భారత్–ఆస్ట్రేలియా బంధం
దేశాల మధ్య బంధాలు బలపడటం, అవి కొత్త పుంతలు తొక్కటం, కూటమిగా కలిసి కదలాలను కోవటంవంటి పరిణామాలు మారుతున్న అంతర్జాతీయ స్థితిగతులకు అద్దం పడతాయి. ప్రస్తుతం మన దేశంలో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ప్రధాని నరేంద్ర మోదీతో జరిపిన చర్చల సందర్భంగా రెండు దేశాల మధ్యా పలు ఒప్పందాలు కుదరటం ఆ కోణంలో కీలక పరిణామమనే చెప్పాలి.
రష్యా–ఉక్రెయిన్ల మధ్య ఏడాదికిపైగా సాగుతున్నలడాయి కారణంగా చైనాపై మునుపటంత దృష్టి కేంద్రీకరించటం లేదని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్న తరుణంలో గతవారం ఢిల్లీలో చతుర్భుజ కూటమి(క్వాడ్) విదేశాంగ మంత్రుల సదస్సు జరిగింది. అందులో మన విదేశాంగమంత్రి జైశంకర్‌తోపాటు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, జపాన్ విదేశాంగ మంత్రి హయాషీ యొషిమసా, ఆస్ట్రేలియా విదేశాంగమంత్రి పెన్నీ వాంగ్లు పాల్గొన్నారు. దానికి కొనసాగింపుగానే ఆల్బనీస్ బుధవారం మన దేశం వచ్చారు.
వచ్చేవారం జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా రాబోతున్నారు. ఈ సందడంతా సహజంగానే చైనాకు కంటగింపుగా ఉంటుంది. దక్షిణాసియాలో, హిందూ మహా సముద్ర ప్రాంతంలో తన ప్రాబల్యాన్ని పెంచు కోవటానికి ప్రయత్నించటం, బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్(బీఆర్ఐ) పేరిట మన వ్యూహాత్మక ప్రాంతాలను తాకేలా ప్రాజెక్టు రూపకల్పన చేయటం వగైరా పనులు చైనావైపు నుంచి ముమ్మర మయ్యాక మన దేశం క్వాడ్‌పై ఆసక్తి ప్రదర్శించటం మొదలుపెట్టింది.
వాస్తవాధీన రేఖ వద్ద చైనా గిల్లికజ్జాలు పెట్టుకునే రీతిలో వ్యవహరించటం కూడా మన దేశానికి ఆగ్రహం తెప్పించింది. మొదట పదహారేళ్లక్రితం క్వాడ్ ఏర్పాటు ప్రతిపాదన వచ్చినప్పుడు భారత్ పెద్దగా స్పందించలేదు. కేవలం చైనా వ్యతిరేకత ఒక్కటే క్వాడ్‌కు ప్రాతిపదిక కారాదని చెప్పింది. వాస్తవానికి చైనాతో మనకన్నా జపాన్‌కూ, ఆస్ట్రేలియాకూ సమస్యలు అధికం. దక్షిణ చైనా సముద్ర జలాల్లో జపాన్‌కూ, పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో ఆస్ట్రేలియాకూ చైనా తలనొప్పిగా మారింది.
ఇక చైనాతో అమెరికాకు ఉన్న సమస్యలు సరేసరి. ప్రపంచ ఆధిపత్యం కోసం చైనా తనతో పోటీపడుతోందని, దీన్ని సకాలంలో కట్టడి చేయకపోతే తన పలుకుబడి తగ్గినా తగ్గొచ్చని అమెరికా ఎప్పటినుంచో భావిస్తోంది. అందు వల్లే దీర్ఘకాలంగా తనకు నమ్మదగ్గ మిత్రులుగా ఉన్న నాటో కూటమినీ, ఆస్ట్రేలియా, జపాన్లనూ అందుకు అనుగుణంగా అడుగులేయిస్తోంది.
తాజాగా మలబార్ తీరంలో తమ ఆధ్వర్యంలో తొలి సారి క్వాడ్ దేశాల నావికా దళాల విన్యాసాలు నిర్వహించటంతోపాటు ఆస్ట్రేలియాలో జరపబోయే నావికాదళ విన్యాసాలకు భారత్‌ను ఆహ్వానిస్తున్నామని ఆల్బనీస్ ప్రకటించటం భద్రత, రక్షణ రంగాల్లో రెండు దేశాలమధ్యా పెరిగిన సహకారాన్ని సూచిస్తోంది.
