India-Australia Summit
-
ఆస్ట్రేలియాతో ఏడు ఒప్పందాలు
న్యూఢిల్లీ–మెల్బోర్న్: భారత్, ఆస్ట్రేలియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య బంధాలు మరింత బలోపేతమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. అత్యంత కీలకమైన రక్షణ రంగం సహా ఏడు ఒప్పందాలు కుదిరాయి. భారత ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ మధ్య గురువారం ఆన్లైన్ సదస్సు జరిగింది. కోవిడ్ నేపథ్యంలో ఇరువురు నేతలు ఆన్లైన్ ద్వారా చర్చలు జరిపారు. మిలటరీ స్థావరాల్లో పరస్పర సహకారానికి వీలుగా ది మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ (ఎమ్‌ఎల్‌ఎస్‌ఏ)పై ఇరువురు సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో రక్షణ రంగంలో పరస్పరం సహకారం అందించుకుంటూనే ఇరు దేశాలు ఒకరి మిలటరీ స్థావరాలు మరొకరు వినియోగించుకునే వీలు ఉంటుంది. ఇకపై మరమ్మతులు, సైనికుల అవసరాలను తీర్చే సామగ్రి సరఫరా వంటి వాటి కోసం ఇరు దేశాలు ఒకరి మిలటరీ స్థావరాన్ని మరొకరు వినియోగించుకోవచ్చు. ఎమ్‌ఎల్‌ఎస్‌ఏ ఒప్పందంతో పాటుగా సైబర్ టెక్నాలజీ, ఖనిజాలు తవ్వకాలు, మిలటరీ టెక్నాలజీ, వృత్తి విద్యా కోర్సులు, జల వనరుల నిర్వహణ వంటి అంశాల్లో ద్వైపాక్షిక సహకారం అందించుకోవడానికి ఇరు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ► ఇండో పసిఫిక్ తీర ప్రాంతం భద్రతపై ఇరు పక్షాలు దృష్టి సారించాయి. ‘‘షేర్డ్ విజన్ ఫర్ మ్యారీ టైమ్ కోపరేషన్ ఇన్ ది ఇండో పసిఫిక్’’అన్న పేరుతో ఒక డిక్లరేషన్‌ను ఆవిష్కరించాయి. సంక్షోభాల నుంచి అవకాశాలు ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన మోదీ ప్రపంచవ్యాప్తంగా కరోనా చూపించిన తీవ్రమైన సామాజిక, ఆర్థిక ప్రభావం నుంచి బయటపడడానికి సమన్వయంతో, సహకారంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కరోనా సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తుందన్నారు. దానికనుగుణంగా అన్ని రంగాల్లోనూ సమగ్రమైన సంస్కరణలు తీసుకువచ్చే ప్రక్రియ మొదలైందని చెప్పారు. ► అణు సరఫరా గ్రూపు (ఎన్ఎస్జీ)లో భారత్ సభ్యత్వానికి ఆస్ట్రేలియా సంపూర్ణ మద్దతుని ప్రకటించింది. ఐరాస భద్రతా మండలిలో భారత్‌ని శాశ్వత సభ్యదేశంగా చేయడానికి మద్దతునిస్తామని చెప్పింది. సమోసా కిచిడీ దౌత్యం స్కాట్ మారిసన్ గుజరాతీ కిచిడి వండి వడ్డించడానికి సిద్ధమవుతున్నారు. మోదీతో ఆన్లైన్ సదస్సులో పాల్గొన్న ఆయన ఈసారి ఇరువురి సమావేశం జరిగినప్పుడు తానే స్వయంగా కిచిడి వండి తినిపిస్తానన్నారు. భారతీయ సమోసా, మాంగో చెట్నీలు స్వయంగా తయారు చేసిన మారిసన్ వాటి రుచిని ఆస్వాదిస్తూ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తానే స్వయంగా భారత్‌కు వచ్చి మోదీని కలుసుకొని సమోసా తినిపించాలని అనుకున్నానని మారిసన్ చెప్పారు. మోదీ ఆలింగనాన్ని కూడా మిస్ అయ్యానన్నారు. ఈ సారి కలిసినప్పుడు మోదీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని గుజరాతీ కిచిడీని స్వయంగా వండి తినిపిస్తానని చెప్పారు. దీనికి మోదీ బదులిస్తూ ‘మీరు సమోసాలు షేర్ చేయగానే దేశమంతా దాని గురించే మాట్లాడారు. ఇంక అందరూ గుజరాతీ కిచిడీ గురించే మాట్లాడుకుంటారు. గుజరాతీయులు చాలా ఆనందపడతారు. ఈ కిచిడీని దేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు’అని మోదీ బదులిచ్చారు. -
