స్వీడన్‌ను వీడి స్వదేశానికి | Indians leaving Sweden at record rate | Sakshi
Sakshi News home page

స్వీడన్‌ను వీడి స్వదేశానికి

Published Tue, Aug 27 2024 5:47 AM | Last Updated on Tue, Aug 27 2024 5:47 AM

Indians leaving Sweden at record rate

గత ఆర్నెల్లలో 171% పెరిగిన భారతీయుల ఘర్‌ వాపసీ 

లే ఆఫ్స్, వాతావరణం, ‘వర్క్‌ ఫ్రం హోం’ కారణాలు

స్వీడన్‌.. ఐరోపాలో ఐదో పెద్ద దేశం.  అందమైన ప్రకృతి దృశ్యాలు, ప్రత్యేకమైన సంస్కృతి. అయినప్పటికీ చాలామంది భారతీయులు స్వీడన్‌ను వీడి స్వదేశానికి వచ్చేస్తున్నారు. ఇలా వస్తున్న వారి సంఖ్య 2024లో జనవరి–జూన్‌ మధ్య ఏకంగా 171% పెరగడం విశేషం! 1998 తర్వాత ఇంత భారీగా భారతీయులు స్వీడన్‌ వీడి రావడం ఇదే తొలిసారి. ఇందుకు కారణాలను తెలుపుతూ స్వీడన్‌లో ఉంటున్న భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్, స్వీడన్‌–ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ సీఈఓ అంకుర్‌ త్యాగి చేసిన పోస్టు వైరల్‌గా మారింది.    

సామాజిక అనైక్యత... 
స్వీడన్‌లో సాంస్కృతిక, భాషా అవరోధాల వల్ల స్థానికులతో భారతీయులు సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోలేకపోతున్నారు. స్వదే శంలో ఉండగా బాగా అలవాటైన బలమైన సామాజిక బంధాలను కోల్పోతున్నారు. స్వీడిష్‌ సమాజంలో పూర్తిగా కలిసిపోలేకపోతున్నారు. ఒంటరితనం, స్నేహితుల లేమివ వంటివి వారిని కుంగదీస్తున్నాయి. వృద్ధులైన తల్లిదండ్రులకు తోడుగా, కుటుంబానికి దగ్గరగా ఉండటానికి తిరిగి వచ్చేస్తున్నారు. కఠినమైన స్వీడిష్‌ వాతావరణం, అధిక జీవన వ్యయం కూడా ముఖ్యమైన సమస్యలే. 

సాంస్కృతిక సవాళ్లు... 
స్వీడన్‌లో భారతీయ నిపుణుల జీవిత భాగస్వాములూ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అర్హతలు, పని అనుభవం ఉన్నా స్వీడిష్‌ భాషా నైపుణ్యాలు లేకపోవడం వల్ల చాలామందికి ఉద్యోగాలు రావడం లేదు. సరీ్వస్‌ అపార్ట్‌మెంట్ల కొరతతో వసతి కూడా సమస్యగా మారుతోంది. వీటికి తోడు భారత్‌ అభివృద్ధి పథంలో దూసుకుపోతుండటంతో అక్కడ అవకాశాలు అపారంగా పెరుగుతుండటమూ మనవాళ్లు స్వదేశీ బాట పట్టేందుకు ప్రధాన కారణమని త్యాగి పేర్కొన్నారు. నిపుణులకు భారత్‌లో మెరుగైన అవకాశాలు, మంచి వేతనాలు, ఉత్తేజకరమైన కెరీర్‌ ఉంటున్నట్టు చెప్పుకొచ్చారు. 

కొవిడ్‌ తర్వాత... 
కొవిడ్‌ మహమ్మారి అనంతరం పలు రంగాల్లో ఎక్కడి నుంచైనా పని చేయడానికి వీలుండటం కూడా మనవాళ్లు స్వీడన్‌ వీడేందుకు కారణంగా మారుతోంది. భారత్‌కు తిరిగి వచ్చి ఇక్కడినుంచే పలు అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తున్నారు. తమ దేశానికి వలసలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా విదేశాల్లో జని్మంచిన స్వీడిష్‌ పౌరులు దేశం విడిచి వెళ్ళడానికి స్వీడిష్‌ ప్రభుత్వం డబ్బు చెల్లిస్తోంది. స్వచ్ఛంద నిష్క్రమణ పథకం కింద ప్రస్తుతం 10,000 స్వీడిష్‌ క్రౌన్లు (సుమారు 960 డాలర్లు), వారు దేశం విడిచి వెళ్ళడానికి ప్రయాణ ఖర్చులను అందిస్తోంది. ఇది కూడా ఓ కారణమై ఉంటుందని, అయితే దేనిని అంచనా వేయాలన్నా ఏడాదిపాటు వలసలను అధ్యయనం చేయాలని స్వీడన్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ సీఈఓ, సెక్రటరీ జనరల్‌ రాబిన్‌ సుఖియా చెబుతున్నారు.

గత ఆర్నెల్లలో 2,461 మంది వెళ్లారు! 
నిజానికి స్వీడన్‌కు వెళ్లే భారతీయుల సంఖ్య తక్కువేమీ కాదు. 2024లో ఇప్పటిదాకా స్వీడన్‌కు వలస వెళ్లినవారిలో ఉక్రేనియన్ల తరువాత ఎక్కువమంది భారతీయులే. గత జనవరి నుంచి జూన్‌ దాకా 2,461 మంది మనవాళ్లు స్వీడన్‌ బాటపట్టారు. అయితే గత ఆరేళ్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. 2020, 2021 కోవిడ్‌ సంవత్సరాలను మినహాయిస్తే 2017–2024 మధ్య ఒక ఏడాదిలో ఇంత తక్కువ సంఖ్యలో భారతీయులు స్వీడన్‌ వెళ్లడం ఇదే తొలిసారి.

 – న్యూఢిల్లీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement