‘నా భర్త కూడా బాధితుడే.. నేను చూశాను’
ముంబై: తన భర్త కూడా ‘నెపోటిజం’ బాధితుడే అని బాలీవుడ్ దివంగత నటుడు ఇందర్ కుమార్ భార్య పల్లవి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాదిరి ఇందర్ కుమార్ కూడా సొంతంగా ఇండస్ట్రీలో స్థానం సంపాదించుకున్నాడని పేర్కొన్నారు. 90వ దశకంలో స్టార్ నటుడిగా వెలుగొందిన ఆయన మరణించే ముందు అవకాశాలు దక్కించుకోలేకపోయారని.. అందుకు బంధుప్రీతి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా తుమ్కో నా భూల్ పాయేంగే, కహీ ప్యార్ నా హో జాయే, ఖిలోడియోంకా ఖిలాడీ వంటి సినిమాలు, క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ వంటి టీవీ సీరియళ్లతో గుర్తింపు పొందిన ఇందర్ కుమార్(43).. 2017లో గుండెపోటుతో మరణించారు. ఇక ప్రస్తుతం సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో మరోసారి నెపోటిజం, వారసుల తెరంగేట్రం- అవకాశాలు అంశం తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన భర్త ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి వివరిస్తూ పల్లవి కుమార్ సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్టుపెట్టారు. (‘రేపు మీ పిల్లల విషయంలో ఏం చేస్తారు’)
‘‘ గత కొన్ని రోజులుగా చాలా మంది బంధుప్రీతి గురించి మాట్లాడుతున్నారు. నాకింకా గుర్తు. మరణించడానికి కొన్ని రోజుల ముందు నా భర్త ఇద్దరు ఇండస్ట్రీ పెద్ద మనుషులను కలిశారు. తనకు సాయం చేయమని కోరారు. చిన్న ప్రాజెక్టులో తను పనిచేస్తున్నప్పటికీ.. గత వైభవం మళ్లీ పొందేందుకు పెద్ద సినిమాల్లో అవకాశం ఇప్పించాలని అడిగారు. ఇదంతా నా కళ్ల ముందే జరిగింది. ఓరోజు కరణ్ జోహార్ దగ్గరికి వెళ్లాం. ఆయన రెండు గంటల పాటు మమ్మల్ని వ్యాన్ బయట ఎదురుచూసేలా చేశారు. అనంతరం ఆయన మేనేజర్ గరమ బయటకు వచ్చింది. సార్ బిజీగా ఉన్నారని చెప్పింది. చాలా సేపటి తర్వాత కరణ్ బయటకు వచ్చారు. గరిమతో కాంటాక్ట్‌లో ఉండమని ఇందర్ కుమార్‌కు చెప్పారు. దాదాపు 15 రోజుల పాటు ఫోన్ చేస్తూనే ఉన్నారు. కానీ అక్కడి నుంచి సమాధానం రాలేదు సరికదా.. ఆయన నంబర్ బ్లాక్ చేసిపడేశారు.(‘జస్టిస్ ఫర్ సుశాంత్’ ఫోరం ఏర్పాటు)
మిస్టర్ షారుఖ్ ఖాన్‌తో కూడా ఇందర్ కుమార్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆయన ఇందర్‌ను కలిసి.. వారం రోజుల్లో కాల్ చేస్తానని చెప్పారు. ప్రస్తుతానికి పనిలేదని.. తన మేనేజర్ పూజతో టచ్‌లో ఉండమన్నారు. గరిమ ఏం చేసిందో పూజ కూడా అదే చేసింది. అసలు అంతపెద్ద నిర్మాణ సంస్థల్లో.. కోట్లాది రూపాయలు గడిస్తున్న ప్రొడక్షన్ హౌజ్‌లలో చిన్న పని కూడా దొరకదు అంటే ఎవరైనా నమ్ముతారా? నిజానికి కరణ్ ఎన్నోసార్లు తాను స్టార్లతో మాత్రమే పనిచేస్తానని చెప్పారు. నా భర్త కూడా ఓ స్టార్. ప్రతిభ ఉన్న వాడు. మరెందుకు అతడికి అవకాశం ఇచ్చేందుకు అంతగా భయపడ్డారు? నెపోటిజానికి ఇప్పటికైనా స్వస్తి పలకండి. మనుషులు చచ్చిపోతున్నారు. అయినా ఈ బడా వ్యక్తులకు ఏం పట్టడం లేదు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలి’’అని ఉద్వేగానికి లోనయ్యారు.