ఎన్నో అవకాశాలు.. పెట్టుబడులు పెట్టండి
ఆస్ట్రేలియా వ్యాపార ప్రతినిధులకు చంద్రబాబు పిలుపు సీఐఐ సదస్సులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సాక్షి, న్యూఢిల్లీ: అపారమైన సహజ సంపద, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ఇతర మౌలిక సదుపాయాలున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రంగాల్లో వీలైనంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆస్ట్రేలియా వ్యాపార ప్రతినిధులకు ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి.. సహజ వనరులతోపాటు సుదీర్ఘమై తీరం, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా కలిసివచ్చే అంశాలని పేర్కొన్నారు. సీఐఐ (కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) ఆధ్వర్యంలో ఢిల్లీలోని తాజ్ప్యాలెస్ హోటల్లో సోమవారం నిర్వహించిన భారత్-ఆస్ట్రేలియా వాణిజ్య సదస్సులో, అనంతరం విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడారు. సదస్సులో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆస్ట్రేలియా వాణిజ్య, పెట్టుబడుల మంత్రి ఆండ్రూ రాబ్, సీఐఐ చైర్మన్ శ్రీరాం, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు, టీడీపీ ఎంపీ సీఎం రమేశ్, సుమారు 450 మంది ఆస్ట్రేలియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని వ్యాపార అనుకూల పరిస్థితులను చంద్రబాబు వారికి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ‘కేంద్రంలో మరో ఐదేళ్ల వరకు స్థిరమైన ప్రభుత్వం ఉంటుంది. సరైన సమయంలో సరైన వ్యక్తి మోదీ ప్రధానిగా ఉన్నారు. ఆర్థిక సంస్కరణలకు నేను పూర్తి మద్దతు ఇస్తాను. రాష్ట్రంలో ఐటీతో మౌలికవసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. నాలుగు క్యాంపెయిన్లు, 5 గ్రిడ్లు, ఏడు మిషన్లు అన్న నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. అభివృద్ధి చెందిన దేశాలైన సింగపూర్, మలేసియా, జపాన్, సౌత్ కొరియా, జర్మనీ, స్విట్జర్లాండ్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయి. ఏపీని గేట్‌వే ఆఫ్ ఇండియాగా మార్చడమే మా లక్ష్యం. భారత్ డిజిటల్ ఇండియాగా మారబోతున్నందున మీరు ఆస్ట్రేలియాలో కూర్చునే మీ వ్యాపారాలు చూసుకోవచ్చు. ఏపీలోని ప్రతి ఇంటికి 20 ఎంబీపీఎస్ లైన్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం..’ అని బాబు చెప్పారు. వీలైనంత త్వరగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తానని చెప్పారు. సదస్సుకు ముందు ఆస్ట్రేలియా మౌలిక వసతుల మంత్రి జేమి బ్రిగ్స్, ఆస్ట్రేలియా పార్లమెంటరీ సెక్రెటరీ ఆర్ కోల్బెక్తో కూడిన ప్రతినిధి బృందంతో బాబు సమావేశమయ్యారు. ఆస్ట్రేలియా మంత్రి ఆండ్రూ రాబ్ బృందంతోనూ భేటీ అయ్యారు.అనంతరం జపాన్ బృందంతో కలిసి సీఎం హైదరాబాద్ బయలుదేరారు.