India Business
-
పెగాట్రాన్‌లో వాటాలపై టాటా కన్ను
న్యూఢిల్లీ: యాపిల్ ఉత్పత్తుల తయారీ సంస్థ పెగాట్రాన్ భారత వ్యాపారంలో వాటాలు కొనుగోలు చేయడంపై టాటా గ్రూప్ దృష్టి సారించింది. పెగాట్రాన్ కార్యకలాపాల్లో సుమారు 60 శాతం వాటాను దక్కించుకోవడంపై టాటా ఎల్రక్టానిక్స్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై గత ఏడాది కాలంగా ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. యాపిల్ ఉత్పత్తుల తయారీలో మార్జిన్లు చాలా తక్కువగా ఉండటం, ప్లాంట్లలో కారి్మకుల డిమాండ్లతో సమస్యలు వస్తున్నా, అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తూ, సకాలంలో ఉత్పత్తులను సరఫరా చేయాల్సి రావడం కంపెనీకి సవాలుగా ఉంటోందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో భారత కార్యకలాపాలకు సంబంధించి స్థానిక కంపెనీని భాగస్వామిగా చేసుకోవాలని కంపెనీ భావిస్తున్నట్లు వివరించాయి. తమిళనాడులో ఉన్న పెగాట్రాన్ ఫ్యాక్టరీలో 10,000 మంది వర్కర్లు ఉండగా, ఏటా యాభై లక్షల ఐఫోన్ల తయారీ సామర్థ్యాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది భారత్‌లో తయారైన మొత్తం ఐఫోన్లలో 10% ఫోన్లను పెగాట్రాన్ ఉత్పత్తి చేసినట్లు అంచనా. తమిళనాడులోని హోసూర్‌లో ఏర్పాటు చేసే ప్లాంటు కోసం టాటా, పెగాట్రాన్ జట్టు కట్టనున్నట్లు సమాచారం. టాటా గ్రూప్ ఇప్పటికే మరో ఐఫోన్ల తయారీ సంస్థ విస్ట్రాన్ భారత వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. -
స్వీడన్‌ను వీడి స్వదేశానికి
స్వీడన్.. ఐరోపాలో ఐదో పెద్ద దేశం. అందమైన ప్రకృతి దృశ్యాలు, ప్రత్యేకమైన సంస్కృతి. అయినప్పటికీ చాలామంది భారతీయులు స్వీడన్‌ను వీడి స్వదేశానికి వచ్చేస్తున్నారు. ఇలా వస్తున్న వారి సంఖ్య 2024లో జనవరి–జూన్ మధ్య ఏకంగా 171% పెరగడం విశేషం! 1998 తర్వాత ఇంత భారీగా భారతీయులు స్వీడన్ వీడి రావడం ఇదే తొలిసారి. ఇందుకు కారణాలను తెలుపుతూ స్వీడన్లో ఉంటున్న భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్, స్వీడన్–ఇండియా బిజినెస్ కౌన్సిల్ సీఈఓ అంకుర్ త్యాగి చేసిన పోస్టు వైరల్‌గా మారింది. సామాజిక అనైక్యత... స్వీడన్లో సాంస్కృతిక, భాషా అవరోధాల వల్ల స్థానికులతో భారతీయులు సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోలేకపోతున్నారు. స్వదే శంలో ఉండగా బాగా అలవాటైన బలమైన సామాజిక బంధాలను కోల్పోతున్నారు. స్వీడిష్ సమాజంలో పూర్తిగా కలిసిపోలేకపోతున్నారు. ఒంటరితనం, స్నేహితుల లేమివ వంటివి వారిని కుంగదీస్తున్నాయి. వృద్ధులైన తల్లిదండ్రులకు తోడుగా, కుటుంబానికి దగ్గరగా ఉండటానికి తిరిగి వచ్చేస్తున్నారు. కఠినమైన స్వీడిష్ వాతావరణం, అధిక జీవన వ్యయం కూడా ముఖ్యమైన సమస్యలే. సాంస్కృతిక సవాళ్లు... స్వీడన్లో భారతీయ నిపుణుల జీవిత భాగస్వాములూ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అర్హతలు, పని అనుభవం ఉన్నా స్వీడిష్ భాషా నైపుణ్యాలు లేకపోవడం వల్ల చాలామందికి ఉద్యోగాలు రావడం లేదు. సరీ్వస్ అపార్ట్మెంట్ల కొరతతో వసతి కూడా సమస్యగా మారుతోంది. వీటికి తోడు భారత్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుండటంతో అక్కడ అవకాశాలు అపారంగా పెరుగుతుండటమూ మనవాళ్లు స్వదేశీ బాట పట్టేందుకు ప్రధాన కారణమని త్యాగి పేర్కొన్నారు. నిపుణులకు భారత్‌లో మెరుగైన అవకాశాలు, మంచి వేతనాలు, ఉత్తేజకరమైన కెరీర్ ఉంటున్నట్టు చెప్పుకొచ్చారు. కొవిడ్ తర్వాత... కొవిడ్ మహమ్మారి అనంతరం పలు రంగాల్లో ఎక్కడి నుంచైనా పని చేయడానికి వీలుండటం కూడా మనవాళ్లు స్వీడన్ వీడేందుకు కారణంగా మారుతోంది. భారత్‌కు తిరిగి వచ్చి ఇక్కడినుంచే పలు అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తున్నారు. తమ దేశానికి వలసలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా విదేశాల్లో జని్మంచిన స్వీడిష్ పౌరులు దేశం విడిచి వెళ్ళడానికి స్వీడిష్ ప్రభుత్వం డబ్బు చెల్లిస్తోంది. స్వచ్ఛంద నిష్క్రమణ పథకం కింద ప్రస్తుతం 10,000 స్వీడిష్ క్రౌన్లు (సుమారు 960 డాలర్లు), వారు దేశం విడిచి వెళ్ళడానికి ప్రయాణ ఖర్చులను అందిస్తోంది. ఇది కూడా ఓ కారణమై ఉంటుందని, అయితే దేనిని అంచనా వేయాలన్నా ఏడాదిపాటు వలసలను అధ్యయనం చేయాలని స్వీడన్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ సీఈఓ, సెక్రటరీ జనరల్ రాబిన్ సుఖియా చెబుతున్నారు.గత ఆర్నెల్లలో 2,461 మంది వెళ్లారు! నిజానికి స్వీడన్‌కు వెళ్లే భారతీయుల సంఖ్య తక్కువేమీ కాదు. 2024లో ఇప్పటిదాకా స్వీడన్‌కు వలస వెళ్లినవారిలో ఉక్రేనియన్ల తరువాత ఎక్కువమంది భారతీయులే. గత జనవరి నుంచి జూన్ దాకా 2,461 మంది మనవాళ్లు స్వీడన్ బాటపట్టారు. అయితే గత ఆరేళ్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. 2020, 2021 కోవిడ్ సంవత్సరాలను మినహాయిస్తే 2017–2024 మధ్య ఒక ఏడాదిలో ఇంత తక్కువ సంఖ్యలో భారతీయులు స్వీడన్ వెళ్లడం ఇదే తొలిసారి. – న్యూఢిల్లీ -
సంస్కరణలు అమలైతే బ్రిటన్ నుంచి మరిన్ని పెట్టుబడులు
న్యూఢిల్లీ: వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పించే దిశగా భారత్ ప్రవేశపెట్టిన సంస్కరణలపై బ్రిటన్ వ్యాపార సంస్థలు సానుకూలంగానే ఉన్నాయి. అయితే, వీటి అమలు వేగంపైనే వాటికి సందేహాలు వస్తున్నాయి. బ్రిటన్ ఇండియా వ్యాపార మండలి మూడో వార్షిక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ) ఇన్ ఇండియా సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్‌లో వ్యాపారాల నిర్వహణకు పరిస్థితులు మెరుగుపడ్డాయని సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 51 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇది గతేడాది నమోదైన 53 శాతం