న్యూఢిల్లీ: వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పించే దిశగా భారత్ ప్రవేశపెట్టిన సంస్కరణలపై బ్రిటన్ వ్యాపార సంస్థలు సానుకూలంగానే ఉన్నాయి. అయితే, వీటి అమలు వేగంపైనే వాటికి సందేహాలు వస్తున్నాయి. బ్రిటన్ ఇండియా వ్యాపార మండలి మూడో వార్షిక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ) ఇన్ ఇండియా సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్‌లో వ్యాపారాల నిర్వహణకు పరిస్థితులు మెరుగుపడ్డాయని సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 51 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇది గతేడాది నమోదైన 53 శాతం కన్నా తక్కువ కావడం గమనార్హం.
ప్రపంచ బ్యాంకు ఈవోడీబీ ర్యాంకింగ్స్‌లో భారత్ 130వ స్థానం నుంచి 100వ స్థానానికి చేరడం, భారత సార్వభౌమ రేటింగ్‌ను స్థిరమైన అంచనాలతో బీఏఏ2 స్థాయికి రేటింగ్ ఏజెన్సీ మూడీస్ పెంచడం తదితర పరిణామాల నేపథ్యంలో తాజా నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 24 మధ్యలో నిర్వహించిన ఈ సర్వేలో దాదాపు 88 కంపెనీలు పాల్గొన్నాయి. గతేడాది కంపెనీల సంఖ్య 65. భారత్‌లో అత్యధికంగా ఇన్వెస్ట్ చేసే జీ20 కూటమి దేశాల జాబితాలో బ్రిటన్ అగ్రస్థానంలో ఉంది. భారత్‌లో వ్యాపారావకాశాలపై బ్రిటన్ సంస్థలు ఆసక్తిగానే ఉన్నాయని, కేంద్ర, రాష్ట్రాలు సంస్కరణలు మరింతగా అమలు చేసిన పక్షంలో మరిన్ని పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించగలవని సర్వే నివేదిక పేర్కొంది. భారత్‌లో వ్యాపారాల నిర్వహణకు ప్రధానంగా చట్టపరమైన, నియంత్రణ సంస్థలపరమైన అడ్డంకులు ఉంటున్నాయని సర్వేలో పాల్గొన్న వారిలో 63 శాతం మంది తెలపగా.. 34 శాతం మంది అవినీతి గురించి, 39 శాతం మంది ట్యాక్సేషన్ వివాదాల గురించీ ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment