నియోజకవర్గాల పెంపు లేనట్టే!
♦ పెంచితే టీఆర్ఎస్కే లాభమని అమిత్ షాకు చెప్పిన రాష్ట్ర బీజేపీ నేతలు
♦ ప్రస్తుతం సాధ్యం కాదని ఏపీ సీఎంకు చెప్పిన కమల దళపతి
సాక్షి, అమరావతి: తెలంగాణ, ఏపీల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంపు లేనట్లేనా..? తాజా పరిణామాలు పరిశీలి స్తే.. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు అవకాశాలు కనిపించడం లేదనిపిస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 స్థానాలను 153కు, ఏపీలోని 175 స్థానాలను 225కి పెంచాలని రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన సంగతి తెలిసిందే. కానీ అసెంబ్లీ నియోజ కవర్గాల పెంపుపై కేంద్రం ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదని తెలుస్తోంది. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల్లో నియోజకవర్గాల పెంపును బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నందున కేంద్రం అందుకు సుముఖంగా లేనట్లు విశ్వసనీయంగా తెలిసింది.
నియోజకవర్గాలను పెంచితే అది టీఆర్ఎస్కు అనుకూలంగా మారుతుందని, బీజేపీకి తీవ్ర నష్టం చేస్తుందని కమలం పార్టీ నేతలు అధిష్టానానికి విన్నవించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో సహా ఇతర పార్టీలనుంచి అనేకమందిని టీఆర్ఎస్ తన పార్టీలోకి తీసుకుంది. వారందరికీ వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చేందుకు హామీ ఇచ్చిందని, నియోజకవర్గాల పెంపుతో అదనంగా వచ్చే స్థానాల్లో వారందరికీ అవకాశం కల్పించాలన్నది టీఆర్ఎస్ ఉద్దేశమని అధిష్టానానికి వివరించారు.
ఈ నేపథ్యంలో నియోజకవర్గాల సంఖ్య పెంపు టీఆర్ఎస్కు అనుకూలిస్తుందని, అదే సమయంలో తమకు నష్టం కలుగుతుందని తెలంగాణ బీజేపీ నేతలు స్పష్టంచేశారు. ఇదే అంశాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా.. ఏపీ సీఎం చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో నియోజకవర్గాల పెంపు సాధ్యం కాకపోవచ్చని అమిత్ షా అన్నట్లు తెలుస్తోంది.