గొంతు తెగి.. రక్తం మడుగులో....
గన్నవరం :
గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఓ వ్యక్తి గొంతుపై తీవ్రగాయంతో కొట్టుమిట్టాడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసుల సమాచారం ప్రకారం.... మంగళవారం విమానాశ్రయం ఎదురుగా ఉన్న దుర్గాపురం వద్ద జాతీయ రహదారి పక్కన సుమారు 42 ఏళ్ళ వయస్సు కలిగిన వ్యక్తి రక్తం మడుగులో పడి ఉండడం గమనించిన స్థానికులు 108కు, పోలీసులకు సమచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది అతని గొంతు చాలావరకు తెగిపోయి ఉండడంతో అత్యవసర చికిత్స కోసం విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు అస్పత్రికి చేరుకుని క్షతగాత్రుడితో మాట్లాడి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. ఆతని పేరు కుమార్ అని, విజయవాడ వన్‌టౌన్‌లోని కనకదుర్గమ్మ ఆలయం సెంటర్లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తున్నట్లు తెలిపారని చెప్పారు. ఉదయం మద్యం సేవించిన మైకంలో ఉన్న కుమార్‌ని కొంతమంది బ్లేడ్‌బ్యాచ్ బలవంతంగా పీక కోసి ఆతని జేబులో ఉన్న రూ. 700 నగదును తీసుకుని ఇక్కడ పడవేశారని చెప్పాడన్నారు. మద్యం మత్తు వల్ల పూర్తి వివరాలు చెప్పలేకపోతున్నాడని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వన్‌టౌన్‌లోని బ్లేడ్ బ్యాచ్‌లే ఈ ఘాతుకానికి పాల్పడిఉంటాయని అనుమానిస్తున్నారు.