ఇతరేతర రంగాలకు సైతం క్వాడ్ దేశాల సహకారం పెంపొందాలని రెండేళ్లక్రితం ఆన్లైన్ వేదికగా జరిగిన తొలి శిఖరాగ్ర సదస్సు నిర్ణయించింది. అటుపై అనేకానేక అంశాలపై క్వాడ్ దేశాల మధ్య ఒప్పందాలు కుదురుతున్నాయి. కరోనా వైరస్ వ్యాక్సిన్ ఉత్పత్తి, వాతావరణ మార్పులు, కీలక సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపువంటి అంశాలపై పరస్పర అవగాహన ఏర్పడింది.
ఆంథోనీ ఆల్బనీస్ పర్యటన దానికి కొనసాగింపే. నిరుడు రెండు దేశాలూ ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందం (ఈసీటీఏ) కుదుర్చుకున్నాయి. అయితే అంతకు చాన్నాళ్లముందే... అంటే 2011లో మొదలై 2016 వరకూ చర్చలు సాగి అర్ధంతరంగా నిలిచిపోయిన సమగ్ర ఆర్థిక సహకారం ఒప్పందం(సీఈసీఏ)పై మాత్రం కదలిక లేదు. రెండేళ్లనుంచీ మళ్లీ చర్చలు సాగుతున్నా ఇంతవరకూ అవి ఓ కొలిక్కి రాలేదు.
కానీ ఆల్బనీస్ మాత్రం ఈ ఏడాదే ఆ ఒప్పందంపై సంతకాలవుతాయని ఘంటాపథంగా చెబుతున్నారు. దాని సంగతలావుంచి విద్యారంగంలో ఇరు దేశాలమధ్యా చాన్నాళ్లనుంచి తలెత్తిన సమస్యలు పరిష్కారం కావటం లక్షలాదిమంది విద్యార్థులకు ఊరట నిస్తుంది. నిరుడు మన దేశంనుంచి 7.7 లక్షలమంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఆస్ట్రే లియా, కెనడా, అమెరికా, బ్రిటన్ తదితర దేశాలకు వెళ్లారు.
అక్కడ లక్షలాది రూపాయలు వ్యయం చేసి చదువుకుని డిగ్రీలు, డిప్లొమోలు తెచ్చుకున్నా మన దేశంలో ఉద్యోగాలకు వాటిని పరిగణనలోకి తీసుకోవటం లేదు. ఈ సమస్య పరిష్కారానికి భారత్, ఆస్ట్రేలియాలు రెండూ తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. రెండు దేశాల విశ్వవిద్యాలయాలూ తాము విద్యార్థులకు ప్రదానం చేసే పట్టాలను పరస్పరం గుర్తించాలన్న నిర్ణయం జరిగింది.
వాతావరణం, సౌర శక్తి, హైడ్రోజన్ వంటి హరిత ఇంధనాల విషయంలో సహకారం మరింత పెంపొందాలని ఇరు దేశాలూ భావించాయి. ఇప్పటికే వ్యవసాయం, దుస్తులు, రైల్వే ఇంజిన్లు, టెలికాం పరికరాలు తదితరాలు మన దేశం నుంచి ఆస్ట్రేలియాకు ఎగుమతి అవుతుండగా, అక్కడి నుంచి మన పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాలూ, ఖనిజ ఉత్పత్తులు దిగుమతి అవు తున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ, ఆంథోనీ ఆల్బనీస్ల మధ్య జరిగిన చర్చల్లో ఖనిజాల ఎగు మతులు, దిగుమతులపై మరింత శ్రద్ధ పెట్టాలని నిర్ణయించటం ద్వైపాక్షిక వాణిజ్య విస్తరణకు తోడ్పడుతుంది. వచ్చే మే నెలలో ఆస్ట్రేలియాలో క్వాడ్ దేశాల శిఖరాగ్ర సమావేశం జరగబోతోంది.
పరస్పర సహకారం, సమానత్వ ప్రాతిపదికన దౌత్య సంబంధాలు దేశాల చెలిమిని కొత్త పుంతలు తొక్కిస్తాయి. దేశాలమధ్య వైషమ్యాలు, ఘర్షణలు అంతిమంగా ఆ దేశాలు నష్టపోవటానికే దోహద పడతాయి. ఈ సంగతిని అందరూ గ్రహించినప్పుడే ప్రపంచ శాంతి సాధ్యమవుతుంది.