Illegal loans
-
Illegal Loan Apps: దారుణానికి అడ్డుకట్ట!
అప్పులిస్తున్నామంటూ అమానవీయంగా ప్రవర్తిస్తున్న చట్టవిరుద్ధమైన డిజిటల్ యాప్‌లకు ఎట్టకేలకు అడ్డుకట్ట పడనుందా? ఆర్థిక మంత్రి సారథ్యంలో గత వారం జరిగిన సమావేశం ఆ మేరకు ఆశలు రేపుతోంది. దేశంలో సాధారణ బ్యాంకింగ్ మార్గాలకు వెలుపల చట్టవిరుద్ధంగా నడుస్తున్న డిజిటల్ రుణ వేదికలపై మరిన్ని చర్యలకు కేంద్రం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నడుం బిగించాయి. చట్టబద్ధంగా రుణాలిచ్చే సవ్యమైన యాప్‌లతో జాబితాను సిద్ధం చేసే బాధ్యతను ఆర్బీఐకి అప్పగించారు. ఇక ఆ ‘శ్వేతజాబితా’లోని యాప్‌లే డౌన్లోడ్ చేసుకొనేందుకు అందుబాటులో ఉండేలా కేంద్ర ఎలక్ట్రానిక్స్ – ఐటీ శాఖ జాగ్రత్తలు తీసుకోనుంది. అందుకోసం గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్‌స్టోర్ లాంటి వాటికీ, ఆర్బీఐకీ మధ్య సమన్వయం చేయనుంది. అలాగే, పేమెంట్ యాగ్రిగేటర్లు నిర్ణీత కాలవ్యవధి లోపల రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. రిజిస్టర్ కాని వాటిని ఆ తర్వాత అనుమతించరాదనేది తాజా నిర్ణయం. వేల కుటుంబాలు కూలిపోవడానికి కారణమైన లోన్ యాప్‌లపై వేటుకు ఇవి తొలి అడుగులుగా భావించవచ్చు. దేశంలోని వేగవంతమైన డిజిటలీకరణ, మారుమూలలకు సైతం వ్యాపించిన మొబైల్ సర్వీసు లకు విపరిణామం ఈ లోన్ యాప్‌ల తంటా. అవసరంలో ఉన్న అల్పాదాయ, మధ్యతరగతి వారిని లక్ష్యంగా చేసుకొని అప్పులు, సూక్ష్మ రుణాలు ఇచ్చే అక్రమ యాప్‌ల దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కావు. సామాన్యుల సాంకేతిక నిరక్షరాస్యత వాటికి వాటంగా మారింది. అత్యధిక వడ్డీ రేట్లు, పైకి కనిపించని రుసుములు, బాకీ వసూళ్ళ పేరిట బ్లాక్‌మెయిలింగ్‌లకు ఇవి పేరుమోశాయి. అడ్డూ అదుపూ లేని ఈ డిజిటల్ రుణ యాప్‌లలో అత్యధికం చైనావే. ఇవి తక్షణ రుణాలు ఇస్తామంటూ లక్షలాది వినియోగ దార్లను వలలో వేసుకుంటున్నాయి. అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. కస్టమర్లు తీసుకున్న రుణా లపై వడ్డీలకు వడ్డీలు వేస్తూ, వాటి వసూలుకై రాక్షసరూపం దాలుస్తున్నాయి. ఈ డిజిటల్ యాప్‌ల రుణ వసూలు ఏజెంట్ల ముందు అలనాటి నక్షత్రకులు సైతం దిగదిడుపే. అప్పు తీసుకొనేందుకు సదరు యాప్‌లకు ఫోన్లోని నంబర్లు, ఫోటోలను అందుబాటులోకి తేవడం కొంపముంచుతోంది. వెంటాడి, వేధించే వారి మాటలు, చేష్టలు, అసభ్య మెసేజ్‌లు, మహిళల మార్ఫింగ్ ఫోటోలతో చివరకు పరువు పోయిందనే వేదనతో దేశవ్యాప్తంగా వందల మంది ప్రాణాలు తీసుకున్నారు. డిజిటల్ రుణ యాప్‌లపై 2020 జనవరి నుంచి గత ఏడాది మార్చి వరకు రెండున్నర వేలకు పైగా ఫిర్యాదులు ఆర్బీఐకి అందాయి. దరిమిలా పరిశీలనలో రిజిస్టర్ కాని లోన్ యాప్‌లు దాదాపు 600కు పైగానే గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్నట్టు వెల్లడైంది. ఈ వ్యవహారంపై రేగిన రచ్చతో గూగుల్ సైతం చర్యలు చేపట్టక తప్పలేదు. ఈ ఏడాది ఆరంభం నుంచి తమ ప్లే స్టోర్‌లో 2 వేలకు పైగా వ్యక్తిగత రుణాల యాప్‌లను తొలగించినట్టు గత నెలలో ఆ సంస్థ ప్రకటించింది. అంటే, వ్యక్తిగత రుణ విభాగంలోని మొత్తం యాప్‌లలో దాదాపు సగానికి పైచిలుకు గూగుల్ తొలగించిందన్న మాట. దీన్నిబట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. యాప్ ఆధారిత తక్షణ రుణాల్లో అవకతవకలు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టికీ వచ్చాయి. అందుకే ఇటీవల బెంగళూరులోని రేజర్‌పే, పేటీఎం, క్యాష్‌ఫ్రీ తదితర ఆన్లైన్ పేమెంట్ గేట్‌వేల కార్యాలయాలపై ఈడీ దాడులు జరిపింది. లోన్‌యాప్‌లతో పైకి కనిపించని ప్రమాదాలెన్నో! వీటి కార్యకలాపాలతో అక్రమ నగదు తర లింపు, పన్నుల ఎగవేతకు వీలుంది. వ్యక్తిగత డేటా చౌర్యం, డొల్ల కంపెనీలు, కార్యకలాపాలు ఆపే సిన బ్యాకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీల) దుర్వినియోగం విచ్చలవిడిగా సాగే ముప్పుంది. ఇవన్నీ ఆందోళన కలిగించే అంశాలు. నిజానికి, నియంత్రణ లేని ఈ యాప్‌ల బారి నుంచి సామాన్య ప్రజలను కాపాడాలంటే, వాటిని నిషేధిస్తూ కేంద్రం ఓ చట్టం తేవాలని ఆర్బీఐ ఇటీవల సిఫార్సు చేసింది. చట్టపరమైన అనుమతులున్న, ఆర్బీఐ నియంత్రణలోని సంస్థలే అప్పులివ్వాలని నెల రోజుల క్రితం ఆగస్ట్ 10న నియంత్రణ చట్రాన్ని నిర్దేశించింది. అలాగే, డిజిటల్ రుణాలను నేరుగా రుణగ్రహీతల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేయాలనీ, మూడోవ్యక్తి ద్వారా కానే కాదనీ స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో చట్టవిరుద్ధమైన రుణ తిమింగలాలను యాప్ స్టోర్లలో అనుమతించనంత మాత్రాన అంతా మారిపోతుందనుకోలేం. యాప్‌లను పక్కదోవన లోడ్ చేసేలా లొసుగులున్నాయి. యాప్ స్టోర్లతో పని లేకుండా నేరుగా లింక్ పంపి, దాన్ని నొక్కితే సరిపోయే వీలుంది. అందుకే, కస్ట మర్లు, బ్యాంక్ ఉద్యోగులు, చట్టాన్ని పరిరక్షించే విభాగాల దాకా అందరికీ సైబర్ వ్యవహారాలపై చైతన్యం కలిగించడం ముఖ్యం. చట్టవిరుద్ధంగా చెలరేగిపోతున్న యాప్‌లకు ముకుతాడు వేసేలా సంబంధిత మంత్రిత్వ శాఖలు, సంస్థలు తగు చర్యలు చేపట్టాలి. ఆర్థిక మోసాలపై ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక పరిష్కార కేంద్రం పెట్టడం లాంటివీ యోచించాలి. ఫిన్‌టెక్ సంస్థలు సైతం తమ వ్యాపార నమూనాలను సమీక్షించుకొని, పారదర్శక విధానం వైపు సాగాలి. కట్టాల్సివచ్చే రుసుములు వగైరా ముందే స్పష్టం చేయాలి. దాని వల్ల తెలుసుకొని మరీ కస్ట మర్లు నిర్ణయం తీసుకోగలుగుతారు. అదే సమయంలో పారదర్శకత వదిలేసి, ‘శ్వేత జాబితా’ పేరిట సంక్లిష్ట ప్రమాణాలను పెట్టి, న్యాయబద్ధమైన లోన్‌యాప్‌లను ఆర్బీఐ తొలగించకూడదు. సరైన పద్ధతులు అనుసరిస్తూనే, అనుమతించినా, నిరాకరించినా కారణాలూ పేర్కొనడం ముఖ్యం. అప్పుడే నిఖార్సయిన యాప్‌లకు చిక్కులు లేకుండా, దారుణ యాప్‌ల కథ కంచికి చేరుతుంది. -
అక్రమ రుణ యాప్‌లకు చెక్!
