గీయులు పాల్గొన్నారు. ఏడో తేదీ తర్వాత 8, 9, 10వ తేదీల్లో పార్థి, మహాగావ్ భైంసా శివార్లలో జరిగిన అల్లర్లలో హిందూవాహినికి చెందిన సంతోష్, క్రాంతి, లింగోజీ, బాలాజీ, జగదీశ్ పాత్ర ఉన్నట్లు గుర్తించాం. సంతోష్‌కు హిందూవాహిని జిల్లా అధ్యక్షుడు చెప్పడంతోనే హింసకు దిగారు. లింగోజీ అల్లర్లలో స్పెషలిస్ట్.. గత అల్లర్లలోనూ ఇతని పాత్ర ఉంది. ఇవీ.. ఈ మొత్తం వ్యవహారానికి దారితీసిన పరిస్థితులు. భైంసాలో 500 మంది పోలీసులతో ఎస్పీ వారియర్ ఆధ్వర్యంలో నిరంతర గస్తీతోపాటు 27 పికెట్లు ఏర్పాటు చేశారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ భైంసాలో శాంతిని పునఃస్థాపించాం. అప్పట్నుంచి ఇప్పటివరకూ ఎలాంటి ఘటన చోటుచేసుకోలేదు. సంతోష్ అతని అనుచరులను అరెస్టు చేయగానే.. అల్లర్లు మొత్తం ఆగిపోయాయి..’ అని వివరించారు. 26 కేసులు..42 మంది అరెస్టు ఇక ఇద్దరు విలేకరులతో కలిపి మొత్తం 12 మంది పౌరులకు అల్లర్లలో గాయాలయ్యాయని నాగిరెడ్డి తెలిపారు. ‘13 షాపులు, 4 ఇళ్లు, 4 ఆటోలు, 6 ఫోర్‌వీలర్లు, 5 టూవీలర్లను దహనం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో భైంసాలోని సీసీ కెమెరా ఫుటేజీలు, ఫోన్ కాల్స్ వివరాలు తదితర సాంకేతిక ఆధారాలతోపాటు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం ఆధారంగా ఘటనకు సంబంధించి 26 కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా 38 మందితోపాటు నలుగురు మైనర్లను కలిపి మొత్తం 42 మందిని అరెస్టు చేశాం. అల్లర్ల సమయంలో రోడ్లపైకి వచ్చిన 70 మందిని గుర్తించాం. మరో 66 మందిని బైండోవర్ చేశాం. ఈ విషయాన్ని పోలీసు శాఖ చాలా తీవ్రంగా తీసుకుంది. అందుకే, శాంతి భద్రతల విషయాన్ని రామగుండం సీపీ సత్యనారాయణ పర్యవేక్షిస్తుండగా, కేసుల దర్యాప్తు పర్యవేక్షణకు కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డికి అప్పగించాం. ఇలాంటి ఘటనలు పునరావృతం చేయాలని చూసేవారిపై పీడీ కేసులు నమోదు చేస్తాం. ప్రజలు సంయమనంతో వ్యవహరించాలి. అల్లర్లలో పాల్గొన్న నిందితులు శిక్షలు పడేలా చూస్తాం. ఘటనతో సంబంధమున్న వారు ఏ పార్టీ, సంస్థకు చెందిన వారైనా సరే అరెస్టు చేస్తాం. పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేసుకుంటున్నాం.. అందుకే సీనియర్లను కూడా అక్కడ పరిస్థితులను పర్యవేక్షించేలా ఏర్పాటు చేశాం. అల్లర్లు చెలరేగిన 5 నుంచి 10 నిమిషాల్లోపే అదనపు బలగాలు చేరుకుని అదుపు చేశాయి. భైంసాలో చిన్నారిపై జరిగిన లైంగిక దాడి విషయంలోనూ పోలీసు దర్యాప్తు సజావుగా సాగుతోంది. అయితే బాధితులు చిన్నారిని భైంసా ఆసు పత్రికి తీసుకెళ్తే.. వారిని వెనక్కి పంపారు. ఈ ఒక్క పొరపాటు తప్ప కేసు దర్యాప్తులో ఎలాంటి జాప్యం జరగలేదు..’