మరో అణుపరీక్షకు సిద్ధమైన జగడాల మారి
ప్యాంగ్యాంగ్: జగడాల మారి ఉత్తర కొరియా మరో ప్రయోగానికి దిగుతోంది. నెల వ్యవధిలోనే మరో అణుపరీక్షకు సిద్దమవుతోంది. ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకిస్తున్నా ఈ దేశం మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. కీలక వర్గాల సమాచారం మేరకు మే మొదటివారంలో మరోసారి అణుపరీక్ష నిర్వహించాలని భావిస్తోంది. ఇదే జరిగితే ఈ పరీక్ష నిర్వహించడం ఇది ఐదోసారి అవుతుంది.
మరో అణుపరీక్ష నిర్వహిణ కోసం ఇప్పటికే ఉత్తర కొరియా స్థలాన్ని పరిశీలిస్తోందని తమ వద్ద సమాచారం ఉన్నట్లు దక్షిణ కొరియా తెలిపింది. తమ దేశంలో ఆయుధ సంపత్తిని అమాంతం పెంచుకోవాలని ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సూచనల మేరకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుందని తెలుస్తోంది. మొన్న శుక్రవారం నిర్వహించిన బాలిస్టిక్ క్షిఫణి పరీక్ష విఫలం కావడం, ఆ విషయం అందరికీ తెలియడంతో దానిని అవమానంగా భావించిన ఉత్తర కొరియా తాజాగా వారాల వ్యవధిలోనే ఏకంగా అణుపరీక్షకు సిద్ధమైందని అత్యంత కీలక వర్గాల సమాచారం.