న్యూఢిల్లీ: డిజిటల్ మోసాల ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో అక్రమ రుణాల యాప్‌లను కట్టడి చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా చట్టబద్ధంగా అనుమతులు పొందిన యాప్‌ల లిస్టును రిజర్వ్ బ్యాంక్ తయారు చేయనుండగా, అవి మాత్రమే యాప్ స్టోర్స్‌లో అందుబాటులో ఉండేలా ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ (మెయిటీ) జాగ్రత్తలు తీసుకోనుంది. వివిధ శాఖలు, ఆర్బీఐ అధికారులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. వీటి ప్రకారం మనీ లాండరింగ్ కోసం ఉపయోగించేందుకు అద్దెపై తీసుకుని ఉండొచ్చని భావిస్తున్న ఖాతాలను ఆర్బీఐ పర్యవేక్షించనుంది. అలాగే నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) దుర్వినియోగం కాకుండా నిద్రాణంగా ఉంటున్న సంస్థల లైసెన్సులను సమీక్షించడం లేదా రద్దు చేయడం వంటి చర్యలు తీసుకుంటుంది. అలాగే నిర్దిష్ట కాలవ్యవధిలో పేమెంట్ అగ్రిగేటర్ల రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా చూడటం, నమోదు చేసుకోని అగ్రిగేటర్లను కార్యకలాపాలు నిర్వహించనివ్వకపోవడం వంటి అంశాలపై దృష్టి పెడుతుంది. ఇక ఇలాంటి యాప్‌లు విస్తరించకుండా డొల్ల కంపెనీలను గుర్తించి, వాటిని డీ–రిజిస్టర్ చేసే బాధ్యత కార్పొరేట్ వ్యవహారాల శాఖ తీసుకుంటుంది. అలాగే కస్టమర్లు, బ్యాంకు ఉద్యోగులు, చట్టాలు అమలు చేసే ఏజెన్సీలు, ఇతర వర్గాల్లోనూ సైబర్ భద్రతపై అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ, ఆర్థిక వ్యవహారాలు, రెవెన్యూ విభాగాల కార్యదర్శులు, ఆర్బీఐ డిçప్యూటీ గవర్నర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ రుణాల యాప్‌లు, మనీ లాండరింగ్, పన్ను ఎగవేతలు, డేటా ఉల్లంఘన తదితర అంశాలపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. -
సాక్షి ఎఫెక్ట్: నిగ్గు తేలిన నిజాలు..
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అక్రమార్కులపై వేటు పడింది. సెంటు భూమి లేకపోయినా కమీషన్లకు కక్కుర్తి పడి, నకిలీ డాక్యుమెంట్లతో భూములు సృష్టించి, ఎడాపెడా రుణాల పేరుతో దోచేసిన వారిని ఎట్టకేలకు ఇంటికి సాగనంపారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) ఆత్రేయపురం బ్రాంచి వద్దిపర్రు ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలో అక్రమ రుణాల బాగోతంపై విచారణ పూర్తయింది. ఈ కుంభకోణంలో బాధ్యులుగా నిగ్గు తేల్చిన డీసీసీబీ, సహకార ఉద్యోగు లు నలుగురిపై డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ శుక్రవారం వేటు వేశారు. ఉద్యోగంలో ఉన్న వారిని సస్పెండ్ చేయాలని, రిటైరైన సూపర్వైజర్, డీజీఎంల బెనిఫిట్లు నిలుపు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విచారణలో రూ.కోటిన్నర రుణాలు అక్రమ మార్గంలో విడుదల చేసినట్టు నిర్ధారణయింది. ఇందులో బాధ్యుల నుంచి 90 శాతం రికవరీ చేయడం డీసీసీబీకి కొంతలో కొంత ఊరట కలిగించే అంశం. (చదవండి: అంతర్వేది ఘటన వెనుక చంద్రబాబు హస్తం) ‘అవినీతిలో సహకారం.. రూ.