ముంచిన వాన
ఆదిలాబాద్ , న్యూస్‌లైన్: ఇంద్రవెల్లి మండలంలో సుమారు 2611 ఎకరాల్లో టమాటా సాగు చేశారు. జూన్, జూలై, ఆగస్టులో కురిసిన వర్షాలకు చాలా ఎకరాల్లో వేసిన టమాటా నారు మురిగిపోరుయిది. ప్రస్తుతం పంట చేతికొస్తుండగా ఇటీవల కురిసిన వానలకు కాయలు నల్లబడి 50 శాతం కాయలు నీళ్లపాలయ్యాయి. టమాటా 25 కిలోల క్యారెట్‌కు రూ.700 నుంచి రూ.800 వరకు ధర ఉన్నా దిగుబడి పడిపోవడంతో అన్నదాత విలవిల్లాడుతున్నాడు. చేసేదేమి లేక నల్లబడిన కాయలను పడేస్తున్నారు. అమ్మకానికి తీసుకెళ్లినా వ్యాపారులు నల్లబడిన కాయలు ఏరేసి కొంటున్నారని రైతులు చెబుతున్నారు. ప్రతీ రైతు తోటలో సగం కాయలు ఇలా నల్లబడిపోవడంతో రైతులకు ఈ సారి అప్పులే మిగిలేలా ఉన్నాయి. ఎకరానికి సుమారు రూ.20 వేల చొప్పున పెట్టుబడి పెట్టగా అందులో సగం కూడా తిరిగొచ్చే అవకాశం లేదని ఆందోళన చెందుతున్నారు. లాభాలు పంచుతుందనుకున్న టమాటా వర్షాల కారణంగా నిలువునా ముంచి అన్నదాతకు కన్నీళ్లే మిగిల్చింది.
అధికారుల నిర్లక్ష్యం..
మండలంలో భారీ ఎత్తున టమాటా తోటలకు నష్టం వాటిల్లినా సర్వే నిర్వహించడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదకు కొట్టుకుపోరుున పంటలను మాత్రమే అధికారులు పరిగణలోకి తీసుకున్నారని చెబుతున్నారు. ఇటీవలి వర్షాలకు నల్లబడి కాయలు పెద్దమొత్తంలో నీళ్లపాలైనా అధికారులు పట్టించుకోవడంలేదని పేర్కొంటున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి సర్వే ద్వారా నల్లబడి పంట నష్టపోరుున తమను ఆదుకోవాలని కోరుతున్నారు. లేకుంటే సాగుకు దూరం కావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
సర్వే నిర్వహిస్తున్నం
- బావురే ఉద్దవ్, తహశీల్దార్, ఇంద్రవెల్లి
మండలంలో నష్టపోయిన టమాటా పంటపై సర్వే నిర్వహిస్తున్నం. సర్వే పూర్తయ్యూక నష్టం ఎంతో తేలుతుంది. ఆ తర్వాత ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తాం. నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం. రైతులు ఆందోళన చెందొద్దు.