అవినీతి పురుగులు
- ఉద్యాన శాఖలో అక్రమార్కులు
- రైతుల సబ్సిడీలు స్వాహా
- లబ్ధిదారుల నుంచి బలవంతపు వసూళ్లు
- ఫిర్యాదు చేస్తే బెదిరింపులు
- అక్రమార్కులకు అండగా తెలుగు తమ్ముళ్లు
సాక్షి ప్రతినిధి, కర్నూలు :కంచే చేను మేస్తే కాపేమి చేయగలడు అన్న చందంగా మారింది జిల్లాలో కొందరి ఉద్యాన శాఖ అధికారుల పనితీరు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు అండగా నిలవాల్సింది పోయి సబ్సిడీలను దిగమింగేస్తున్నారు. బోగస్ పేర్లలో అక్రమాల పంట పండిస్తున్నారు. ఇదేమని అడిగితే అధికార పార్టీ నేతల అండతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ రైతులు.. పండ్లు, పూల తోటలను అభివృద్ధి చేసుకునేందుకు, అలాగే వ్యవసాయ పరికరాల కొనుగోళ్ల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
సబ్సిడీల కోసం రైతులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకోగా వీరిలో కొంత మందికి మంజూరయ్యాయి. అయితే లబ్ధిదారులైన రైతులకు తెలియకుండానే వారికి మంజూరైన నిధులను కొందరు అధికారులు స్వాహా చేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా కోటి రూపాయలకుపైగా నిధులు పక్కదారిపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇవీ ని‘దర్శనాలు’
►డోన్ మండలం అలేబా తండాకు చెందిన 14 మంది ఎస్టీ రైతులు.. పసుపుతోటల అభివృద్ధికి దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ప్రభుత్వం
రూ.72,600 మంజూరు చేసింది. మంజూరైన ఈ మొత్తం రైతులకు చేరలేదు. బ్యాంకుకు వచ్చిన నిధులు మాత్రం వారి పేరున వేరొక అకౌంట్ నుంచి డ్రా అయ్యాయి.
►కొత్తకోట గ్రామానికి చెందిన 17 మంది ఎస్సీ రైతులకు 2012-13లో ఒక్కొక్కరికి రూ.14వేలకుపైగా నిధులు మంజూరయ్యాయి. అందులో రూ.5 వేలు మెటీరియల్ పోను మిగిలిన మొత్తం నిధులు స్వాహా చేసినట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
►ప్యాపిలి మండలంలో 79 మంది రైతులకు రూ.1,95,130 మొత్తం డీడీ నంబర్ 180963తో బ్యాంక్‌కు చేరింది. ఆ జాబితాలోని 17, 19, 35, 38, 40, 67 సీరియల్ నంబర్లలో ఉన్న రైతుల పేర్లతోపాటు ఎం కేశవరెడ్డి, ఆర్. క్రిష్ణన్న మరో 8 మంది రైతులు పేర్లు ఉండాల్సిన చోట బ్లాంక్ పెట్టి అక్కడ వేరొకరి అకౌంట్ నంబర్లు వేసి నిధులు మళ్లించుకున్నారు.
►టమాట రైతులకు బుట్టలు, కత్తెర్లు, రంపాలు వంటి పరికరాలు పంపిణీ చేస్తారు. వాటిని పంపిణీ చేసినందుకు సర్వీస్ చార్జ్ కింద 10 శాతం ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే ఈ పరికరాలను ఆ కంపెనీ వారు పంపిణీ చేయటం లేదని తెలిసింది. అధికారులే పంపిణీ చేస్తూ ఆ 10 శాతం నిధులను నొక్కేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
►ప్యాపిలి మండలం జక్కసానికుంట్ల గ్రామంలో అరటితోటల పెంపకానికి సంబంధించి 2012-13, 2013-14 ఏడాదికి సంబంధించి కూడా నిధులు పెద్ద ఎత్తున మంజూరైనట్లు సమాచారం. స్థానిక వీఆర్వో సంతకాలను ఫోర్జరీ చేసి నిధులు నొక్కేశారనే విమర్శలు ఉన్నాయి.
బెదిరింపులు..: డోన్ మండలం కొత్తకోట గ్రామానికి చెందిన రాంబాబు పీజీ వరకు చదువుకున్నాడు. తండ్రి మరణించటంతో కుటుంబ బాధ్యతలను నెత్తికెత్తుకున్నాడు. ఉన్న పొలంలో వ్యసాయం చేసేందుకు ట్రాక్టర్ కోసం సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. సబ్సిడీ కింద నిధులు మంజూరయ్యాయని, అయితే ముందుగా రూ.3.83 లక్షల డీడీ కట్టాలని అధికారులు సూచించారు. దీంతో ఆ యువకుడు వడ్డీకి తెచ్చి డీడీ కట్టి అధికారిని కలిశారు. అయితే ఆ అధికారి సబ్సిడీ మంజూరు చేయాలంటే రూ.15 వేలు అడిగినట్లు రాంబాబు వెల్లడించారు. తన వద్ద లేదని చెప్పటంతో సబ్సిడీ ఇవ్వకుండా అడ్డుకున్నట్లు ఆందోళన వ్యక్తం చేశాడు.
ఈ విషయంపై రాంబాబు గత ఏడాది డిసెంబర్లో, అలాగే గతనెల 19న ఉద్యానశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై కమిషనరేట్ నుంచి అవినీతి అధికారులపై విచారణ జరపమని ఆదేశాలు ఇచ్చారు. అయితే విచారణ ముందుకు సాగలేదు. దీంతో రాంబాబు మరోసారి కలెక్టర్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాడు. స్పందించిన కలెక్టర్ ఏజేసీని విచారణ చేయమని ఆదేశించినట్లు సమాచారం.
ఈ విషయం అవినీతి అధికారులకు తెలియటంతో స్థానిక టీడీపీ నేతల ద్వారా పోలీసులకు చెప్పి, పోలీసులతో తనను తీవ్రస్థాయిలో హెచ్చరించారని రాంబాబు ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయటంతో పాటు రక్షణ కల్పించాలని మరోసారి కలెక్టర్‌ను కలిసి విన్నవించటం గమనార్హం. ఇదిలా ఉండగా డోన్ నియోజక వర్గంలో జరిగిన నిధుల గోల్‌మాల్‌పై తనకు ఫిర్యాదులు అందాయని ఉద్యాన శాఖ ఏడీ సాజానాయక్ తెలిపారు. విచారించి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.