భారత్–ఆస్ట్రేలియా బంధం విద్యార్థులకు వరం
సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాల పటిష్టత విద్యార్థులకు పెద్ద ఎత్తున అవకాశాలను కల్పించనుందని వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాతో ప్రస్తుత, భవిష్యత్ భారత్ సంబంధాల్లో విద్య ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుందని ఆయన అన్నారు. ‘‘రెండు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు విస్తరిస్తున్నందున, విద్యార్థులకు అవకాశాలు కూడా సహజంగా పెరుగుతాయి. మేము ఈ దిశలో ప్రత్యేకంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాము’’ అని న్యూ సౌత్ వేల్స్ (ఎన్ఎస్డబ్ల్యూ) విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన అన్నారు. భారత్‌కు చెందిన దాదాపు లక్ష మంది ఆస్ట్రేలియా వెళ్లి విద్యను అభ్యసిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి విద్యార్థులను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం క్లుప్తంగా...
విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి
విద్యలో భారతదేశం–ఆస్ట్రేలియా భాగస్వామ్యాన్ని మరింత ఉన్నతికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇందుకు వీలుగా భారత్‌లో న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం కార్యకలాపాలను విస్తరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సేవల రంగాన్ని రెండు దేశాలూ పరస్పరం విస్తరించుకోవాలని కోరుకుంటు న్నాము. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల మరింత బలపడుతున్నాయి. స్టార్టప్‌లలో కూడా వ్యాపారాన్ని విస్తరింపజేస్తున్నందున, మీ అందరి (ఆస్ట్రేలియాలోని భారతీయ విద్యార్థులు) సహకారం మరింత అవసరం అవుతుంది. విద్యార్థులకు అవకాశాలు మరింత పెరుగుతాయి. భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య విద్య వారధిగా పనిచేస్తుంది. విద్య ఎల్లప్పుడూ రెండు దేశాల భాగస్వామ్యంలో ముఖ్యమైన అంశం. కోవిడ్ అనంతర ప్రపంచంలో, మనం వృద్ధికి సంబంధించి అధునాతన విధానాలను అన్వేషించాలి. ఇందులో భాగంగా ఎన్ఎస్డబ్ల్యూ భారత్‌లో తన కార్యకలాపాలను పెంచాలి.
ఉపాధికీ అవకాశాలు:
ఆస్ట్రేలియన్ మంత్రి టెహాన్
ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియన్ వాణిజ్య మంత్రి డాన్ టెహన్ మాట్లాడుతూ, ఆస్ట్రేలియాలో చదువుతున్న భారతీయ విద్యార్థులు ఇక్కడ పని చేసే విషయంలో కొంత తర్జన భర్జనలు పడుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇలాంటి సందేహాలకు తావు లేదని ఆయన అన్నారు. ‘‘రెండు దేశాల మధ్య ఒప్పందంలో భాగంగా, మేము ఒక కీలక నిర్ణయం తీసుకున్నాము. ఒక విద్యార్థి ఎస్టీఈఎం (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం) డిగ్రీ తీసుకున్నట్లయితే అలాగే డిగ్రీలో భాగంగా ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)లో పని చేస్తున్నట్లయితే అప్పుడు ఆ విద్యార్థి అదనపు పోస్ట్ స్టడీ వర్క్ వీసా పొందుతాడు. అలా సంబంధిత విద్యార్థి ఇక్కడే ఉండగలడు. పని చేయగలడు. ఎక్కువ కాలమూ తన సేవలను అందించగలడు’’ అని ఆయన అన్నారు.
ఆస్ట్రేలియాలో విద్య ఉపాధి అవకాశాలను అంది స్తుందని తాము ఖచ్చితంగా చెప్పగలమని పేర్కొన్నారు. అలాగే రాబోయే ఆరు నెలల్లో, భారత్ విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న దానికంటే చాలా ఎక్కువ అవకాశాలు లభిస్తాయని తాము ఆశిస్తున్నామనీ ఆయన అన్నారు. ఆస్ట్రేలియాలో ఫైనాన్స్ అండ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ చదువుతున్న ముష్కాన్ అనే భారతీయ విద్యార్థిని అంతకుముందు ఒక ప్రశ్న అడుగుతూ, ‘‘నేను ఉద్యోగం కోసం దరఖాస్తు చేసినప్పుడల్లా (ఇక్కడ), మీరు ఆస్ట్రేలియన్ పౌరుడు లేదా ఆస్ట్రేలియన్ టీఆర్ (తాత్కాలిక నివాసి) అయి ఉండాలనే నిబంధన ఎప్పుడూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో నేను సంబంధిత ఉద్యోగాలకు దరఖాస్తు చేయలేకపోతున్నాను. ఇది నిజంగా నిరుత్సాహపరుస్తుంది’’అని అన్నారు. అన్ని సమస్యలకూ పరిష్కారం లభిస్తుందని మంత్రులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ద్వైపాక్షిక వాణిజ్యం... సంబంధాల వారధి
భారత్–ఆస్ట్రేలియాల మధ్య వాణిజ్య సంబంధాల పురోగతి వల్ల విద్య, సాంస్కృతిక వంటి ఇతర అన్ని రంగాల మధ్య భాగస్వామ్యం మరింత పటిష్టమవుతుందని బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా సిడ్నీలో నిర్వహించిన బిజినెస్ లీడర్స్ మీటింగ్‌ను ఉద్దేశించి గోయల్ అన్నారు. ‘‘వివిధ రంగాలకు సంబంధించి మీరు (ఆస్ట్రేలియా వ్యాపారవేత్తలు) మీ సాంకేతికతలను భారత్‌కు తీసుకోవచ్చు. భారత్‌లో ఈ టెక్నాలజీని విస్తరించవచ్చు. ఆస్ట్రేలియా అద్భుతమైన ఆవిష్కరణలను, ప్రయోగ ఫలితాలను.. పరిశోధనా సంస్థలు లేదా విశ్వవిద్యాలయాల నుండి భారతదేశం వంటి పెద్ద మార్కెట్‌కు తీసుకెళ్లవచ్చు.
ఆయా అంశాలకు సంబంధించి భారతీయులు ప్రదర్శించే ప్రతిభ, నైపుణ్యాలను మీరూ ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ నేను భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియాను ప్రస్తావించదలచాను. మేక్ ఇన్ ఇండియా అనేది భారతదేశ పురోగతి కోసమే ఉద్దేశించినది కాదు. ఈ ప్రయోజనం ప్రపంచ దేశాలకూ అందాలన్నది మా సంకల్పం’’ అని గోయల్ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పంద ప్రయోజనం గణనీయంగా పొందడానికి భారతదేశం ప్రత్యేకంగా ఇన్వెస్ట్ ఇండియా కార్యాలయాన్ని ప్రారంభిస్తుందని తెలిపారు. అలాగే కొన్ని నెలల్లో ఆస్ట్రేలియాలో ట్రేడ్ ప్రమోషన్ కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తుందని గోయల్ సూచించారు. భారత్‌లో పెట్టుబడులు పెడితే, మెరుగైన రాబడులు వస్తాయని మంత్రి పేర్కొన్నారు.
27.5 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక స్నేహం
భారత్–ఆస్ట్రేలియా ద్వైపాక్షిక వాణిజ్యా న్ని ప్రస్తుతం 27.5 బిలియన్ డాలర్లు. ఈ పరిమాణాన్ని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు పెంచుకోవడంపై రెండు దేశాలూ దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా ఈ నెల రెండవతేదీన రెండు దేశాలు ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందాన్ని (స్వేచ్ఛా వాణిజ్యం) కుదుర్చుకున్నాయి. దీని కింద ఇరు దేశాలు 85–96 శాతం ఉత్పత్తుల దిగుమతులపై టారిఫ్‌లు ఎత్తివేయనున్నాయి. విద్య, పరిశోధన, స్టార్టప్‌లు, అగ్రి టెక్ విభాగాల్లో సహకారాన్ని పెంచుకునేందుకు అవకాశాలున్నట్టు రెండు దేశాలూ భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఈ నెల 4న భారత్ వాణిజ్య మంత్రి గోయల్ మూడు రోజుల కీలక పర్యటన ప్రారంభమైంది.
వ్యూహాత్మక భద్రతా చర్చలకు సంబంధించి (చైనా ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా అని కొందరు విశ్లేషి స్తారు) నాలుగు దేశాల క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ (క్యూఎస్డీ– కొన్నిసార్లు క్యూ యూఏడీ అని కూడా పిలుస్తారు) సభ్య దేశా ల్లో భారత్–ఆస్ట్రేలియాలు కూడా ఉన్నాయి. వీటితోపాటు జపాన్, అమెరికాలకు క్వాడ్‌లో సభ్యత్వం ఉంది. క్వాడ్‌లో సభ్యదేశమైనప్ప టికీ, అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గకుండా భారత్ రష్యాకు మద్దతు నిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. అదే సమయంలో ఆస్ట్రేలియాతో కీలక స్వేచ్ఛా వాణిజ్యానికి తెరతీయడం గమనార్హం.