అని వెల్లడించారు. ఆ ఐపీఎస్‌లపై హత్యాయత్నం కేసు పెట్టాలి: బండి సంజయ్ భైంసా అల్లర్లపై న్యాయ విచారణ చేపట్టాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ కైలాస్‌నగర్(ఆదిలాబాద్): భైంసా అల్లర్ల విషయంలో రాష్ట్ర ప్ర భుత్వం, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి హిందూవాహిని కార్యకర్తలు, అమాయక హిందూ యువకులను అమానుషంగా హింసించిన ఐపీఎస్ అధికారులపై హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న హిందూవాహిని కార్యకర్తలను పరామర్శించేందుకు మంగళవారం అక్కడకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాడులకు పాల్పడిన వారిని వదిలిపెట్టి.. హిందూ పరిరక్షణ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను అరెస్టు చేసి దారుణంగా హింసించారని దుయ్యబట్టారు. హిందూవాహిని నేతలు సంతోష్, లింగోజి, క్రాంతి (18) అనే యువకుడిని ప్రొహిబిషన్‌లో ఉన్న పోలీసులతో కొట్టించారని ఆరోపించారు. దీన్ని వదిలిపెట్టే ప్ర సక్తే లేదని, న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హిందూ వ్యతిరేకులను పెంచి పోషిస్తున్నారని, బాలికపై అత్యాచారం జరిగినా çస్పందించని ఏకైక సీఎం ఆయనేనని విమర్శించా రు. భైంసా పట్టణాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కబంధహస్తల నుంచి కాపాడుకుంటామని స్పష్టం చేశారు. అల్లర్ల ఘటనపై ఏ ఒక్క రాజకీయ పార్టీ స్పందించకపోవడం సిగ్గు చేటన్నారు. బాధితులను పరామర్శించిన వారిలో హిందూవాహిని రాష్ట్ర అధ్యక్షుడు రాజవర్ధన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ తదితరులున్నారు. చదవండి: భైంసాలో సాఫ్ట్వేర్ ఉద్యోగుల అవస్థలు -
‘లగడపాటికి.. ఆ భూమికి ఉన్న సంబంధం ఏంటి?’
సాక్షి, హైదరాబాద్ : పారిశ్రామిక వేత్త జీపీ రెడ్డి ఇంట్లో పోలీసులు అర్ధరాత్రి సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాడి రాజగోపాల్ పోలీసుల తీరుపై మండిపడ్డారు. కేవలం ఐజీ నాగిరెడ్డి ఒత్తిడి మేరకే పోలీసులు ఈ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. లగడపాటి ఆరోపణలపై ఐజీ నాగి రెడ్డి స్పందించారు. జీపీ రెడ్డిపై చర్యలు తీసుకుంటే లగడపాటి ఎందుకు అడ్డు తగులుతున్నాడని ప్రశ్నించారు. లగడపాటికి.. ఈ భూమికి ఉన్న సంబంధం ఏంటో బయటపెట్టాలని ఐజీ నాగి రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఉన్న భూమికి తనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఆ భూమిని తన అత్తగారి తల్లి కొనుగోలు చేశారని తెలిపారు. ఈ భూమి వ్యవహారంలో తాను ఇంత వరకూ తల దూర్చలేదని స్పష్టం చేశారు. రెండేళ్లగా ఎలాంటి చర్యలు తీసుకుంటారా అని ఎదురు చూస్తున్నానన్నారు. జీపీ రెడ్డి గతంలో ఫోర్జరి డ్యాకుమెంట్లు సృష్టించి ఈ భూమి అమ్మే ప్రయత్నం చేశాడని వెల్లడించారు. విమెక్ కో ఆపరేటివ్ సోసైటీలోని మా కుంటుంబ సభ్యుల.. బాధిత సోసైటీ సభ్యుల ఫిర్యాదు మేరకే బంజారాహిల్స్ పోలీసులు జీపీ రెడ్డి ఇంటకి వెళ్లారని తెలిపారు. ఈ వివాదంలో లగడపాటి పదేపదే తన పేరు ప్రస్తావించడం సరికాదంటూ నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఐదు జిల్లాల్లో హైఅలర్ట్..
సాక్షి, హైదరాబాద్/గోదావరిఖని: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మావోయిస్టుల ఉనికి పోలీసు అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎన్నికల వేళ ఐదు జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉంటుందని భావిస్తూ రాష్ట్ర పోలీసు శాఖ ఎన్నికల కమిషన్‌కు నివేదిక ఇచ్చింది. దీంతో ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాచలం, ఖమ్మం జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీసే ందుకు నేరుగా డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐజీ నాగిరెడ్డి, ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ప్రశా ంత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు చేపట్టాల్సిన అంశాలపై గురువారం జిల్లాల్లో పర్యటించారు. ఉనికి చాటుతున్న మావోలు.. గోదావరి పరీవాహక జిల్లాలుగా ఉన్న ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాచలం, ఖమ్మంలో మావోయిస్టు యాక్షన్ కమిటీల కదలికలు భారీ స్థాయిలోనే ఉన్నట్లు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) గుర్తించింది. దీనికి బలం చేకూరుస్తూ బుధవారం ఏటూరునాగారం కమిటీ పేరుతో ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టు పార్టీ బ్యానర్లు, పోస్టర్లు బయటపడటం ఇప్పుడు మరింత ఆందోళనలో పడేసింది. బ్యానర్లు పెట్టి వాటి కింద మావోయిస్టులు ల్యాండ్మైన్లను పాతిపెట్టడం పోలీసు ఉన్నతాధికారులను ఒత్తిడికి గురిచేసింది. ఈ జిల్లాల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో వారం రోజుల నుంచి మావోయిస్టు పార్టీకి, సీఆర్పీఎఫ్ బలగాలకు మధ్య పోరాటం జరుగుతోంది. ల్యాండ్మైన్లు పేలు స్తూ మావోయిస్టు పార్టీ భారీ స్థాయిలో స్పందిస్తోంది. మూడు సవాళ్లు..: మావోయిస్టు కదలికల నేపథ్యలో పోలీసు శాఖ ఎదు ట మూడు సవాళ్లున్నాయి. ఆయా పార్టీ అభ్యర్థులు ప్రచారంలో మారుమూల ప్రాంతాల్లో పర్యటిస్తు న్నారు. వీరికి భద్రత కల్పించడం మొదటి ప్రాధా న్యం కాగా, ఎన్నికల విధులు నిర్వర్తించాల్సిన అధికారులు, సిబ్బంది భయాందోళన లేకుండా ప్రశాంత వాతావరణంలో పని చేయడం రెండో ప్రాధాన్యం. మావోలను ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్ర సరిహద్దులోకి అడుగుపెట్టకుండా, అంతర్గతంగా ఉన్న యాక్షన్ కమిటీలపై దృష్టి పెట్టడం మూడో సవాలు. ఇవి పోలీసు శాఖకు కత్తి మీద సాములాంటివని ఇంటెలిజెన్స్ అధికారులు అభిప్రాయపడ్డారు. ఇన్నాళ్లూ పెద్దగా కనిపిం చని మావోల డివిజన్ కమిటీలు ఒక్కసారిగా వ్యూహా త్మకంగా దాడులకు పాల్పడటం పోలీసు శాఖను శాఖను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పెద్దపల్లిలో పర్యటించిన డీజీపీ.. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి గురువారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. మావోయిస్టుల నియంత్రణకు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలు జరగనిచ్చే అవకాశమేలేదని తేల్చిచెప్పారు. ఐజీ నాగిరెడ్డి రెండ్రోజుల నుంచి గోదావరి పరీవాహక ప్రాంతాలైన ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మావోయిస్టుల కదలికలు, నియంత్రణకు చేపట్టాల్సిన కార్యాచరణపై పెద్దపల్లి, మంచిర్యాలకు చెందిన పోలీసు అధికారులతో డీజీపీ సమీక్షించారు. పోలింగ్ స్టేషన్, గ్రామం ప్రాతిపదికగా భద్రతా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. సమావేశంలో రామగుండం సీపీ వి.సత్యనారాయణ, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్, ఇంటెలిజెన్స్ డీఐజీ ప్రభాకర్‌రావు, గ్రేహౌండ్స్ ఐజీ శ్రీనివాస్‌రెడ్డి, నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి, కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్‌కుమార్, మంచిర్యాల డీసీపీ వేణుగోపాల్‌రావు, పెద్దపల్లి డీసీపీ సుదర్శన్‌గౌడ్, అడిషనల్ డీసీపీలు రవికుమార్, అశోక్‌కుమార్, ఏఆర్ అడిషనల్ కమాండెంట్ సంజీవ్ పాల్గొన్నారు. -
నయీం కేసు దర్యాప్తు సిట్‌కు అప్పగింత
-
నయీం కేసు దర్యాప్తు సిట్‌కు అప్పగింత
హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీం కేసు దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. సిట్ అధికారిగా ఐజీ నాగిరెడ్డిని ప్రభుత్వం నియమించింది. అడిషనల్ ఎస్పీ, ఇద్దరు డీఎస్సీలు సహా 8మందితో ఏర్పాటు అయిన సిట్ బృందానికి నాగిరెడ్డి నేతృత్వం వహిస్తారు. కాగా శాంతి భద్రతల విభాగానికి చెందిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నా.. అంతర్గతంగా వివిధ కోణాల్లో సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేయాలని ప్రభుత్వం భావించింది. మరోవైపు నయీమ్, అతని అనుచరుల నివాసాల్లో జరుగుతున్న సోదాల్లో రూ.కోట్ల విలువ చేసే ఆస్తులు, బంగారు నగలు, వజ్రాలు బయటపడుతున్న విషయం తెలిసిందే. లెక్కకు మించి ఇళ్లు, ఇళ్ల స్థలాలు, వందలాది ఎకరాల భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు వెలుగు చూస్తున్నాయి. తాజాగా పోలీసులు బుధవారం ఎల్బీనగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. వనస్థలిపురం ద్వారకామయినగర్లో నయిం అనుచరుడు ఖయ్యుమ్ నివాసాన్ని పోలీసులు గుర్తించారు. ఖయ్యుమ్ ఇంట్లో కీలక పత్రాలు, ఆయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో నయీం అనుచరులు పరారయ్యారు. మరోవైపు నయీం ప్రధాన అనుచరుడు రియాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా అతడిని నల్లగొండ తీసుకెళ్లి విచారణ జరుపుతున్నారు. కాగా నయీం అక్రమాస్తులను స్వాధీనం చేసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రాథమిక అంచనాల మేరకు నయీం కూడబెట్టిన ఆస్తి రమారమి రూ.2,500 కోట్ల దాకా ఉంటుందని అంచనా. సిట్ విచారణ అనంతరం ఆస్తులకు సంబంధించి స్పష్టత రానుంది. నయీం వివిధ ప్రాంతాల్లో కూడబెట్టిన ఆస్తులతో జాబితా రూపొందించి వాటి వివరాల ఆధారంగా ప్రభుత్వం జీవో జారీ చేస్తుంది. ఆ జీవో ద్వారా కోర్టు అనుమతితో ఆస్తులను స్వాధీనం చేసుకుంటుంది.