Ikrisat
-
జొన్న విత్తు.. రికార్డు సొత్తు
సాక్షి, హైదరాబాద్: ఇక్రిశాట్ సహకారంతో అభివృద్ధి చేసిన జొన్నపంట దేశవ్యాప్తంగా రికార్డు సృష్టించింది. పాడి రైతులకు చౌకగా పశుగ్రాసం అందించేందుకు నమూనా వంగడంగా జాతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం దీన్ని గుర్తించింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్), ఉత్తరాఖండ్లోని జీబీ పంత్ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ కొత్తరకం జన్యు వంగడాన్ని అభివృద్ధి చేశారు. ఇక్రిశాట్ వంగడం ఐసీఎస్ఏ 467, పంత్ చారి–6 రకాల వంగడాలు రెండింటినీ కలిపి సీఎస్హెచ్ 24 ఎంఎఫ్ పేరుతో దీన్ని అభివృద్ధి చేశారు. జొన్న చొప్పను పలుమార్లు కత్తిరించి వాడుకునే అవకాశముండటం దీని ప్రత్యేకత. అతితక్కువ నీటితోనే ఎక్కువ గ్రాసాన్ని ఇవ్వగలదు. వేసవిలో నీటి ఎద్దడి ఉన్నప్పుడు కూడా పశువులకు తగినంత పచ్చి ఆహారాన్ని అందించవచ్చని దీన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త డాక్టర్ అశోక్ ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటికే దీనిని దేశవ్యాప్తంగా పలువురు రైతులు విజయవంతంగా వాడుతున్నారని చెప్పారు. ఈ పంట కేవలం పశుగ్రాసం కోసం మాత్రమే వాడతారని, జొన్న గింజలు రాకమునుపే కత్తిరించేస్తారని ఆయన స్పష్టం చేశారు. జొన్న పంటపై చేపట్టిన జాతీయ కార్యక్రమంలో దీనికి ప్రత్యేక గుర్తింపు కూడా లభించింది. కొత్త హైబ్రిడ్ జొన్న వంగడాలు తయారు చేయాలంటే.. సీఎస్హెచ్–24ఎంఎఫ్ను నమూనాగా ఎంచుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు నిర్దేశించారు. దీనికి ఉన్న డిమాండ్ ఎంత అంటే.. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఏటా 10 నుంచి 12 కొత్త కంపెనీలకు గ్రాసం విత్తనాల సాగుకు లైసెన్స్ ఇచ్చేంత! పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న భారత్ను పశుగ్రాసం కొరత చాలా తీవ్రంగా వేధిస్తోంది. ఓ అంచనా ప్రకారం దేశంలో ఏటా దాదాపు 132.57 కోట్ల టన్నుల పశుగ్రాసం (పచ్చి, ఎండు) అవసరముండగా.. 35 శాతం తక్కువగా కేవలం 97.87 కోట్ల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. తాజా వంగడంతో పశుగ్రాసం కొరత తీరనుంది. -
త్వరలో అధిక దిగుబడులిచ్చే సజ్జ
- ఇక్రిశాట్ నేతృత్వంలో జన్యు పరిశోధనలు.. - కీలక జన్యువులను గుర్తించిన శాస్త్రవేత్తలు సాక్షి, హైదరాబాద్: అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటూనే అధిక దిగుబడులిచ్చే సజ్జ వంగడాల సృష్టికి మార్గం సుగమమైంది. హైదరాబాద్లోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) ఆధ్వర్యంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సజ్జ మొక్కల జన్యుక్రమాన్ని విశ్లేషించడం ద్వారా ఈ కీలక విజయాన్ని సాధించింది. సజ్జలు అతి తక్కువ నీటితో, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని మనగలవు. సాగుకయ్యే ఖర్చు కూడా తక్కువ కావడంతో ప్రపంచవ్యాప్తంగా చాలామంది చిన్న, సన్నకారు రైతులు సజ్జ పంటను సాగుచేస్తున్నారు. అయితే వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముంది. దీనివల్ల ఇతర పంటల మాదిరిగానే సజ్జల దిగుబడులు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇక్రిశాట్తోపాటు చైనాలోని బీజీఐ షెన్జెన్, ఫ్రెంచ్ నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ తదితర పరిశోధన సంస్థలు సజ్జపై పరిశోధనలు చేపట్టాయి. సజ్జ జన్యుక్రమాన్ని ఆధునిక టెక్నాలజీల ద్వారా విశ్లేషించి మరింత ఎక్కువ వర్షాభావ పరిస్థితులను, 42 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రతలను తట్టుకోగల జన్యువులు, ఇతర మాలిక్యులర్ మార్కర్స్ను గుర్తించారు. ఈ క్రమంలోనే సజ్జల ద్వారా మరిన్ని ఎక్కువ పోషకాలు అందించడం ఎలాగో తెలుసుకున్నారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని మనగలిగే జన్యువులు, లక్షణాలను గుర్తించడం ద్వారా మెరుగైన దిగుబడులిచ్చే సజ్జ వంగడాల సృష్టి సులువవుతుందని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న ఇక్రిశాట్ శాస్త్రవేత్త డాక్టర్ రాజీవ్ వార్‡్షణీ తెలిపారు. భవిష్యత్తులో ఈ పరిశోధనలను వరి, గోధుమలకూ విస్తరిస్తామని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బెర్గ్విన్సన్ తెలిపారు. పరిశోధన వివరాలు నేచర్ బయోటెక్నాలజీ మ్యాగజైన్ సంచికలో ప్రచురితమయ్యాయి.