ధాన్యం కొనుగోలుకు 617 కేంద్రాలు
కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య
కరీంనగర్, న్యూస్‌లైన్ : రబీలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు జిల్లాలో 617 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య తెలిపారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో కనీస మద్దతు ధర, ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీ సీజన్లో జిల్లాలో 13.41మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చే అవకాశముందని అంచనా వేశామని అన్నారు. అందులో సుమారు 5లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వ సంస్థలతో కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
311 ఐకేపీ కొనుగోలు కేంద్రాలు, 303 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, 3 గిరిజన కోఆపరేటివ్ సొసైటీల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన గన్నీబ్యాగ్‌లు, అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు వివరించారు. జిల్లాలోని ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైస్‌మిల్లర్లను ఎంపిక చేసినట్లు తెలిపారు.
ధాన్యాన్ని రవాణా చేసేందుకు 262 రైస్ మిల్లులను ఎంపిక చేసి అనుసంధానం చేసినట్లు చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధర చెల్లించకుండా ధాన్యం కొనుగోలు చే సే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, డీఆర్డీఏ పీడీ విజయగోపాల్, జిల్లా సరఫరా అధికారి చంద్రప్రకాశ్, డెప్యూటీ రవాణా అధికారి మీరాప్రసాద్, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.