ఇండియా-ఆస్ట్రేలియా సదస్సులో టాస్క్‌ఫోర్స్ నివేదికను ఆవిష్కరిస్తున్న దృశ్యం
ఆస్ట్రేలియా వ్యాపార ప్రతినిధులకు చంద్రబాబు పిలుపు
సీఐఐ సదస్సులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్
సాక్షి, న్యూఢిల్లీ: అపారమైన సహజ సంపద, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ఇతర మౌలిక సదుపాయాలున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రంగాల్లో వీలైనంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆస్ట్రేలియా వ్యాపార ప్రతినిధులకు ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి.. సహజ వనరులతోపాటు సుదీర్ఘమై తీరం, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా కలిసివచ్చే అంశాలని పేర్కొన్నారు.
సీఐఐ (కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) ఆధ్వర్యంలో ఢిల్లీలోని తాజ్‌ప్యాలెస్ హోటల్‌లో సోమవారం నిర్వహించిన భారత్-ఆస్ట్రేలియా వాణిజ్య సదస్సులో, అనంతరం విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడారు. సదస్సులో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆస్ట్రేలియా వాణిజ్య, పెట్టుబడుల మంత్రి ఆండ్రూ రాబ్, సీఐఐ చైర్మన్ శ్రీరాం, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు, టీడీపీ ఎంపీ సీఎం రమేశ్, సుమారు 450 మంది ఆస్ట్రేలియా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని వ్యాపార అనుకూల పరిస్థితులను చంద్రబాబు వారికి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ‘కేంద్రంలో మరో ఐదేళ్ల వరకు స్థిరమైన ప్రభుత్వం ఉంటుంది. సరైన సమయంలో సరైన వ్యక్తి మోదీ ప్రధానిగా ఉన్నారు. ఆర్థిక సంస్కరణలకు నేను పూర్తి మద్దతు ఇస్తాను. రాష్ట్రంలో ఐటీతో మౌలికవసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. నాలుగు క్యాంపెయిన్లు, 5 గ్రిడ్లు, ఏడు మిషన్లు అన్న నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. అభివృద్ధి చెందిన దేశాలైన సింగపూర్, మలేసియా, జపాన్, సౌత్ కొరియా, జర్మనీ, స్విట్జర్‌లాండ్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయి. ఏపీని గేట్‌వే ఆఫ్ ఇండియాగా మార్చడమే మా లక్ష్యం. భారత్ డిజిటల్ ఇండియాగా మారబోతున్నందున మీరు ఆస్ట్రేలియాలో కూర్చునే మీ వ్యాపారాలు చూసుకోవచ్చు. ఏపీలోని ప్రతి ఇంటికి 20 ఎంబీపీఎస్ లైన్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం..’ అని బాబు చెప్పారు.
వీలైనంత త్వరగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తానని చెప్పారు. సదస్సుకు ముందు ఆస్ట్రేలియా మౌలిక వసతుల మంత్రి జేమి బ్రిగ్స్, ఆస్ట్రేలియా పార్లమెంటరీ సెక్రెటరీ ఆర్ కోల్‌బెక్‌తో కూడిన ప్రతినిధి బృందంతో బాబు సమావేశమయ్యారు. ఆస్ట్రేలియా మంత్రి ఆండ్రూ రాబ్ బృందంతోనూ భేటీ అయ్యారు.అనంతరం జపాన్ బృందంతో కలిసి సీఎం హైదరాబాద్ బయలుదేరారు.