విజయీభవ
కోట్లాదిమంది క్రీడాభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న భారత్-ఆస్ట్రేలియా సెమీస్ సమరం మరికొద్దిసేపట్లో ప్రారంభంకానుంది. వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న టీమిండియా అదే ఉత్సాహంతో గెలుపుపై ధీమా ప్రదర్శిస్తుండగా, సొంతగడ్డపై ఎలాగైనా విజయం సాధించాలనే తపనతో ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతోంది. ఈ మ్యాచ్‌లో కూడా భారత్ ఆటగాళ్లు దుమ్మురేపాలని, ఫైనల్‌కు చేరి వరల్డ్ కప్ సాధించాలని నగర క్రీడాలోకం ప్రార్థనలు చేస్తోంది.
విజయవాడ స్పోర్ట్స్ : క్రీడాభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. గురువారం ఆస్ట్రేలియాతో జరిగే సెమీ ఫైనల్‌లో టీమిండియా దుమ్ము రేపుతుందన్న ఆశతో అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దక్షిణాఫ్రికాపై దంచేసిన ధావన్, జింబాబ్వేపై చెలరేగిన రైనా, నాకౌట్‌లో సత్తా చాటిన రోహిత్‌శర్మ, అంచనాలకు అనుగుణంగా రాణించిన రహానేపైనే అంతా ఆశలు పెట్టుకున్నారు. ఈ వరల్డ్ కప్‌లో ఓటమి ఎరుగని టీమిండియా ఊపు చూస్తుంటే డిఫెండింగ్ చాంపియన్‌గా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం అందరిలో ఉంది. ఈ సందర్భంగా పలువురు క్రికెట్ కోచ్‌లు, పీడీలు ‘సాక్షి’తో మాట్లాడుతూ..
విజయం తప్పనిసరి
ఈ వరల్డ్ కప్‌లో బౌలింగే మనకు బలం. మనవాళ్లు చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తున్నారు. బౌలింగ్‌లో కూడా మనం నంబర్‌వన్ స్థాయిలో ఉన్నాం. ఫీల్డింగ్ కూడా బాగుంది. కూల్ కెప్టెన్‌గా ధోని చక్కటి నాయకత్వం వహిస్తున్నాడు. టీమిండియా విజయం తప్పనిసరి.
- ఎస్.శ్రీనివాస్‌రెడ్డి, ఏసీఏ క్రికెట్ కోచ్
చెలరేగిపోతారు..
ఈ సెమీఫైనల్‌లో టీమిండియా విజయం తప్పనిసరి. కోట్లాది ప్రజల ప్రార్థనలు, ఆశీస్సులు ఉన్నాయి. ఆస్ట్రేలియాపై కసిగా ఆడతారు. అక్కడ పిచ్‌లకు ఇప్పటికే అలవాటు పడ్డారు. తప్పకుండా విజయం సిద్ధిస్తుంది. కోహ్లి సెమీస్‌లో చెలరేగి ఆడతాడు.
- రంభా ప్రసాద్, ఆత్యాపాత్యా సంఘ రాష్ట్ర కార్యదర్శి
గెలుపు మనదే..
టీమిండియాను విజయం తప్పకుండా వరిస్తుంది. నేటి మ్యాచ్ చాలా బాగుంటుంది. ఆస్ట్రేలియాతో సెమీస్ మ్యాచ్ టఫ్‌గానే సాగుతుంది. పైగా వాళ్ల సొంతగడ్డ మీద ఆడటం వల్ల ఆస్ట్రేలియాపైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. అది మనకు కలిసొచ్చే అంశం.
- వైవీఆర్‌కే ప్రసాద్, వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల పీడీ
అదే థ్రిల్..
టీమిండియా అన్ని విభాగాల్లో బాగుంది. కోహ్లి చెలరేగి ఆడతాడు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. షమీ బౌలింగ్ చాలా బాగుంది. ఆడితే ఆస్ట్రేలియా మీద ఆడి గెలవాలి. అప్పుడే థ్రిల్. ఈసారి కూడా వరల్డ్ కప్ మనదే. - పి.వేణుగోపాల్‌రెడ్డి, వ్యాపారవేత్త