కన్నా తక్కువ కావడం గమనార్హం. ప్రపంచ బ్యాంకు ఈవోడీబీ ర్యాంకింగ్స్‌లో భారత్ 130వ స్థానం నుంచి 100వ స్థానానికి చేరడం, భారత సార్వభౌమ రేటింగ్‌ను స్థిరమైన అంచనాలతో బీఏఏ2 స్థాయికి రేటింగ్ ఏజెన్సీ మూడీస్ పెంచడం తదితర పరిణామాల నేపథ్యంలో తాజా నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 24 మధ్యలో నిర్వహించిన ఈ సర్వేలో దాదాపు 88 కంపెనీలు పాల్గొన్నాయి. గతేడాది కంపెనీల సంఖ్య 65. భారత్‌లో అత్యధికంగా ఇన్వెస్ట్ చేసే జీ20 కూటమి దేశాల జాబితాలో బ్రిటన్ అగ్రస్థానంలో ఉంది. భారత్‌లో వ్యాపారావకాశాలపై బ్రిటన్ సంస్థలు ఆసక్తిగానే ఉన్నాయని, కేంద్ర, రాష్ట్రాలు సంస్కరణలు మరింతగా అమలు చేసిన పక్షంలో మరిన్ని పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించగలవని సర్వే నివేదిక పేర్కొంది. భారత్‌లో వ్యాపారాల నిర్వహణకు ప్రధానంగా చట్టపరమైన, నియంత్రణ సంస్థలపరమైన అడ్డంకులు ఉంటున్నాయని సర్వేలో పాల్గొన్న వారిలో 63 శాతం మంది తెలపగా.. 34 శాతం మంది అవినీతి గురించి, 39 శాతం మంది ట్యాక్సేషన్ వివాదాల గురించీ ప్రస్తావించారు. -
దక్షిణాది రాష్ట్రాలపై మెక్ డోనాల్డ్ దృష్టి
సాక్షి, అమరావతి: దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు ‘మెక్‌డోనాల్డ్’ ప్రకటించింది. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో 242గా ఉన్న రెస్టారెంట్ల సంఖ్యను వచ్చే రెండేళ్లలో రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మెక్‌డోనాల్డ్ ఇండియా బిజినెస్ ఆపరేషన్స్ డెరైక్టర్ (సౌత్) గెరాల్డ్ డయాస్ తెలిపారు.ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల వారు స్పైసీ ఫుడ్‌ను ఇష్టపడతారని, వీరికోసం ప్రత్యేక మెనూ తయారు చేసినట్లు తెలిపారు. విజయవాడలో తొలి మెక్‌డోనాల్డ్ రెస్టారెంట్‌ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాఖాహారం వారి కోసం ప్రతీ రెస్టారెంట్లోనూ ప్రత్యేక కిచెన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల రెస్టారెంట్ నిర్వహణ వ్యయం రెట్టింపు అవుతున్నా భారతీయుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని శాఖాహార వంటలపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. గత నెలలో నెల్లూరులో మొదటి రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశామని, త్వరలోనే గుంటూరు, విశాఖపట్నంలో రెస్టారెంట్లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. విజయవాడలోని రెస్టారెంట్‌కు వచ్చిన స్పందన చూసిన తర్వాత విస్తరణపై దృష్టిసారించనున్నట్లు తెలిపారు. తెలంగాణాలో మెక్‌డోనాల్డ్ ప్రస్తుతం 21 రెస్టారెంట్లను కలిగి వుంది. మొత్తం ఇండియా వ్యాపారంలో 40 శాతం కేవలం దక్షిణాది రాష్ట్రాల నుంచే సమకూరుతుండటంతో ఈ రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.