సాక్షి, అమరావతి: మెరుగైన జీవనం కోసం వలస వెళ్లడం మానవ చరిత్రలో సహజ ప్రక్రియ. ఆధునికకాలంలో విదేశాలకు వలస వెళ్లడం మరింత పెరుగుతోంది. విదేశాలకు వలసబాటపడుతున్న వారిలో ప్రపంచంలోనే భారతీయులు మొదటి స్థానంలో ఉన్నారు. విద్య, ఉపాధి అవకాశాల కోసం అత్యధికంగా భారతీయులు విదేశాలకు వెళుతున్నారని ఐక్య రాజ్యసమితి డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోషల్ అఫైర్స్(యూఎన్ డీఈఎస్‌ఏ) ‘ఇంటర్నేషనల్ మైగ్రేషన్’ పేరిట ఇటీవల విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. భారత్‌లో జన్మించి 2020 నాటికి విదేశాల్లో స్థిరపడినవారు 1.80కోట్లమంది ఉన్నారని ఆ నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా విదేశాలకు వలసల వివరాలను వెల్లడించిన ఈ నివేదికలో భారతీయులకు సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి.
2020నాటికి 1.80కోట్లమంది వలస...
జన్మించిన దేశాన్ని విడిచిపెట్టి విదేశాల్లో ఉన్నవారిలో ప్రపంచంలోనే భారతీయులు మొదటిస్థానంలో ఉన్నారు. ఈ విధంగా 2020నాటికి 1.80కోట్లమంది భారతీయులు విదేశాల్లో స్థిరపడ్డారు. కరోనా వ్యాప్తి ఉన్నప్పటికీ 2020లో 7.20లక్షలమంది, 2021లో 8.30లక్షలమంది భారతీయులు విదేశాలకు వలస వెళ్లారు. 2020లో జూలై నాటికే 13లక్షలమంది విదేశాలకు వలస వెళ్లడం గమనార్హం. విదేశాలకు వలస వెళుతున్నవారిలో భారతీయుల తర్వాత మెక్సికన్లు (1.10కోట్ల మంది), రష్యన్లు(1.10కోట్లమంది), చైనీయులు (కోటిమంది), సిరియన్లు (80లక్షల మంది) వరుస స్థానాల్లో ఉన్నారు.
యూఏఈ, అమెరికా, సౌదీ వైపే మొగ్గు..
భారతీయులు అత్యధికంగా వలస వెళుతున్న దేశాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) మొదటిస్థానంలో ఉంది. 2020నాటికి యూఏఈలో 35లక్షలమంది భారతీయులు ఉన్నారు. రెండో స్థానంలో ఉన్న అమెరికాలో 27లక్షలమంది, మూడో స్థానంలో నిలిచిన సౌదీ అరేబియాలో 25లక్షల మంది ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో ఆస్ట్రేలియా, కెనడా, కువైట్, ఒమన్ దేశాలు ఉన్నాయి. వలస వెళుతున్న భారతీయుల్లో 15శాతం మంది గమ్యస్థానం ఇమిగ్రేషన్ క్లియరెన్స్ రిక్వైర్డ్ (ఈసీఆర్) దేశాలే. అన్‌స్కిల్డ్ కార్మికులు ఎక్కువగా ఉపాధి కోసం ఈ 18 ఈసీఆర్ దేశాలకు వెళుతున్నారు. ఆ జాబితాలో బహ్రెయిన్, ఖతర్, ఒమన్, ఇండొనేషియా, సౌదీ అరేబియా, ఇరాక్, సుడాన్, జోర్డాన్, దక్షిణ సుడాన్, కువైట్, సిరియా, లెబనాన్, థాయిలాండ్, లిబియా, యూఏఈ, మలేషియా, యెమెన్, అఫ్గానిస్తాన్ ఉన్నాయి.
విద్యార్థులూ ఎక్కువే...
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా భారీగానే ఉంది. కరోనా వ్యాప్తికి ముందు 2019లో 5.9లక్షలమంది విద్యార్థులు విదేశాలకు వెళ్లారు. కరోనా ప్రభావంతో 2020లో 2.6లక్షలమంది మాత్రమే విదేశాలకు వెళ్లగా... 2021లో 4.4లక్షలమంది విదేశాల్లోని విద్యాసంస్థల్లో చేరారు. 2022లో విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2022 జూన్ నాటికే 2.50లక్షలమంది విదేశాలకు వెళ్లారు. ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు వెళుతున్న దేశాల్లో కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో శాశ్వతంగా స్థిరపడేందుకు భారతీయులు గణనీయంగా మన దేశ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు.
చదవండి: మే 15 నుంచి ఏపీ ఈఏపీసెట్.. షెడ్యూల్ విడుదల
Comments
Please login to add a commentAdd a comment