కోటిన్నర మాయం’ శీర్షికన ‘సాక్షి’లో ఇటీవల ప్రచురితమైన కథనంపై డీసీసీబీ చైర్మన్ స్పందించి, విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. వద్దిపర్రు వ్యవసాయ సహకార పరపతి సంఘంలో గత తెలుగుదేశం ఏలుబడిలో నేతలు, సహకార అధికారులు కుమ్మక్కై బినామీ రైతుల పేర్లతో రూ.కోటిన్నర నొక్కేసిన వైనాన్ని ‘సాక్షి’ బట్టబయలు చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన చైర్మన్ ఈ కుంభకోణంపై లోతైన విచారణ జరిపించాలని డీసీసీబీ సీఈఓ ప్రవీణ్‌కుమార్‌ను ఆదేశించారు.. ఆగమేఘాల మీద డీసీసీబీ డిప్యూటీ జనరల్ మేనేజర్ వెంకటేశ్వరరావును విచారణాధికారిగా నియమించారు. వెంకటేశ్వరరావు విచారణ ముగించి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆత్రేయపురం బ్రాంచి మేనేజర్ క్రాంతికృష్ణ, వద్దిపర్రు సొసైటీ రిటైర్ సూపర్వైజర్ ఎం.మహాలక్ష్మిరాజు, రిటైర్డ్ డీజీఎం పి.పట్టాభి రామయ్య, మేనేజర్/లీగల్ ఆఫీసర్ పి.సత్తయ్యలపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు. సీఈఓ మునేశ్వరరావును ఇదివరకే విధుల నుంచి తప్పించిన విషయం విదితమే. (చదవండి: ఆ ఇద్దరితో శ్రావణి ప్రేమాయణం..) నిగ్గు తేల్చిన అక్రమాలివే... ►వద్దిపర్రు సొసైటీ సభ్యుడు కొండ్రు నాంచారావు పేరున భూమి లేకపోయినా నకిలీ డాక్యుమెంట్లతో రూ.17.21 లక్షలు స్వాహా. ►మరో సభ్యుడు వాకలపూడి హరిబాబు ఎకరం భూమికి రూ.2.50 లక్షలకు అర్హత ఉండగా..రూ.5 లక్షలు. ఎల్టీ రుణంగా ఎకరం భూమి ఉంటే రూ.4 లక్షలు ఇవ్వాల్సి ఉండగా..రూ.6.28 లక్షలు ఇచ్చారు. టైటిల్ డీడ్ లేకుండానే ఇతని సోదరుడు విశ్వేశ్వరరావుకు రుణం మంజూరు. ►మూడెకరాలున్న మల్లాది వెంకటరామారావుకు రూ.7.65 లక్షలు రుణం ఇచ్చే అవకాశం ఉండగా.. రూ.14.65 లక్షలు ఇచ్చారు. ►కరుటూరి శ్రీనివాసరావుకు ఒక రుణంగా రూ.20 లక్షల వరకు ఇవ్వవచ్చు..కానీ అడ్డగోలుగా రూ.33 లక్షల రుణం మంజూరు చేశారు. ►భూమి తక్కువగా ఉన్నా..అర్హతకు మించి ఆచంట మంగాదేవి, ఆచంట పద్మావతి, కరుటూరి వెంకటలక్షి్మలకు బాండ్లు లేకపోయినా క్రెడిట్ లిమిట్ లేకుండా రుణాలివ్వడం. ►క్రెడిట్ లిమిట్ మంజూరు లేకుండా 40 మందికి ఏకంగా రూ.62.79 లక్షలు రుణాలు మంజూరు చేశారు. ఈ మంజూరులన్నీ బ్రాంచ్ మేనేజర్ నిర్లక్ష్యం కారణంగానే జరిగాయని విచారణలో నిగ్గుతేల్చారు. ►రిటైరైన సూపర్వైజర్ ఎం.మహాలక్ష్మిరాజు బ్రాంచ్ మేనేజర్‌కు తెలియకుండా డీ నమూనా పట్టాలపై 21 మందికి రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడైంది. ►నిబంధనలకు విరుద్ధంగా సీఈఓ మునేశ్వరావుతోపాటు మహాలక్ష్మిరాజు వాయిదా మీరిన రుణాలపై న్యాయ పరమైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ►ఎల్ఈసీ కార్డులు రెన్యూవల్ చేయకుండా రుణాలు రెన్యూవల్ చేయడంలో సీఈఓతోపాటు సూపర్ వైజర్ బాధ్యులు. ►సంఘంలో క్రెడిట్ లిమిట్ మంజూరు ఉందా? లేదా? అని పరిశీలించకుండా 40 మంది సభ్యులకు రూ.62.79 లక్షలు లోన్లు మంజూరు చేశారు. ►31.03.2019 నాటికి రూ.31.68.150 మొండిబకాయిలుండగా.. ఇందులో మూడేళ్లు దాటిన రూ.24 లక్షలు ఉండగా..వాటి వసూళ్లకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ►భూములను పరిశీలించకుండా..డాక్యుమెంట్లు లేనప్పటికీ కొండ్రు నాంచారావుకు రుణం మంజూరు చేయడం. ఫేక్ డాక్యుమెంట్లను గుర్తించకుండా రుణాలు ఇచ్చిన సూపర్వైజర్, మేనేజర్, ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసిన ప్పటి డీజీఎం పి.పట్టాభి రామయ్య బాధ్యునిగా తేల్చారు. ►వాకలపూడి హరిబాబు, సోదరుడు విశ్వేశ్వరావు, రాంబాబులకు రాజవరం సిండికేట్ బ్యాంకులో రుణాలున్నాయి. వీరికి డీసీసీబీ వెబ్‌ల్యాండ్ చూడకుండా అదనంగా రుణాలు మంజూరు చేయడం, వెబ్ ల్యాండ్ చూసి ఉంటే రుణాలు మంజూరు చేసే పరిస్థితి ఉండేది కాదు. బ్రాంచ్ మేనేజర్, సూపర్వైజర్ నిర్లక్ష్యం వల్ల బ్యాంక్ నష్టపోయింది. లీగర్ ఆఫీసర్ సత్తయ్య ఒక రుణం అవుట్ స్టాండింగ్ ఉండగా...మరో రుణానికి సిఫార్సు చేస్తూ వద్దిపర్రు సొసైటీ చేసిన తప్పును గుర్తించలేకపోవడం బాధ్యతారాహిత్యంగా గుర్తించి చర్యలకు ఉపక్రమించారు. ‘బాధ్యతగా లేకుంటే ఇంటికే’ సొసైటీ, బ్రాంచి, చివరకు డీసీసీబీలో సైతం అధికారులు, ఉద్యోగులు బాధ్యతగా లేకుంటే ఇంటికి పంపించేస్తా. రైతులకు రుణాలు మంజూరు చేయడంలో ఏ దశలో అయినా నిర్లక్ష్యం, అవినీతి, కమీషన్లకు కక్కుర్తి పడితే కఠిన చర్యలు తప్పవు. డీసీసీబీ సీఈఓ స్థాయి నుంచి డీజీఎంలు, ఏజీఎంలు, లీగల్ ఆఫీసర్లు, సూపర్వైజర్ వరకూ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను తు.చ. తప్పకుండా నిర్వర్తించాలి. లేకుంటే ఏ ఒక్కరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎంతటి సిఫారసులతో వచ్చినా రైతులను మోసం చేసిన వారిని, బ్యాంకుకు నష్టం కలిగించిన వారిని ఉపేక్షించేది లేదు. – అనంతబాబు, చైర్మన్, డీసీసీబీ -
ఐఓబీలో భారీ కుంభకోణం
నకిలీ పాస్ పుస్తకాలతో రూ.కోట్లు స్వాహా.. సత్తుపల్లి: నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి రూ.కోట్లల్లో అక్రమ రుణాలు మంజూరు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో రెవెన్యూ, పోలీస్ బృందం గురువారం తనిఖీలు చేపట్టారు. దమ్మపేట, వేంసూరు, పెనుబల్లి, సత్తుపల్లి మండలాలకు చెందిన రైతుల పేరిట నకిలీ పాస్ పుస్తకాలతో రూ. కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు ప్రాథమికంగా తేలింది. ఆయా మండలాలకు చెందిన 200లకుపైగా పాస్ పుస్తకాలను తనిఖీ చేస్తే.. సగానికిపైగా నకిలీగా తేలినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ బ్యాంక్ నుంచి 584 మందికి రుణాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కల్లూరు ఏసీపీ బల్లా రాజేశ్ మాట్లాడుతూ సత్తుపల్లి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో నకిలీ పాస్ పుస్తకాలతో లక్షల్లో రుణాలు ఇస్తున్నారనే ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామన్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశాలతో స్పెషల్ టీమ్‌తో దర్యాప్తు చేపడుతున్నామన్నారు. అక్రమంగా రుణాలు పొందినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.